సంఘానికి కట్టడి?

విద్యాలయాల్లో ర్యాగింగ్‌, ఈవ్‌ టీజింగ్‌, వ్యవస్థాగత లోపాలను నిరోధించలేని ప్రభుత్వం, ఆ దారుణాలపై నిలదీసే విద్యార్థి సంఘాలపై ఉక్కుపాదం మోపడం దుర్మార్గం. నిన్న రిషితేశ్వరి, నేడు మధువర్ధనరెడ్డి ర్యాగింగ్‌ భూతానికి బలయ్యారు. సునీత మరణం వివాదాస్పదంగా మారింది. ఆ మరణాలపై నిరసనలు మిన్నంటాయి. నాగార్జున వర్శిటీ ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని రిషితేశ్వరి ఉదంతంపై పెద్ద ఉద్యమమే లేచింది. కళాశాలల్లో ర్యాగింగ్‌ మహమ్మారి స్వైర విహారం చేస్తున్నా నిద్ర వీడని సర్కారు, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు విద్యార్థి సంఘాలను కట్టడి చేయాలనుకోవడం మూర్ఖత్వం. రిషితేశ్వరి మరణాన్ని ఎంత దాచి పెట్టాలని చూసినా దాగలేదు సరికదా ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టింది. పాప పరిహారార్థం విద్యార్థిని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, ఇళ్ల స్థలం ప్రకటించి చేతులు దులుపుకుంది సర్కారు. మంత్రివర్గంలో విద్యార్థిని మృతిపై చర్చించారంటే మనసుండి కాదు. ఆందోళనల పర్యవసానమే. ర్యాగింగ్‌ను అరికట్టే చర్యలపై కంటే విద్యార్థుల ఆందోళనలను ఎలా నిరోధించాలో కేబినెట్‌ ఉత్సాహపడటం దారుణం.

విద్యార్థులు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారంటూ పనికిమాలిన చర్చ చేయడం కేబినెట్‌ స్థాయికే అవమానం. విద్యాసంస్థల్లో కులాలు, మతాలు, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విద్రోహ శక్తులను అడ్డుకోవాల్సిందే. ఆ పేరుతో మొత్తానికే సంఘాలను రద్దు చేయాలనే వాదన ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి పూర్తి విరుద్ధం. యథా రాజా తథా పోలీస్‌... ముఖ్యమంత్రి చంద్రబాబు అలా ఆలోచించారో, లేదో ఇలా గుంటూరు పోలీసులు చెలరేగిపోయారు. ఊరేగింపుల్లో పాల్గొనవద్దని హెచ్చరిస్తూ నాగార్జున వర్శిటీలో పోస్టర్లు వేసి అత్యుత్సాహం చూపారు. ప్రదర్శనలు, రాస్తారోకోలు, ధర్నాల్లో పాల్గొంటే మూడేళ్ల జైలుశిక్ష, జరిమానా అంటూ ఐపిసి సెక్షన్లను కోట్‌ చేసి మరీ విద్యార్థులను భయభ్రాంతులను చేయడం క్షమించరానిది. రిషితేశ్వరి మృతి చెంది మూడు వారాలైనా కేసు దర్యాప్తులో ఏమాత్రం పురోగతి సాధించకుండా, ఆరోపణలెదుర్కొంటున్న ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేయకుండా, ర్యాగింగ్‌ నిరోధంపై ముందస్తు చర్యలు చేపట్టకుండా విద్యార్థుల ఆందోళనలపై ఖాకీల జులుం సర్కారు నియంతృత్వ పోకడను అద్దం పడుతోంది. 
తమ సమస్యలపై విద్యా సంస్థల యాజమాన్యాలు, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడానికి, పరిష్కారం కోసం ఆందోళనలు చేయడానికి విద్యార్థులు సంఘం పెట్టుకోవడం నేరం కాదు. ఎక్కడైనా, ఎవరైనా సంఘం పెట్టుకునే హక్కును రాజ్యాంగం మనకు ప్రసాదించింది. ప్రజాస్వామ్య దేశంలో భావి పౌరులుగా ఎదగడానికి విద్యార్థి సంఘాల్లోనే బీజాలు పడతాయన్న విషయం ఏలికలకు తెలియందేమీ కాదు. స్వాతంత్య్రోద్యమం, సామాజికంగా అణచివేతకు గురవుతున్న వర్గాలకు రిజర్వేషన్లు, తదితర చారిత్రాత్మక ఉద్యమాల్లో విద్యార్థుల పాత్ర ఎనలేనిది. ఎంతో మంది మహామహులు, రాజకీయవేత్తలు రాటుదేలడానికి విద్యార్థి సంఘాలే పునాది. ఇప్పుడు విద్యార్థి సంఘాలపై కత్తిగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయనతో రాజకీయ దోస్తీ కట్టిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విద్యార్థి సంఘాల నుంచి ఎదిగినవారే. ఇటీవలి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు టిడిపి మద్దతిచ్చింది. తనకు నచ్చిన వ్యవహారం కనుక అధికారంలోకి రాగానే కేసులు ఎత్తేసింది. ఇప్పుడు తన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకు తట్టుకోలేక విద్యార్థి సంఘాలను దోషులను చేసి నియంత్రించడం అవకాశవాదమేగా?
             సమైక్య రాష్ట్రానికి చంద్రబాబు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు విద్యార్థి సంఘాల ఉద్యమాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించడాన్ని పట్టలేక పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీల్లో ఎన్నికల రద్దును ఎలా మర్చిపోగలం? ప్రపంచబ్యాంకు ఆదేశాలతో ప్రభుత్వంలో పర్మినెంట్‌ ఉద్యోగులను తగ్గించారు. బ్యాక్‌లాగ్‌తో సహా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని అప్పట్లో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించినప్పుడు అసలు విద్యార్థి సంఘాలే వద్దని హూంకరించారు. తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పని చేస్తున్న తెలుగు విద్యార్థి సంఘం విభాగాన్ని రద్దు చేశారు. నాటి టిడిపి ప్రభుత్వ విధానాలపై విద్యార్థులు నిర్వహించిన ఉద్యమం ఆ పార్టీని పదేళ్లు ప్రతిపక్షానికి పరిమితం చేసింది. విభజననంతర ఎపికి సిఎం అయిన చంద్రబాబు మళ్లీ పాత ఒరవడిని ముందుకు తెచ్చి తాను మారలేదని నిరూపించుకున్నారు. నాగార్జున, ఆంధ్రా వర్శిటీలకు గతంలో విసిగా చేసి విద్యార్థుల నిరసనలు ఎదుర్కొన్న సింహాద్రిని తిరిగి నాగార్జున వర్శిటీకి విసిగా నియమిస్తున్నారంటే ఎంతగా విద్యార్థుల ఆందోళనలపై ఉక్రోషంగా ఉన్నారో అర్థమవుతోంది. ఇప్పటికే విద్య ప్రైవేటీకరణతో విద్యార్థుల్లో సంఘ ఆలోచనలు మసకబారుతున్నాయి. కార్పొరేట్ల దారుణాలెన్నో బయటకు రావట్లేదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల సమస్యలను ఎలుగెత్తే సంఘాలను ప్రభుత్వం నిరోధించడం ప్రజాస్వామ్యానికే విఘాతం.