
ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితినీ, పరిణామాలనూ 1930 నాటి ఆర్థిక సంక్షోభ పరిణామాలతో పోల్చుతూ.. ఇటీవల లండన్ బిజినెస్ స్కూలులో జరిగిన సదస్సులో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురాం రాజన్ చేసిన ప్రసంగం సంచలనాన్నే సృష్టించింది. జాగ్రత్త వహించకపోతే 1930 నాటి పరిణామాలు పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఐఎంఎఫ్ మాజీ ఆర్థిక సలహాదారుగానూ, పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న భారతదేశ రిజర్వు బ్యాంక్‌కు గవర్నర్‌గానూ ఉన్న వ్యక్తి చెప్పిన ఏ వ్యాఖ్యలకైనా విలువ ఉంటుంది. రఘురాం రాజన్ వ్యాఖ్యలు కూడా ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ వర్గాల్లోనూ, బూర్జువా ఆర్థిక శాస్త్రవేత్తల్లోనూ అటువంటి ప్రభావాన్నే కలుగజేశాయి. ఇప్పటి వరకూ ప్రధానమైన ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌తో సహా అనేక మంది ఆర్థిక శాస్త్రవేత్తలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందనీ, 2007-08లో వచ్చిన ఆర్థిక మాంద్యం పరిస్థితులు క్రమంగా తొలగిపోతున్నాయనీ, పరిస్థితి ఆశాజనకంగా ఉందనీ చెబుతున్న నేపథ్యంలో.. రాజన్ చేసిన హెచ్చరిక ఎంతో ప్రాధాన్యతను సంతరించుకోవడమేగాక ఈ శక్తుల్లో ఎంతో ఆందోళన కూడా రేకెత్తించింది. మొదటి నుంచీ అనేకమంది మార్కి ్సస్టు ఆర్థిక శాస్త్రవేత్తలు, కొంతమంది స్వతంత్ర ఉదారవాద ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని చెబుతున్నప్పటికీ, దాన్ని పక్షపాత వ్యాఖ్యానంలాగా కొట్టివేస్తూ వచ్చారు. అయితే రాజన్ వ్యాఖ్యలను అంత సులభంగా తిరస్కరించడం వారికి సాధ్యం కాదు.
అందుకే తెరచాటున జరిగిన పరిణామాల ఫలితంగా రాజన్ వ్యాఖ్యానంలోని అసలు అర్థం ఇదంటూ ఆర్‌బిఐ ప్రత్యేక ప్రకటన చేయాల్సి వచ్చింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందనిగానీ, పరిస్థితులు దిగజారుతున్నాయనిగానీ, మాంద్యం రాబోతున్నదనిగానీ రాజన్ చెప్పలేదనీ, వివిధ దేశాలు దేనికదే నిర్ణయాలు తీసుకోకుండా సమిష్టిగా చర్చించుకొని ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కోవాలనీ, లేకపోతే ఒకరికి లాభం, మరొకరికి హాని జరుగుతుందని చెప్పడమే ఆయన ఉపన్యాసంలోని సారాంశమని ఆర్‌బిఐ ప్రకటన విడుదల చేసింది. రాజన్ వ్యాఖ్యల తీవ్ర పర్యవసానాలను రూపుమాపుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వాస్తవాలను మరుగుపరచడం అంత సులభం కాదు. ఇప్పటి వరకూ తన మాటలకు అంతరార్థం ఏమిటో రాజన్ బయటకు చెప్పడం లేదు. కానీ ఆర్‌బిఐ స్పందించడమే పెద్ద విశేషం.
2007-08లో అమెరికానూ, ఆ తరువాత ప్రపంచాన్నీ కుదిపేసిన ఆర్థిక మాంద్యం పరిస్థితులను ముందుగానే పసిగట్టి హెచ్చరించిన కొద్దిమంది ఆర్థిక శాస్త్రవేత్తల్లో రాజన్ ఒకరు. అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడి మార్కెట్ స్వేచ్ఛ పేరుతో విశృంఖలంగా వ్యవహరించిన తీరు ఎలాంటి పర్యవసానం సృష్టిస్తుందో కొన్ని ప్రామాణిక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్పగలిగారు. మాంద్యాన్ని ఎదుర్కొనే పేరుతో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాన్ని సాధనంగా వినియోగించుకొని తీసుకున్న నిర్ణయాలు, మళ్లీ ప్రతికూల పరిస్థితులకు దారితీస్తాయని రాజన్ చాలా కాలం నుంచే చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వం మాంద్యం నుంచి బయటపడటానికి దాదాపు ఐదారు శాతంగా ఉన్న వడ్డీ రేట్లను ఒక శాతానికి తగ్గించుకోవాల్సి వచ్చింది. ఉద్దీపన పథకాలనూ అమలు చేసింది. ఇలాంటి పద్ధతులనే చైనా, భారత్, ఇంకా అనేక దేశాలు కూడా అమలు చేశాయి.
