సస్పెన్షన్‌పై రాజ్యసభలోరబస

 పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే దిశలో నడుస్తున్నాయి. 25 మంది కాంగ్రెస్ సభ్యులపై వేటువేస్తూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు మంగళవారం రాజ్యసభను పూర్తిగా స్తంభింపచేశారు. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన సభ పనె్నండు గంటల సమయంలో ఆరు నిమిషాలసేపు వాయిదా అనంతరం సమావేశమై కేవలం మూడు నిమిషాల మాత్రమే జరిగి రెండు గంటలకు వాయిదాపడింది. రెండు గంటలకు తిరిగి సమావేశమై ఐదు నిమిషాల పాటు పెద్దపెట్టున జరిగిన కాంగ్రెస్ నినాదాలకు సాక్షిగా నిలిచింది. ఆ తర్వాత బుధవారానికి వాయిదా పడిపోయింది. మోదీ నియంతృత్వం సాగదనీ, తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు సభను అడ్డుకున్నారు. పాలకపక్ష సభ్యులు మాత్రం పూర్తిగా వౌనం పాటించారు. తమ ప్రభుత్వానికి, నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ సభ్యులతో తలపడటానికి ఏ ఒక్కరూ సాహసించలేదు. పార్లమెంటరీ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాత్రం ఒకటి రెండుసార్లు ప్రతిపక్షాలతో వాదనకు దిగారు. పోస్టర్లు బ్యానర్లతో సభలోకి వచ్చిన కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకువచ్చారు. కాంగ్రెస్ సభ్యుడు మిస్ర్తి నల్లరంగు స్కార్ఫ్‌తో డిప్యూటీ చైర్మన్ కురియన్ స్థానం వద్ద నిలబడి నినాదాలు చేశారు. నల్లరంగు స్కార్ఫ్‌ను తీసివేయవలసిందిగా కురియన్ తీవ్రస్వరంతో మిస్ర్తిని హెచ్చరించారు.