
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. అందులోభాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తత, లాఠీఛార్జి, అరెస్టులకు దారితీసింది. అరెస్టయినవారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాము, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాలి సుధీర్, పంపన రవికుమార్ తదితరులు ఉన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులు నిరవధిక దీక్షలు ప్రారంభించారు. కడపలో నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం, ర్యాలీలో సంఘం రాష్ట్ర కార్యదర్శి నూర్ మహమ్మద్ పాల్గొన్నారు. అనంతపురంలో కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో జరుగుతున్న వరుస సంఘటనలను నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ర్యాలీగా వెళ్లి మంత్రి పరిటాల సునీత ఇంటిని ముట్టడించారు.