సమ్మె నివారించాలి

వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ శుక్రవారం నుంచి మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మెకు వెళ్లబోతున్నారు. ప్రభుత్వం మీన మేషాలు లెక్కించకుండా మున్సిపల్‌ కార్మికుల న్యాయసమ్మతమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెను నివారించే మార్గం చూడాలి. అసలే వర్షాకాలం. మామూలుగానే దోమల ద్వారా, గాలి ద్వారా రోగాలు వ్యాపించే కాలం. దీనికి తోడు సమ్మె వలన అంటువ్యాధులు విజృంభిస్తే ఆ పాపం ప్రభుత్వానిదే అవుతుంది. మున్సిపల్‌ కార్మికులు ఒక రోజు విధులను బహిష్కరిస్తేనే రాష్ట్రం చెత్త కుప్పగా మారుతోంది. అటువంటిది నిరవధిక సమ్మెకు వెళ్లాలని ప్రధాన కార్మిక సంఘాలన్నీ నిర్ణయించినందున సమ్మె ఉధృతంగా సాగుతుందనడంలో సందేహం లేదు.

             చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అలవాటైన చంద్రబాబు ప్రభుత్వం మున్సిపల్‌ సమ్మె విషయంలోనూ అదే తప్పు పునరావృతం చేస్తుందా? గత పది రోజులుగా మున్సిపల్‌ శాఖామాత్యులు మున్సిపల్‌ కార్మిక సంఘాలతో చర్చల పేరుతో కాలయాపన చేయడం తప్ప వారి సమస్యల పరిష్కారానికి నిర్దిష్టంగా ఎలాంటి హామీ ఇవ్వకపోవడం చూస్తుంటే ప్రభుత్వం ప్రమాదాన్ని తెచ్చేట్లే కనిపిస్తోంది. కార్మిక సంఘాల మధ్య ఐక్యతను దెబ్బతీసి, వారి సమ్మెను విఫలం చేయడం ఎలా అన్నదానిపై పెట్టిన శ్రద్ధలో పదో వంతు వారి డిమాండ్ల పరిష్కారంపై పెడితే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు. నిరవధిక సమ్మెకు వెళ్లడం మున్సిపల్‌ కార్మికులకు సరదా కాదు. వేరే గత్యంతరం లేకనే చివరి అస్త్రంగా వాళ్లు సమ్మెకడుతున్నారు. వారి డిమాండ్లలో గొంతెమ్మ కోర్కెలేమీ లేవు. అవన్నీ అత్యంత న్యాయసమ్మతమైనవి. పదవ వేతన సంఘం సిఫారసులకనుగుణంగానే కనీస వేతనం రూ.15,432 చెల్లించాలని, పొద్దు పొడవక ముందే లేచి రోడ్లను అద్దంలా శుభ్రం చేసే తమకు ఉద్యోగ భద్రత ఉండాలని వారు కోరుతున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న జిపిఎఫ్‌, ఆరోగ్య కార్డులు తమకూ వర్తింపజేయాలని కోరుతున్నారు. ఇందులో నిర్హేతుకమైన డిమాండ్‌ ఒక్కటీ లేదు. వారేమీ మంత్రులు, శాసన సభ్యులతో సమంగా జీతాలు అడగడం లేదు. వారికి కల్పిస్తున్న సదుపాయాలు తమకూ వర్తింపజేయమని అడగడం లేదు. కేవలం తాము చేసే చాకిరీకి తగిన వేతనం చెల్లించమని మాత్రమే అడుగుతున్నారు. ఈ చిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తూ సమస్యను జటిలం చేస్తోంది. మున్సిపల్‌ మంత్రి చర్చల పేరుతో కొంతకాలం కాలయాపన చేశారు. తరువాత ఆర్థిక శాఖ మంత్రితో చర్చలన్నారు. ఆ చర్చలు కూడా పదే పదే వాయిదా వేస్తూ కాలహరణం చేస్తున్నారే తప్ప సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించి నిరవధిక సమ్మెను నివారించాలి.