సంస్కారం

తాము నమ్మిన సంప్రదాయమే సంస్కారం అనుకునేవారికి నిజమైన మానవీయ స్పర్శ ఎలా వుంటుందో చూపించడం అంత సులభం కాదు. చలనం లేని వాళ్లను కదిలించాలంటే సంచలనం తీసుకురావలసి వుంటుంది. ఓ నాలుగు దశాబ్దాల కిందట భారత దేశానికి ప్రత్యేకించి దక్షిణ భారత దేశానికి ఆ విధమైన అనుభవం ఇచ్చిన కన్నడ నవల 'సంస్కార'. సాహిత్య కారులు పాఠకులు ఎవ రైనా సరే ఇతర భాషల దేశాల పుస్తకాలుకూడా చూడకుండా అవగా హనా పరిధి పెంచుకోలేరు.కనీసం ప్రసిద్ధ రచనలు ప్రసిద్ధుల రచనలైనా చూడకపోతే అదొక లోటుగానే వుండిపోతుంది. అందుకే 'సంస్కార' తెలుగు అనువాదం ఇప్పుడు ప్రజాశక్తి ప్రచురణగా రావడం స్వాగతించదగింది. తెలుగులో సమస్యాత్మక నవలలే తక్కువగా వస్తున్న తరుణం. ఒకప్పుడు పెద్ద ఉద్యమంగా నడిచిన ఉత్తమ గ్రంథానువాద ప్రక్రియ దాదాపు ఆగిపోయింది. కనుకనే సనాతనుల నుంచి నిశిత విమర్శలనూ పురోగాముల ప్రశంసలనూ అందుకొన్న సంస్కార తెలుగులో మలి ముద్రణగా రావడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవలసి వుంటుంది. 1960 లలో కర్ణాటక బ్రాహ్మణ సమాజంలోని విలువలనూ విడ్డూరాలనూ విశ్వాసాలను వాటికి ఎదురైన సవాళ్లనూ సంఘర్షణలనూ ఈ నవలలో యు.ఆర్‌.అనంతమూర్తి అత్యద్భుతంగా చిత్రించారు. మరీ ముఖ్యంగా అతి చాందసులుగా కనిపించే వారి ద్వంద్వత్వాన్నీ వాటికి బలవుతున్న అసహాయుల ఆర్తనాదాలనూ వీటిపై తిరగబడే వారి సాహసాలనూ సామాజిక వాస్తవికతనూ కూడా ఆయన కళ్లకు కట్టాడు. పఠాభి స్నేహలత జంట దీన్ని చలన చిత్రంగా రూపొందించడం, 1970లలో నవ్య చిత్రాలకు అదో సంకేతం కావడం తెలిసిన విషయాలే. సుజాతా పట్వారి మాతృభాషే కన్నడం గనక ఎక్కడా అనువాదంలా అనిపించదు. భాష పరంగా రెండింటి మధ్య సారూప్యాన్నీ, స్వల్ప సమస్యలనూ కూడా ఆమె ముందుమాటలోనే వివరించారు. ఈ అనువాద క్రమంలో తనకు కలిగిన అనుభవాలను కూడా ఆమె పాఠకులతో పంచుకున్నారు. మూల రచయితను గౌరవిస్తూనే తాను ఏకీభవించలేని భాగాలను కూడా పేర్కొన్నారు. తెలుగు అనువాదానికి తెలకపల్లి రవి ముందుమాటలో నవల పూర్వాపరాలను ప్రస్తావించడమే గాక అనువాదకురాలి అభిప్రాయాలను కూడా విశ్లేషించారు. మొత్తంపైన సంస్కార కథాగమనం పాఠకులను కట్టిపడేస్తుంది. పరిమాణంలో చిన్నదైనా ప్రమాణాల రీత్యా ఉన్నత స్థాయినందుకోవడం ఈ నవల విశేషం. 
- పీపీ

సంస్కారం (నవల) : యు.ఆర్‌.అనంతమూర్తి, తెలుగు: సుజాత పట్వారి, ధర: 80/-, పేజీలు: 136, ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌ హౌస్‌, 27-1-54, ఏలూరు రోడ్‌, గవర్నర్‌ పేట, విజయాడ-2, ఫోన్‌: 0866-577533. మరియు ప్రజాశక్తి అన్ని బ్రాంచీలు.