కార్పొరేట్ పాలకులైన బిజెపి, టిడిపిలు కార్మిక వర్గంపై యుద్ధం ప్రకటించాయి. కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి, ఉరికొయ్యలు, చెరసాలలు, ఆత్మబలిదానాలతో సాధించు కున్న కార్మిక చట్టాలను సవరించి, కార్పొరేట్ సంస్థలు, యాజ మాన్యాలు మరింత దోపిడీ చేసుకునే విధంగా మార్పులు చేస్తున్నాయి. కార్మిక చట్టాల సవరణ సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే... ఎటువంటి హక్కులూ, రక్షణా లేని కార్మికునిగా మార్చడం. కార్పొరేట్ పాలకులు కార్మిక వర్గానికి బానిస సంకెళ్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. కార్మిక వర్గం ఉద్యమాలు, ఆత్మబలిదానాలతో రూపొం దించబడ్డ, ఐడి యాక్ట్, ట్రేడ్ యూనియన్ యాక్ట్, ఫ్యాక్టరీస్ యాక్ట్, కాంట్రాక్టు వర్కర్స్ రెగ్యులరైజేషన్ అండ్ అబాలిషన్ యాక్ట్, అప్రంటీస్ యాక్ట్, పిఎఫ్, ఇఎస్‌ఐ మొదలగు కార్మిక చట్టాలను సవరణ చేస్తున్నారు. కార్మికుడి జన్మహక్కయిన సమ్మె హక్కు లేకుండా పాలకులు ప్రయత్నిస్తున్నారు. సమ్మె చేయాలంటే ఆరు నెలల ముందు నోటీసు ఇవ్వాలి. సమ్మె ఇల్లీగల్ అని తేలితే యూనియన్‌కు రూ.50 వేల నుంచి 6 లక్షల వరకూ జరిమానా వేయొచ్చట. యూనియన్ నాయకులపైనా క్రిమినల్ కేసులు పెట్టొచ్చు అని చట్ట సవరణలు చేస్తున్నారు. మరోవైపున యాజమాన్యాలకు రక్షణ కల్పించారు
. యాజమాన్యాలు అన్‌ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్‌కు పాల్పడితే జైలు శిక్షలు రద్దు చేసి, నామమాత్రపు జరిమానాలతో సరిపెట్టారు. బిజెపి, టిడిసి అధికారంలోకి వచ్చిన తర్వాత యాజమాన్యాలు మొండిగా విర్రవీగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అండతో యాజమాన్యాలు కార్మిక ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇటీవల జరిగిన కార్మిక పోరాటాలను ఉక్కుపాదంతో అణిచారు. అరబిందో సమ్మె సందర్భంగా 69 మందిని, సరాకా ల్యాబ్ సమ్మె సందర్భంగా 48 మందిని, శ్రీ మల్లికార్జున ఫార్మాలో సమ్మె సందర్భంగా 40 మందిని తొలగించారు. స్మార్ట్‌కంలో వేతనాలను పెంచమన్నందుకు కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. చిత్తూరు జిల్లాలో ల్యాంకోలో కార్మికులు సమ్మె చేస్తే 10 మందిని సస్పెండ్ చేసి, 50 మందికి నోటీసులు ఇచ్చారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌లో ఇటీవల కార్మికునికి ప్రమాదం జరిగితే పోలీసులతో సహా ఎవ్వరినీ యాజమాన్యం లోనికి అనుమతించలేదు. శ్యాంపిస్టన్స్, ఎన్‌ఎసిఎల్, ఆంధ్రా ఆర్గానిక్స్, వరం పవర్ ప్లాంట్ పరిశ్రమల యాజమాన్యాలు చర్చల పేరుతో జాప్యం చేస్తూ మొండిగా వ్యవహరిస్తున్నాయి. గతంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌లో వేతనాలు పెంచాలన్నందుకు కార్మికులపై లాఠీఛార్జీ చేయించి, 70 మందిపై తప్పుడు కేసులు బనాయించింది. అవి నేటికీ కొనసాగుతున్నాయి. ఇటీవల యాజమాన్యాలతో చర్చల సందర్భంగా యాజమాన్యాలు చెప్పే మాట ఒకటే.
