సంక్రాంతికీ లేని 'మాఫీ'

ఎన్నికల్లో రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. అనంతరం అనేక కోతలు, నిబంధనలు విధించి మాఫీని కొన్ని నెలలపాటు సాగదీసింది. రూ.50 వేల నుంచి లక్షన్నర లోపు రుణాలను ఐదు విడతల్లో ఏడాదికి 20 శాతం చొప్పున మాఫీ చేస్తానని పేర్కొంది. అనేక వడపోతల అనంతరం సుమారు 54 లక్షల రైతులు మాఫీకి అర్హత సాధించారు. వారిలో విడతల వారీగా మాఫీ అయ్యే రైతుల సంఖ్య 30 లక్షల వరకు ఉంటుంది. వీరికి తొలి కిస్తీ 20 శాతం సుమారు రూ.4 వేల కోట్లు విడుదల చేసినట్లు చెబుతున్నారు. రెండో కిస్తీగా మరో రూ.4 వేల కోట్లు ఈ సంవత్సరమే ఇవ్వాలి. కానీ ఇంతవరకు సొమ్ము విడుదల చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

పది శాతం వడ్డీతో రైతులకు విడతల వారీ రుణ మాఫీ అమలు చేస్తామని సర్కారు చెప్పగా ఆర్థిక శాఖ అన్ని నిధుల్లేవంటోంది. రుణ మాఫీకి 2014-15 బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు ప్రతిపాదించింది. 2015-16లో రూ.4,300 కోట్లు కేటాయించింది. మొత్తం కలిపితే రూ.8,300 కోట్లు. ఇప్పటి వరకు రైతులకు దశల వారీగా రూ.7,300 కోట్లు ఇచ్చామంటోంది. ఇచ్చిన నిధుల్లో రూ.300 కోట్లు మిగిలాయంటోంది. ఏతావాతా ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో రూ.1,300కోట్లున్నాయి. రెండో కిస్తీకి రూ.4 వేల కోట్లకు పైన అవసరమని చెబుతుండగా మరో రూ.3 వేల కోట్లు ఎక్కడి నుంచి సర్దుబాటు చేస్తారో తెలియటంలేదు. ఏడాది చివరిలో ఉన్నందున ఇంత పెద్ద మొత్తంలో నిధుల సర్దుబాటు కుదరదని ఆర్థిక శాఖ అభిప్రాయపడుతుండగా, ఈ నెలాఖరుకల్లా రెండో కిస్తీ విడుదల చేస్తారని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.