శరణార్థుల సమస్యకు కారణమేంటి?

 ఐరోపా నేడు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య శరణార్థులు. రెండవ ప్రపంచ యుద్ధ కాలం తరువాత ఇంత పెద్దయెత్తున ఈ సంక్షోభం ముందుకు రావడం ఇదే మొదటిసారి. సిరియాపై నాటో కూటమి బాంబు దాడులను ఉధృతం చేసిన నేపథ్యంలో ఈ సమస్య ముందుకొచ్చింది. వేలు, లక్షల సంఖ్యలో శరణార్థులు ఇతర దేశాలకు తరలివెళ్లే ప్రస్తుత దుస్థితికి కారణం సిరియాలో అసద్‌ ప్రభుత్వం ఎంత మాత్రం కాదు. ఆ దేశంపై దండెత్తిన నాటో దేశాల కుట్రపూరిత విధానమే కారణం. నాటో కూటమి మధ్య ప్రాచ్యంలోని తన అరబ్‌ మిత్రదేశాలతో కలిసి సిరియాపై యుద్ధాన్ని తీవ్రతరం చేయడంతో లక్షలాది మంది సిరియన్‌ పౌరులు ప్రాణాలు అరచేత పట్టుకుని ఇళ్ల నుంచి పరుగులు తీస్తున్నారు. వీరంతా మధ్యదరా సముద్రం మీదుగా యూరప్‌కు తరలి వెళ్తున్నారు. సిరియాపై బాంబుల వర్షం కురిపిస్తూ ఈ సంక్షోభానికి కారకులైనవారే ఇప్పుడు శరణార్థులను తమ భూ భాగంలోకి రానీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. శరణార్థుల సంక్షోభానికి ఐఎస్‌, అసద్‌ దురాగతాలే కారణమని ఫ్రాన్స్‌, జర్మనీ వంటి దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో ఏమాత్రం నిజం లేదు. నాటో కూటమి అనుసరిస్తున్న దురాక్రమణపూరిత యుద్ధాలే అసలు కారణం. ఈ యుద్ధాల్లో ఇళ్లు, మంచినీరు, విద్యుత్‌, పారిశుధ్యం, ఆసుపత్రులు ఇలా ప్రతి ఒక్కటీ ధ్వంసం కావడంతో ప్రజలు గత్యంతరం లేని స్థితిలో వలస వెళ్తున్నారు. అమెరికా, నాటో యుద్ధాల్లో సర్వనాశనమైన ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ల నుంచే కాక, ఘర్షణలు, అంతర్యుద్ధాలు, పేదరికం కోరల్లో చిక్కుకున్న మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, బాల్కన్‌ ప్రాంతాల నుంచి కూడా వలసలు పెరుగుతున్నాయి. యూరప్‌ దేశాల ప్రభుత్వాలు సరిహద్దులను మూసేసి శరణార్థులకు అనుమతి నిరాకరిస్తున్నా ఆయా దేశాల్లో ప్రజలు మాత్రం శరణార్థులకు పూర్తి సంఘీభావం ప్రకటించారు. గత వారం బాన్‌, లండన్‌, బుడాపెస్ట్‌, పారిస్‌, వార్సా, రోమ్‌ ఇలా ముఖ్యమైన ఐరోపా నగరాలన్నిటా పెద్దయెత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చి శరణార్థులకు తమ సంఘీభావం ప్రకటించారు. మూడేళ్ల సిరియన్‌ పసి బాలుడు ప్రమాదానికి గురై టర్కీ బీచ్‌లో ఇసుకలో కూరుకుపోయిన ఫొటో యావత్‌ ప్రపంచాన్ని కలచి వేసింది. ఇది జరిగిన కొద్ది రోజులకే పన్నెండేళ్ల కుర్రాడు తన తల్లి, అయిదేళ్ల తన సోదరునితో కలిసి గ్రీస్‌ దిశగా వెళ్తుండగా సముద్రంలో జలసమాధి అయ్యారు. కొద్ది రోజుల క్రితం లెస్బాస్‌ తీరంలో పడవ బోల్తాపడి అయిదేళ్ల బాలికతో సహా 13 మంది సముద్రంలో మునిగిపోయారు. గత వారం 26 మంది శరణార్థులు టర్కీ నుంచి గ్రీస్‌కు పడవలో వెళ్తూ ప్రమాదానికి గురై