సంఘ విద్రోహ శక్తుల్ని ఐక్యంగా ఎదుర్కొవాలి

పేదలు ఐక్యంగా ఉండటం ద్వారా సంఘ విద్రోహ శక్తుల్ని ఐక్యంగా ఎదుర్కొనాలని నాయకులు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 9న రౌడీమూకల దాడిలో తీవ్రంగా గాయపడిన సుందరయ్య కాలనీ సిపిఎం నాయకుడు కె ఆంజనేయులు చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయిన సందర్బంగా గురువారం రాత్రి కాలనీలో బహిరంగ సభ నిర్వహించారు. తొలుత ఆర్టీవో కార్యాలయం నుండి కాలనీకి ర్యాలీ నిర్వహించారు.సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ ఆంజనేయులుకు చికిత్స అందించి కోలుకునేట్లు చేయటంలో జిజిహెచ్‌ వైద్యుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారు ఏపార్టీ అధికారంలో ఉంటే వారి పంచన చేరి పేదలకు అన్యాయం చేస్తున్నారని, అలాంటి వారు ఎవరైనా ప్రజా ఉద్యమాల్లో కొట్టుకుపోతారని హెచ్చరించారు. రౌడీలను చేర్చుకోవద్దని పార్టీలకు హితవు పలికారు. ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారిని క్రమబద్దీకరిస్తామని ప్రగల్బాలు పలికిన ప్రభుత్వం దరఖాస్తు చేసిన వారికి మొండి చేయి చూపిస్తున్నారని, వివాదం లేని భూముల దరఖాస్తులను కూడా తిరస్కరిస్తున్నారని తెలిపారు. కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం 15లక్షల ఎకరాలతో ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తుందని, భవిష్యత్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఈనేపధ్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఈనెల 22న నిర్వహిస్తున్న ఛలో విజయవాడను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపియం రాష్ట్ర క‌మిటీ స‌భ్యురాలు డి.రమాదేవి మాట్లాడుతూ కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పేదలు ఐక్యంగా ఉండాలని కోరారు. ఆంజనేయులుపై దాడికి పాల్పడిన వారు పునరాలోచించుకోవాలని, అట్టడుగు వర్గాల ప్రజలకు అండగా ఉండే ఎర్రజెండాను దెబ్బతీయాలనుకుంటే ప్రజలు తగిన విధంగా బుద్దిచెబుతారని హెచ్చరించారు. దాడికి గురైన కె.ఆంజనేయులు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి ఐక్యంగా కృషి చేద్దామని ఉత్తేజపూరితంగా మాట్లాడారు.మాజీ ఎమ్మెల్సీ కెయస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం చేపట్టిన ఏపార్టీ పేదలకు ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదన్నారు. కమ్యూనిస్టులు పోరాడి పేదలతో గుడిశెలు వేయించారన్నారు. వారి పోరాటంతో పలు కాలనీలు ఏర్పాటయ్యాయన్నారు. సుందరయ్య కాలనీ అభివృద్ధికి తన సహకారం కొనసాగిస్తానని చెప్పారు. త్వరలో రూ.30లక్షల వ్యయంతో ఎంవిఎస్‌ కోటేశ్వరరావు స్మారక చిహ్నంగా కాలనీలో స్కూల్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.