ఈ పద్ధతి ద్రవ్య లోటును పెంచీ, దేశాల అప్పులను పెంచీ తిరిగి అప్పులు కట్టలేని స్థితి ఏర్పడుతుందనీ, అది మరిన్ని దుష్పరిణామాలకు దారితీస్తుందనీ రాజన్ వంటి ఆర్థిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సంక్షోభ సమయంలో కార్పొరేట్లనూ, కార్పొరేట్ సంస్థలనూ దివాళా తీయకుండా కాపాడడడం ఉద్దీపన పథకాలు లక్ష్యం కాకూడదనీ, సామాన్య ప్రజల కొనుగోలు శక్తినీ, ఉపాధినీ పెంచేందుకూ, తద్వారా సరుకుల గిరాకీని పెంచి ఆర్థిక మాంద్యం నుంచి బయట పడేందుకు ఉద్దీపన పథకాలు ఉపయోగపడాలని మార్క్సిస్టు ఆర్థికవేత్తలూ, ప్రజాస్వామ్య భావాలు గల రాజకీయ వేత్తలూ చెబుతూ వచ్చారు. ఇటువంటి సూచనలను పాటించనందున ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు ఉద్దేశించిన ఉద్దీపన పథకాలు ఆర్థిక పరిస్థితిని కుంగదీసే పథకాలుగా మారిపోయాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు మళ్లీ ఏ దేశానికి ఆ దేశం తమ దేశాల్లో ఉన్న ఉద్దీపన పథకాలను ఉపసంహరించుకునేందుకూ, వడ్డీ రేట్లు పెంచేందుకూ, స్వదేశీ వ్యాపారాన్ని రక్షించేందుకూ అనేక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ విషయాల్లో ముఖ్యంగా అమెరికా తీసుకునే నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికా తాను వడ్డీ రేట్లు పెంచడానికి ప్రయత్నిస్తే ఇతర దేశాల్లో పెట్టుబడుల రాకపోకల పైన, అలాగే వివిధ దేశాల మారక ద్రవ్యాల విలువ పైన తీవ్ర ప్రభావం పడి ఆర్థిక వ్యవస్థ ఒత్తిళ్లకు గురై, స్టాక్ మార్కెట్లు ఎగుడుదిగుళ్లకు గురవుతాయి. ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో డాలరు రూపంలో విదేశీ మారక ద్రవ్యంపై ఆధారపడే వర్ధమాన దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయి. అమెరికా ఇప్పుడు ప్రపంచ దేశాలను సంప్రదించకుండా తన స్వప్రయోజనాలకు అనుగుణంగా ద్రవ్య విధాన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాల పట్ల రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైన పేర్కొన్న వ్యాఖ్యలు కూడా ఈ నేపథ్యంలో వెలువడినవే.
రాజన్ వ్యాఖ్యల తీవ్రతను తక్కువ చేయాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా, వాటిలోని కొంత వాస్తవాన్ని తాజాగా గ్రీస్‌లో జరుగుతున్న పరిణామాలు మన కళ్లకు కట్టినట్లు చూపుతున్నాయి. గ్రీసు దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఈ జూన్ నెల 30 లోపల ఐఎంఎఫ్‌కు కట్టాల్సిన వాయిదా సొమ్మును కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చింది. గ్రీస్ ఆర్థిక వ్యవస్థను బయటపడేసేందుకు 19 యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులూ, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుల వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలూ దాదాపు 50 బిలియన్ల డాలర్లను అప్పుగా వాగ్దానం చేశాయి. దానికి ప్రతిగా కార్మికుల జీతాలు తగ్గించడానికీ, పెన్షనర్ల సొమ్ములో కోత పెట్టడానికీ, ప్రజలకిచ్చే అనేక రాయితీలనూ, సౌకర్యాలనూ తొలగించడానికీ నిర్ణయాలు తీసుకోవాలని గ్రీస్ ప్రభుత్వం మీద యూరోపియన్ దేశాలు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాయి. పొదుపు చర్యలనే ముద్దుపేరుతో పిలవబడుతున్న ఈ ప్రజావ్యతిరేక చర్యలను గ్రీక్ ప్రజలు, వారెన్నుకున్న సిరిజా వామపక్ష ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఈ ధిక్కారానికి ప్రతిగా గ్రీస్‌కు చేస్తామన్న సాయం మొత్తాన్ని రుణదాతలు, రుణ సంస్థలవారు నిలిపివేశారు. రాబోయే కొద్ది రోజుల్లోనైనా ఈ ప్రతిష్టంభన పరిష్కారం కాకపోతే గ్రీస్ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అటు అమెరికా ఏకపక్ష నిర్ణయాలూ, ఇటు అంతర్జాతీయ అప్పులవాళ్లూ, వివిధ దేశాలపై చేస్తున్న ఒత్తిళ్లూ కలిసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దిగజార్చుతాయి. ఇలాగే కొనసాగితే రాజన్ చేసిన హెచ్చరికలు నిజం కూడా అవుతాయి. రాజన్ సోషలిస్టేమీ కాదు. మార్కి ్సస్టు ఆర్థిక శాస్త్రవేత్త కూడా కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థ స్థిరంగా ఉండాలని కోరుకున్నవాడు.
పరస్పర వినాశకర పోటీని విరమించుకోవాలనీ, కష్టాలను కలిసి అధిగమించాలనీ పెట్టుబడిదారీ వర్గానికి సలహా ఇస్తున్న ఆర్థిక శాస్త్రవేత్త ఆయన. ప్రస్తుత ఆర్థిక మాంద్యాన్ని ఎలా అధిగమించాలనే విషయం అంతర్జాతీయ పాలకవర్గాల్లోనూ, వారి మద్దతుదారులైన ఆర్థిక శాస్త్రవేత్తల్లోనూ పరిష్కారాల గురించి తలెత్తిన వైరుధ్యాల ఫలితమే ప్రస్తుత వివాదం. రోగ లక్షణాన్ని అనేకమంది గుర్తించ నిరాకరిస్తే, రాజన్ ఆ లక్షణాన్ని గమనించారు. కానీ ఆయన చెప్పిన పరిష్కారాలు ప్రజలకు ఊరట కలిగించేవి కాదు. పెట్టుబడిదారీ మాంద్యాన్ని సమూలంగా పరిష్కరించేవీ కాదు.
- బివి రాఘవులు