సమస్యల వలయంలో శివారు కాలనీలు

నగరంలో పేదలు నివశించే కాలనీలలో సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు విమర్శించారు. ప్రజా సమస్యల అధ్యయనం, ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి వత్తిడి తెచ్చేందుకు సిపియం నగరంలో చేపట్టిన పాదయాత్ర మంగళవారానికి మూడోరోజుకు చేరుకుంది. గుంటూరు తూర్పు నియోజక వర్గ పాదయాత్రలో పాశం రామారావు పాల్గొని ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని సాయిబాబు కాలనీ, చంద్రబాబు కాలనీ, హూస్సేన్‌ నగర్‌, ఆనందపేటల్లో పర్యటించారు.రామారావు మాట్లాడుతూ తూర్పు నియోజక వర్గం శివారు కాలనీల్లో ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు వేసుకుని నివాసముంటున్న వారికి ఇళ్ళపట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. చంద్రబాబు కాలనీలో 540 కుటుంబాల్లో సగం మందికి బి.ఫారాలు కుడా లేవని, పారిశుధ్యం సక్రమంగా నిర్వహించక దోమలు స్వైర విహారం చేస్తున్నాయన్నారు. హూస్సేన్‌ నగర్‌ కాలనీలో డ్రైనేజి కోసం గుంటలు తీసి పని ప్రారంభించలేదని, డ్రైనేజి నీరు ఇళ్ళలోకి వస్తున్నాయన్నారు. ఆనంద పేట ప్రాంతంలో మైనార్టీలు ఎక్కువ మంది నివశిస్తూన్నారని, ఒకే కుటుంబంలో రెండు, మూడు కుటుంబాలు నివాసముంటున్నారన్నారు. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.