ఇప్పటివరకూ ట్రేడ్ యూనియన్ యుగం, ఇకనుంచి యాజమాన్యాల యుగం అని అంటున్నాయి. 'ఇన్నాళ్లా కాదు. ఇప్పుడు మా వైపున ప్రభుత్వం ఉంది' అని బహిరంగంగా చెబుతున్నాయి. కార్పొరేట్ కంపెనీలు చట్ట సవరణలు చట్టరూపం దాల్చక ముందే అమలుకు పూనుకుంటున్నాయి. కార్పొరేట్ సంస్థలైన అరబిందో, రెడ్డీ ల్యాబ్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పేరుతో కార్మికులకు ఎటువంటి భద్రతా లేకుండా పనిలో పెడుతున్నారు. రెడ్డీస్ ల్యాబ్‌లో మోడీ ప్రవేశపెడుతున్న ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లారుమెంట్‌కు పూనుకుంటున్నారు. ప్రాజెక్టు వర్క్‌ల పేరుతో ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లారుమెంట్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ యాజమాన్యం అమలు చేస్తోంది. ఔట్‌సోర్సింగ్ పేరుతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌లోని కార్మికులకు యాజమాన్యానికి సంబంధం లేదని చెబుతోంది. యాజమాన్యాలు కార్మికులను తీవ్రంగా దోపిడీ చేస్తున్నాయి. అదే విధంగా కాన్‌కాస్ట్ పవర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న కార్మికులను ఔట్‌సోర్సింగ్ కార్మికులు అని, పరిశ్రమతో సంబంధం లేదని యాజమాన్యం చెబుతోంది. ఇప్పటికే సరళీకృత ఆర్థిక విధానాల అమలు ప్రారంభమైన తర్వాత 1982-83లో పరిశ్రమలో కార్మికుని వేతనాల వాటా 30 శాతం కాగా, 2012-12 నాటికి 12.9 శాతానికి పడిపో యింది. అదే కాలంలో యాజమాన్యాల లాభాల వాటా 20 నుంచి 50 శాతానికి పెరిగింది. ఈ కార్మిక చట్టాలకు సరళీకరణ సవరణలు జరిగితే కార్మికుని వేతనాల వాటా 5 లేదా 4 శాతానికి పడిపోవచ్చు.
నేడు బిజెపి, టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను బ్యాంకులను, ఇన్సూరెన్స్, రైల్వే, బిఎస్‌ఎన్‌ఎల్ మొదలగు సంస్థలను కార్పొరేట్, విదేశీ సంస్థలకు ధారాదత్తం చేసి, దేశాన్ని కార్పొరేట్ కంపెనీల పాలన వైపు నెడుతున్నాయి. మరోవైపు ఆశ, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన పథకం నిధుల్లో కోత పెడుతున్నారు. ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేయడానికి పూనుకుంటున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ, ఇస్కాన్ వంటి స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చి, కార్మికులను తొలగించడానికి పూనుకుంటున్నారు. ఎన్నికల్లో బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేశారు. బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది మంది జాబులు కోల్పోయి రోడ్డున పడ్డారు. సిమెంట్, ఇసుక ధరలు పెరగటంతో గృహ నిర్మాణాలు నిలిచిపోవడంతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. గృహ నిర్మాణ శాఖ కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు. జ్యూట్, ఫెర్రోఎల్లాయీస్ పరిశ్రమలు మూతపడటంతో కార్మికులు రోడ్డున పడ్డారు. షుగర్, రైస్ అండ్ ఆయిల్ మిల్లులు కూడా మూతపడ్డాయి.
దీంతో బాబుగారు వచ్చిన తర్వాత ఉన్న జాబులు కోల్పోయాయి. నేడు ఉద్యోగ భద్రత లేని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రోడ్డు భద్రతా బిల్లు మోటారు కార్మికులకు ఉరితాడులా ఉంది. రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్లను బాధ్యులను చేస్తూ కఠిన శిక్షలు ప్రతిపాదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్‌లు, ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. సెప్టెంబర్ 2 సమ్మెకు వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపాయి. సమ్మె జయప్రదానికి ఇప్పటికే పాదయాత్రలు, గేటు మీటింగ్‌లు, జనరల్ బాడీలు, మండల సదస్సులు, బస్సు యాత్రలు, జాతాలు, బుక్‌లెట్స్, సిడిల ద్వారా విస్తృతంగా క్యాంపెయిన్ జరుగుతోంది. కార్మిక వర్గంపై యుద్ధం ప్రకటించిన కార్పొరేట్ పాలకులకు సెప్టెంబరు 2 సమ్మెలో మొత్తం ఉద్యోగులు, కార్మికులు పాల్గొని సరైన సమాధానం చెప్పాలి.
(వ్యాసకర్త సిఐటియు
శ్రీకాకుళం జిల్లా ప్రధానకార్యదర్శి)