చనిపోయారు. మధ్యదరా సముద్రంలో ప్రమాదాలు, కిక్కిరిసిన వాహనాల్లో ప్రయాణం వల్ల ఊపిరాడక అనేక మంది శరణార్థులు చనిపోయారు. దీనికి తోడు యూరప్‌ దేశాల ప్రభుత్వాలు సరిహద్దుల్లో ఇనుప కంచెలు ఏర్పాటు చేయడం, నియంత్రణ పేరుతో గస్తీ దళాలను పెద్దయెత్తున మోహరించడం, దేశంలోకి ప్రవేశించే ప్రధాన రహదారులన్నిటినీ మూసివేయడం, శరణార్థులను ఉగ్రవాదుల్లా చూడడం, నిర్బంధ శిబిరాల్లో బంధించడం, లాంటి చర్యలు వీరిని మరింత క్షోభకు గురిచేస్తున్నాయి.
ఐరోపా దేశాల ఈ అమానుష వైఖరిపై అమెరికా, అక్కడి మీడియా కావాలనే మౌనం వహిస్తున్నాయి. ఈ మొత్తం విషాదంలో అమెరికా పాత్ర చాలా ఉంది. అందుకే అది ఈ సమస్యను పక్కదారి పట్టించేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నది. ఉదాహరణకు వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక సంపాదకీయమే చూడండి. 'ఇది ఒక్క యూరప్‌ సమస్యే కాదు, కాబట్టి దీనికి పరిష్కారం కూడా వాటి చేతుల్లో లేదు. ఆఫ్ఘనిస్తాన్‌, సూడాన్‌, లిబియా అంతకన్నా ముఖ్యంగా సిరియాలో ఈ సమస్యకు మూలాలున్నాయి' అని ఆ సంపాదకీయం ముక్తాయించింది. న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక తన సంపాదకీయంలో ఇదే పాట పాడింది. 'ఐరోపాను పట్టి పీడిస్తున్న ఈ శరణార్థుల సంక్షోభాన్ని అది ఒక్కటే పరిష్కరించుకోజాలదు. సిరియాలో యుద్ధం, ఇరాక్‌, లిబియాల్లో అరాచక పరిస్థితులను పరిష్కరించాలి' అని ఆ పత్రిక పేర్కొంది. అంతే కానీ, ఈ పెను విషాదానికి మూల కారకులెవరు? అన్న విషయంపై అవి ప్రమాదకరమైన మౌనాన్ని పాటించాయి. ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌లలో దశాబ్ద కాలంగా యుద్ధాలు చేసిందెవరు? ఇరాక్‌పై యుద్ధానికి దిగే ముందు సద్దాం వద్ద సామూహిక మారణాయుధాలున్నట్లు పచ్చి అబద్ధాలను ప్రచారం చేసిందెవరు? ఆ పేరుతో సాగించిన యుద్ధాల్లో సమాజాలకు సమాజాలే నాశనమయ్యాయి. మహిళలు, పిల్లలు వేలాది మంది మరణించారు. ఈ పాపాలకు బాధ్యత ఎవరిది? మానవ హక్కులు, ప్రజాస్వామ్యం వంటి ముద్దు మాటలు చెప్పి ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లలో అవి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. దీనికి అమెరికన్‌ గత పాలకులు బుష్‌, చెనీ, రమ్స్‌ఫెల్డ్‌, రైస్‌, పావెల్‌ ఎవరూ జవాబుదారీ వహించలేదు. ఆ తరువాత వచ్చిన అధ్యక్షుడు ఒబామా కూడా బాధ్యత వహించలేదు. పైగా ఆయన అధికారంలోకి వచ్చాక లిబియా, సిరియాలపై యుద్ధాలకు తెర తీశాడు. సిరియా, ఇరాక్‌లలో నేడు సాగుతున్న రక్తపాతానికి ఏ ఐసిస్‌ను అమెరికా, నాటో దేశాలు బూచిగా చూపుతున్నాయో ఆ ఐసిస్‌ను సృష్టించింది సిఐఎ, మధ్య ప్రాచ్యంలోని అమెరికన్‌ మిత్ర దేశాలేనన్నది జగమెరిగిన సత్యం. అవి అనుసరించిన యుద్ధ విధానాలు, నేరాల ఫలితమే నేటి ఈ శరణార్థుల సంక్షోభం.
