సమర్థనీయం కాదు..

ఉన్నత పదవుల్లో అవినీతిపై చర్య తీసుకోవాలని పట్టుబట్టినందుకు పాతికమంది కాంగ్రెస్‌ ఎంపీలను పార్లమెంటు నుంచి అయిదు రోజులపాటు గెంటివేసిన స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ చర్య ఏ విధంగానూ సమర్థనీయం కాదు. ఇందిర ఎమర్జెన్సీకి 40 ఏళ్లు గడిచిన సందర్భంలోనే దేశంలో మోడీ ఏలుబడిలో మళ్లీ అటువంటి నిరంకుశ పోకడలు వ్యక్తమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సభ్యులు ఉద్దేశపూర్వకంగానే సభకు అంతరాయం కలిగించారని, అందుకే నిబంధనల ప్రకారం వారిపై చర్య తీసుకోవాల్సి వచ్చిందని స్పీకర్‌ తన చర్యను సమర్థించుకున్నారు. స్పీకర్‌ చెప్పిందే వాస్తవమైతే మొదట వేటు ప్రభుత్వంపై పడాలి. ఎందుకంటే సభ సజావుగా సాగకపోవడానికి ప్రభుత్వమే అసలు ముద్దాయి. అదీగాక స్పీకర్‌ ఇప్పుడు ఉటంకిస్తున్న నిబంధనలు కూడా రాజ్యాంగ నిర్మాతలు పొందుపరచినవి కావు. ఎన్డీయే-1 ప్రభుత్వ హయాంలో అప్పటి స్పీకర్‌ రూపొందించినవే. ఈ సస్పెన్షన్‌ వేటు అనేది చివరి అస్త్రంగా ఉండాలి. ఈ విషయంలో స్పీకర్‌ తొందరపాటుగా వ్యవహరించారనేది నిర్వివాదాంశం. ఇది స్పీకర్‌ నిష్పాక్షికతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రాల చట్టసభల్లో మాత్రమే కనిపించే ఈ పక్షపాత ధోరణి ఎన్డీయే ప్రభుత్వ పుణ్యమాని పార్లమెంటుకు కూడా పాకింది.
లలిత్‌గేట్‌, వ్యాపం కుంభకోణాల్లో పీకల్లోతున కూరుకుపోయిన కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌, ముఖ్యమంత్రులు వసుంధర, శివరాజ్‌ చౌహాన్‌లపై చర్య తీసుకోవాలని ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించి ఉంటే పార్లమెంటు సజావుగా సాగిపోయేది. కళంకితులపై చర్య తీసుకోవడానికి బదులు చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెప్పడం వెనక సమస్యను పక్కదారి పట్టించే కుట్ర దాగి ఉంది. ఈ విషయాన్ని గ్రహించే ప్రతిపక్షాలు ఆ ముగ్గురు రాజీనామా చేశాకే చర్చ అని తేల్చి చెప్పాయి. ప్రతిపక్షాల డిమాండ్‌లో తప్పేమీ లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్నత పదవుల్లో ఉన్నవారిపై ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై నిష్పాక్షిక దర్యాప్తును కోరడం, దర్యాప్తు ముగిసే వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఉన్నత పదవుల నుండి తప్పుకోవాలని కోరడం అసంగతమేమీ కాదు. ఇది ప్రతిపక్షాల కనీస బాధ్యత. సుష్మా స్వరాజ్‌ కూడా సోమవారం రాజ్యసభలో ఇచ్చిన వివరణలో తనపై వచ్చిన ఆరోపణలు తప్పు అని సూటిగా ఖండించలేదు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కూడా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించలేదు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ చౌహాన్‌ ఈ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తుకు పట్టుబట్టిన ప్రజావేగు ఆనంది రారు భార్య డాక్టర్‌ గౌరి రారును బదిలీల పేరుతో వేధించుకు తింటున్న వైనం చూస్తున్నాము. అయినా వీరిని కాపాడడానికే బిజెపి, మోడీ ప్రభుత్వం నిస్పిగ్గుగా