సాగు భూములు లాక్కుంటే సహించం..

వ్యవసాయ భూములు లాక్కుని కార్పొరేట్‌, విదేశీ కంపెనీలకు కట్టబెడితే చూస్తూ ఊరుకోబోమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కట్టువపల్లి, కొలనుకుదురు గ్రామాల్లో బుధవారం ఆయన పాదయాత్ర చేశారు. కట్టువపల్లిలోని సర్వే నెంబర్‌ 110 నుండి 900 వరకున్న 936 ఎకరాల భూములను చైనా కంపెనీ డలయన్‌ వాండాకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ కంపెనీ ప్రతినిధి మ్యాక్సూఅబౌట్‌ ఇటీవల ఆ భూములను పరిశీలించి వెళ్లారు. ఈ నేపథ్యంలో సాగిన పాదయాత్రలో పలువురు రైతులతో మధు నేరుగా మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. అండగా ఉండి పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకూ 10 లక్షల ఎకరాల భూములను గుంజుకోవాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. రైతులు బతుకుదెరువు కోల్పోయేలా భూములు లాక్కుంటే సహించేది లేదన్నారు. వారిచ్చే నష్టపరిహారం ఏ మూలకొస్తుందని ప్రశ్నించారు. రాజధాని పేరుతో పేద రైతుల నుంచి 30 వేల ఎకరాలు లాక్కోవడంతో ఆయా ప్రాంతాల్లో వ్యవసాయం బంద్‌ అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అసైన్‌మెంటు, సిజెఎఫ్‌ఎస్‌, ప్రైవేటు భూములను కూడా లాక్కుంటున్నారని విమర్శించారు. గ్రామాలు విడిచి పొమ్మంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న ఆధారం కోల్పోతే తామెలా బతకాలని రైతులు మధు ఎదుట వాపోయారు. రైతులు కమిటీలుగా ఏర్పడి పోరాటాలకు సన్నద్ధం కావాలని మధు వారికి సూచించారు.