అధికారిక గణాంకాల ప్రకారమే 2011 నుంచి ఇప్పటి వరకు మూడు లక్షల మంది లిబియాను వీడి శరణార్థులుగా ఇతర దేశాలకు పారిపోయారు. సిరియా నుంచి 40 లక్షల మంది (సొంత గడ్డపై శరణార్థులుగా ఉన్న 70 లక్షల మంది మినహా) శరణార్థులుగా వెళ్లిపోయారు. అలాగే ఇరాక్‌ నుంచి 20 లక్షల మంది శరణార్థులు దేశం వీడి పోయారు. ఈ శరణార్థుల ప్రవాహం ఇంతటితో ఆగేది కాదు. ఇది చాలా కాలం కొనసాగే అవకాశముంది.
స్వీడన్‌కు అధికంగా శరణార్థుల తాకిడి 
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌ (యుఎన్‌హెచ్‌సిఆర్‌) గణాంకాల ప్రకారం ఈ ఏడాది జులై చివరి నాటికి 4,38,000 మంది ఆశ్రయం కోసం వివిధ యూరప్‌ దేశాల్లో దరఖాస్తు చేసుకున్నారు. గత సంవత్సరంతో పోల్చి చూస్తే (5,71,000) ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఈ దరఖాస్తుల్లో ఎక్కువ జర్మనీలో ఆశ్రయం కోరుతూ దాఖలయ్యాయి. అయితే, స్థానిక జనాభా, శరణార్థుల నిష్పత్తిని బట్టి చూస్తే స్వీడన్‌ ప్రథమ స్థానంలో ఉంది. ఆ దేశంలో ప్రతి వెయ్యి మంది స్థానికులకు ఎనిమిది శరణార్థి దరఖాస్తులు దాఖలయ్యాయి. స్వీడన్‌ తరువాతి స్థానాల్లో హంగరీ (4.2), జర్మనీ (2.1) వరుసగా నిలిచాయి. బ్రిటన్‌లో ఇవి చాలా తక్కువ. అక్కడ ప్రతి రెండు వేల మంది స్థానికులకు ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది. 
ఈ శరణార్థులు ఏయే దేశాల నుంచి వస్తున్నారు?