ప్రయత్నిస్తున్నాయి. పైగా ప్రతిపక్షాలు సంకుచిత, వినాశకర, అభివృద్ధి నిరోధక పాత్ర పోషిస్తున్నాయంటూ ఎదురు దాడికి దిగుతున్నాయి. ఇదే బిజెపి ప్రతిపక్షంలో ఉండగా 2005లో పార్లమెంటు శీతాకాల సమావేశాలను మొత్తంగా స్తంభింపజేసింది. అవినీతి ఆరోపణలెదుర్కొన్న యుపిఎ-2 ప్రభుత్వంలో మంత్రులు రాజీనామా చేసే దాకా పార్లమెంటును నడవనీయలేదు. ఆనాడు తాము చేసింది కరెక్టు, ఈనాడు ప్రతిపక్షాలు చేసింది తప్పు అన్నట్లుగా బిజెపి మాట్లాడడం దాని ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. కళంకిత నేతలు రాజీనామా చేయాల్సినంత నేరం ఏమీ చేయలేదనేది బిజెపి నాయకులు ముందుకు తెస్తున్న మరో వాదన. అధికార దుర్వినియోగం, క్రోనీ కేపిటలిజం, క్విడ్‌ ప్రోకో కలగలిసిన ఈ కుంభకోణాల్లో సుష్మ, వసుంధర, చౌహాన్‌ల పాత్ర నిస్సందేహంగా తప్పే. వీరిపై చర్య తీసుకోకుండా ఈ అంశాన్ని లేవనెత్తిన ఎంపీలపై చర్య తీసుకోవడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే. పశ్చిమ దేశాల్లోని పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలు, సంప్రదాయాల గురించి మాట్లాడే బిజెపి నాయకులు మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృక అయిన బ్రిటన్‌లో అనుసరించిన పద్ధతి గురించి ఎందుకు మాట్లాడరు? 2001లో బ్లెయిర్‌ ప్రభుత్వంలోని మంత్రి పీటర్‌ మండేల్సన్‌పై వచ్చిన ఆరోపణలు బిజెపి నేతల త్రయంపై వచ్చిన ఆరోపణలతో పోల్చితే చాలా చిన్నవే. మిలీనియం డోమ్‌ కట్టేందుకు హిందూజా సోదరుల్లో ఒకరైన శ్రీచంద్‌ నుంచి విరాళం తీసుకుని, ఆయనకు పాస్‌పోర్టు సత్వర మంజూరుకు మంత్రి సహకరించారనేది ఆయనపై వచ్చిన అభియోగం.

సాధారణంగా 20 మాసాలకు వచ్చే పాస్‌పోర్టు మంత్రి సిఫారసు వల్ల ఆరు మాసాలకే వచ్చింది. వాస్తవానికి ఇదేమీ నేరం కాదు. అయినా దీనిపై బ్రిటిష్‌ పార్లమెంటులో సభ్యులు ప్రశ్నించడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. సుష్మా స్వరాజ్‌ వ్యవహారం అటువంటిది కాదు. ఈ దేశ చట్టాల నుంచి తప్పించుక ోవడానికి లండన్‌ పారిపోయిన నేరస్థుడు లలిత్‌మోడీ. అటువంటి వ్యక్తికి సాధారణ వీసా మంజూరుకు సుష్మ సిఫారసు చేశారు. అదీగాక లలిత్‌ మోడీ కంపెనీ తరపున సుష్మ భర్త, కుమార్తె అడ్వకేట్లుగా పనిచేస్తున్నారు. కాబట్టి ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌ అత్యంత సహేతుకమైనది. అందుకే ప్రతిపక్షాలన్నీ ఈ విషయమై ఏకమై ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టేందుకు ప్రయత్నించాయి. దీనిని జీర్ణించుకోలేని బిజెపి స్పీకర్‌ను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష ఎంపీలపై వేటు వేయడం గర్హనీయం. పార్లమెంటు సమావేశాలు ముగియడానికి ఇంకా పది రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ కొద్ది రోజులైనా సభ సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం సహకరించాలి. ప్రతిపక్షాలు చేసిన సమంజసమైన డిమాండ్‌ను అంగీకరించి ఆ ముగ్గురినీ ఇంటికి సాగనంపాలి. ప్రస్తుత ప్రతిష్టంభన తొలగింపుకు ఇదొక్కటే మార్గం.