సంఘ్ సర్కార్‌..

దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులపాటు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌), కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన పరస్పర అవగాహన భేటీ లౌకికవాదం, జాతి సమగ్రతలను ప్రశ్నార్ధకం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ సహా పలువురు మంత్రులు సంఫ్‌ు ప్రముఖుల వద్దకెళ్లి తమ ప్రోగ్రెస్‌ రిపోర్టులు సమర్పించడం ద్వారా కేంద్ర సర్కారు ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రణలో నడుస్తోందని చెప్పకనే చెప్పారు. తమ సమావేశం సమాచార మార్పిడి కోసమని ఇరుపక్షాలూ పైకి చెబుతున్నా ఆర్‌ఎస్‌ఎస్‌ మతతత్వ ఎజెండాను అమలు పరచడానికి కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసిన సమావేశమన్నది స్పష్టం. ఎన్‌డిఎ ప్రభుత్వానికి సంఫ్‌ు రిమోట్‌ కంట్రోల్‌లా పని చేస్తోందని ప్రతిపక్షాలు, లౌకిక, ప్రజాస్వామ్య వాదులు ఆందోళన వ్యక్తం చేయగా అవన్నీ విమర్శలు, ఆరోపణలుగా తోసిపుచ్చుతూ వచ్చిన బిజెపి, సంఫ్‌ు సంచాలక్‌లు ఇప్పుడు తమ ముసుగు తొలగించారు. దేశ అంతర్గత భద్రతను కాపాడాల్సిన హోం మంత్రి రాజ్‌నాధ్‌ రెండు రోజుల్లో రెండు విధాలుగా మాట్లాడి ప్రజలను గందరగోళపర్చడానికి ప్రయత్నించడం దారుణం. బైఠక్‌ ముగిసిన వెంటనే ప్రభుత్వ పనితీరుపై అసలు చర్చించనేలేదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తమకు సలహాలు మాత్రమే ఇచ్చింది తప్ప ప్రభుత్వానికి ఆదేశాలివ్వలేదని బుకాయించారు. మీడియాలో వార్తలు, ప్రతిపక్షాల విమర్శలతో కన్నంలో దొరికిన దొంగలా మారింది హోం మంత్రి పరిస్థితి. మరుసటిరోజు అదే పెద్ద మనిషి విద్య, సంస్కృతి, ఆర్థికం, జాతీయ భద్రత, సామాజిక సామరస్యంపై చర్చించినట్లు అంగీకరించారు. ప్రధాని, తాను సంఫ్‌ులో కొనసాగుతున్నామని ముక్తాయించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తులు అదే రాజ్యాంగ సూత్రాలు, ప్రమాణాలకు తిలోదకాలివ్వడం, చట్టం, ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేని సంస్థకు దాసులుగా మారడం ప్రజాస్వామ్య మర్యాద, గౌరవాన్ని మంటగలపడమే. లౌకిక భారత దేశాన్ని మతతత్వ ఆర్‌ఎస్‌ఎస్‌కు రాజకీయ విభాగంగా మార్చివేయడం రాజ్యాంగానికి విరుద్ధం. ప్రజలు పోరాడి సాధించుకున్న స్వాతంత్య్రానికి, ప్రజాస్వామ్యానికి వెక్కిరింత. 
హిందూ రాజ్య స్థాపనే తన సైద్ధాంతిక ప్రాజెక్టు అని ఆర్‌ఎస్‌ఎస్‌ బహిరంగంగా తన ఎజెండాను ప్రకటించింది. అనేక జాతులు, భాషలు, ప్రాంతాలు, సంస్కృతి, సంప్రదాయాలతో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మన భారతదేశం. మన రాజ్యాంగ మౌలిక సూత్రం లౌకికవాదం. రాజ్యాంగాన్నే సవాల్‌ చేసే ఎజెండాను తలకెత్తుకొని అమలు చేస్తానంటోంది సంఫ్‌ు. అలాంటి కాలనాగు పడగ నీడలో కేంద్ర ప్రభుత్వం పని చేస్తే భారత జాతి సమగ్రత ఏమవుతుంది? జాతి సమగ్రతను పరిరక్షించాల్సిన హోం, రక్షణ మంత్రులు సంఫ్‌ు ప్రముఖులకు నివేదికలు ఇచ్చారంటే పరిస్థితి ఎంత ప్రమాదపుటంచులకు చేరుకుందో ఊహించడానికే భయమేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ చట్ట విరుద్ధ సంస్థ కాదని, సంఫ్‌ు సేవకులుగా కొనసాగుతున్న మంత్రులకు సూచనలు, సలహాలు ఇవ్వడంలో తప్పేమీ లేదని సమర్ధించుకుంటున్నారు ప్రముఖ్‌లు. హిందూ రాజ్య స్థాపన నినాదం రాజ్యాంగానికి విరుద్ధమైనదైనప్పుడు ఆ ఎజెండా కలిగిన సంస్థ చట్టబద్ధమైందెలా అవుతుందో సదరు సర్‌ సంచాలక్‌లే చెప్పాలి. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన దుర్మార్గ చరిత్ర ఆర్‌ఎస్‌ఎస్‌ది. బాబ్రీ మసీదు కూల్చివేత వంటి ఘాతుకాలకు ప్రత్యక్ష కారణమై పలుమార్లు నిషేధించబడిన సంస్థ. సమాజాన్ని కలిషితం చేసే హింసాత్మక చరిత్ర పెట్టుకొని తమతో మంత్రులు మాట్లాడితే తప్పేమిటనే సంచాలక్‌ల వాక్‌ చాపల్యం, దానికి మంత్రులు తాళం వేయడం బరితెగింపు తప్ప మరేం కాదు. 
కాశ్మీర్‌ సమస్య, పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదం, జమ్మూకాశ్మీర్‌లో పరిస్థిలు, నక్సల్‌ సమస్యలపై ఆర్‌ఎస్‌ఎస్‌తో చర్చించడమేంటి? పరిష్కారానికి అది ఏం సలహాలిస్తుంది? విద్యను కాషాయీకరించే మార్పులు చేపట్టాలని మంత్రి స్మృతీ ఇరానీకి హితబోధ చేసింది. సైనికులకు ఒకే ర్యాంక్‌- ఒకే పింఛను అమలు చేయాలని సంఫ్‌ు ఆదేశించిందే తడవు రక్షణ మంత్రి ఆ మేరకు ప్రకటన చేయడాన్నిబట్టి 'రిమోట్‌కంట్రోల్‌' పవర్‌ అందరికీ అర్థమైపోయింది. తాను ఆడమన్నట్లు కేంద్రం ఆడుతున్నందున, తన ఎజెండాకనుగుణంగా పని చేస్తున్నందున మోడీ సర్కారు సరైన దారిలో నడుస్తోందని సంఫ్‌ు కితాబిచ్చింది. తన మతతతత్వ విధానాలనూ, సామ్రాజ్యవాదులకు అనుకూలమైన చర్యలనూ తీసుకుంటున్నందునేకృతజ్ఞత, కృతనిశ్చయం, నిబద్ధత ప్రభుత్వానికి ఉన్నాయంటోంది ఆర్‌ఎస్‌ఎస్‌. సమాజంలో చీలికలు తెచ్చి దేశ భద్రత, సమగ్రతలకు భగం కలిగించే ఉన్మాద, ఛాందస శక్తులను ప్రభుత్వాలు అణచివేయాల్సిందిపోయి, వాటి మార్గదర్శకత్వంలో పని చేయడం జాతికి విపత్తు. ఈ ప్రమాదకర చర్యలను ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖండించాలి, ఎండగట్టాలి.