వలస వస్తున్న శరణార్థుల్లో ఎక్కువ మంది యుద్ధ పీడిత సిరియా నుంచి వచ్చినవారే. అమెరికా, నాటో సేనల యుద్ధంతో సర్వనాశనమైన ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి కూడా పెద్ద సంఖ్యలో శరణార్థులు వస్తున్నారు. పేదరికం, అరాచకం రాజ్యమేలుతున్న కొసావో, ఎరిత్రియాల నుంచి కూడా వలసలు జోరందుకున్నాయి. ఈ శరణార్థుల సమస్యపై ఇయు అత్యవసర సమావేశం సెప్టెంబరు చివరిలో బ్రసెల్స్‌లో జరుగుతుంది. ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఏకాభిప్రాయానికి రావడంలో యూరప్‌ దేశాలు విఫలమయ్యాయి. ఐరోపా యూనియన్‌ నిర్దేశించిన కోటాలను ప్రధాన దేశాలే తిరస్కరించడంతో వీటి మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కొన్ని దేశాల ప్రభుత్వాలు దీన్ని భారంగా చూడడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. సిరియాపై యుద్ధానికి ముందుండే బ్రిటన్‌ అక్కడి నుంచి వచ్చే శరణార్థులను ఆదుకోవడానికి వచ్చేసరికి వెనకాడుతోంది. 28 సభ్య దేశాలున్న ఇయులో జర్మనీ, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, స్వీడన్‌, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌ వంటి ప్రధాన దేశాలకు లక్షా 20 వేల మంది శరణార్థులను కోటాలవారీగా కేటాయించింది. దీంట్లో 60 శాతం దాకా కోటా ఇటలీ, గ్రీస్‌, హంగరీ, జర్మనీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ దేశాలే నెరవేర్చాలి. దీనికి ఇయు విదేశాంగ మంత్రులు సూత్రప్రాయంగా అంగీకరిం చారు. ఆచరణకొచ్చేసరికి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బ్రిటన్‌ అయితే పూర్తిగా అడ్డం తిరిగింది. వచ్చే అయిదేళ్లలో కేవలం 20 వేల మంది శరణార్థు లనే తాము అనుమతిస్తామని ప్రధాని డేవిడ్‌ కేమరాన్‌ బాహాటంగా చెప్పాడు. బ్రిటన్‌ను చూసి మిగతా యూరప్‌ దేశాలు కూడా మడత పేచీకి దిగాయి. హంగరీ కూడా బ్రిటన్‌ వైఖరినే అనుసరించింది. సెర్బియాతో 175 కిలోమీటర్ల పొడవున గల తన సరిహద్దు వెంబడి శరణార్థులను అడ్డుకునేందుకు ముళ్ల కంచెలు వేసింది. డబ్లిన్‌ రెగ్యులేష న్‌గా పేరొందిన ఇయు చట్టం ప్రకారం ఇయు దేశాల్లో ఆశ్రయం కావాలనుకునే శరణార్థులు దేశంలోకి వచ్చి మొదట తమ పేర్లను నమోదు చేసుకోవాలి. వారు చేసిన దరఖాస్తును పరిశీలించిన మీదట వారిని శరణార్థులుగా అనుమతిం చాలా, లేదా అన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇది సాధారణ సమయాల్లో అనుసరించే ప్రక్రియ. కానీ, పెద్దయెత్తున శరణార్థులు తరలి వచ్చినప్పుడు ఈ నిబంధనలన్నీ పక్కన పెట్టి సరిహద్దులను తెరచి వారిని అనుమతించాలని ఈ చట్టం స్పష్టం చేస్తోంది. తాము తెచ్చిన చట్టాన్నే యూరప్‌ దేశాలు నేడు ఉల్లంఘిస్తున్నాయి. 2014లో 5.70 లక్షల మంది శరణార్థులు దరఖాస్తు చేసుకుంటే కేవలం 1,84,665 మందికి మాత్రమే అనుమతి ఇచ్చాయి.
అంతర్జాతీయ వలసవాసుల నియంత్రణ సంస్థ (ఐఒఎం) అంచనా ప్రకారం 2015 జనవరి-జులై మధ్య 3,50,000 మంది శరణార్థులు ఐరోపా దేశాల సరిహద్దుల్లో తిరస్కరణకు గురై నానా అగచాట్లు పడుతున్నారు. శరణా ర్థులు ఎక్కువగా తూర్పు, మధ్య మధ్యదరా సముద్రమార్గం, పశ్చిమ బాల్కన్‌ మీదుగా వస్తున్నట్లు ఫ్రంటెక్స్‌ అనే సంస్థ అధ్యయనంలో తేలింది. లిబియా నుంచి ఇటలీ వరకు సుదీ ర్ఘమైన సముద్ర యానంలో శరణార్థులు చాలా గడ్డు పరిస్థి తులనెదుర్కోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో సంభవించిన అనే క ప్రమాదాల్లో 2015 జనవరి-జులై మధ్య 2,267 మంది చనిపోయారు. గత ఏడాది ఈ మృతుల సంఖ్య 2,447గా ఉన్నట్లు వలసవాసుల నియంత్రణా సంస్థ తెలిపింది. 
- కె గడ్డెన్న