వ్యూహాత్మకంగానే వివాదాల పెంపు

హైదరాబాదును తామే అభివృద్ధి చేశామన్న ప్రచార వ్యూహం మానుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. ఆయన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా కొట్టిపారేయడం లేదా తెలుగుదేశంపై విమర్శకు పరిమితం కావడం వల్ల తనకు రాజకీయంగా కలిగే ప్రయోజనం ఉండదని చంద్రశేఖర రావు భావిస్తారు. అందువల్ల వాటిని ఖండించడంతో ఆగరు. అనివార్యంగా 'ఆంధ్రోళ్లు' అంటూ పల్లవి జోడిస్తారు. ఆఖరుకు మునిసిపల్‌ సమ్మెను కూడా ఆంధ్రా పార్టీలు నడిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించడం ఇందుకు పరాకాష్ట.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాల సందడి ముగిసింది గనక రాజకీయ, పాలనా వ్యవహారాలూ, సవాళ్లూ ముందుకొస్తున్నాయి. రాజమండ్రిలో తొక్కిసలాట కారణంగా తీవ్ర విమర్శల నెదుర్కొన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్నుంచి బయిట పడేందుకు నానా పాట్లు పడింది. ముఖ్యమంత్రి స్వయంగా అక్కడే కదలకుండా బైఠాయించి స్వయంగా సరిదిద్దుకోవలసి వచ్చింది. దేశంలో ఇలా ప్రభుత్వాధినేతే ప్రత్యక్షంగా రంగంలో ఉంటే తప్ప చిన్న పనులు కూడా జరగని స్థితి గతంలో ఎన్నడూ లేదు. ఈ రచయిత ఇప్పటికి మూడు పుష్కరాలు ప్రత్యక్షంగా చూసినా ఇలా జరిగింది లేదు. కాలం గడిచి సాంకేతిక నైపుణ్యాలు పెరిగిన కొద్దీ సమస్యలు తగ్గాల్సింది పోయి అనూహ్యమైన అనర్థాలు జరుగు తున్నాయంటే అందుకు అసమర్థతైనా కారణమై ఉండాలి లేదా అధికార కేంద్రీకరణ శ్రుతిమించిన ఫలితమైనా కావాలి. ఆ విధమైన ఆత్మ విమర్శ చేసు కోవడానికి బదులు ప్రభుత్వం ఏకపక్షంగా సమర్థిం చుకోవడానికి ప్రయత్నించింది. ఇందుకు మీడియాలో ఒక భాగం కూడా వంత పాడటం మరింత విపరీతం. ఇన్ని హంగామాల మధ్య వందల కోట్ల వ్యయం చేసి కూడా ఎన్నడూ ఎరగని స్థాయిలో తొక్కిసలాట జరగడం సాధారణ విషయమైనట్టు చిత్రించిన ఛానళ్లు, పత్రికలూ ఉన్నాయి. దీనికి పరాకాష్టగా రాష్ట్ర మంత్రివర్గం కొత్త కొత్త కథనాలను వదిలేందుకు ప్రయత్నించి పరిహాసం పాలైంది. ఇంతా చేసి సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రయాణించే పడవకే ప్రమాదం ఎదురై తప్పించు కోవడం దానంతటినీ తలకిందులు చేసింది. ఏది ఏమైనా ఆయన బయిటపడటం, తీవ్రమైన సమ స్యలు లేకుండా పుష్కరాలు ముగియడం సంతోషమే. కానీ దీన్నుంచి నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకోక పోతే రేపు కృష్ణా పుష్కరాలలోనూ సమస్యలు పునరావృ తమవుతాయి.
ఈ పుష్కరాలను అధికారికంగా ప్రచారం చేయడం కేవలం సమాచార ధర్మం మాత్రమేనని ఉన్నత న్యాయస్థానమే తీర్పునిచ్చింది. కనుక ఈ విషయంలో ఉభయ ముఖ్యమంత్రుల అతి ఉత్సా హాన్ని విమర్శించినా ఫలితం లేదు. మతాధిప తులను మించి పోయి ప్రభుత్వాధిపతులు పీఠాధిప తుల్లా వ్యవహరించడం సరైందా అనేది ఇప్పటికీ ప్రశ్నే. భక్తి విశ్వాసాలు అనుసరించే వారికి వదిలిపెట్టి భద్రతా వ్యవహారాలకే ప్రభుత్వం పరిమితమైతే రాజమండ్రి దుర్ఘటన వంటిది జరిగి ఉండేది కాదు. మత విశ్వా సాలతో ముడిపెట్టి సినిమా షూటింగుల స్థాయికి ప్రభుత్వాధినేత చేరుకున్నారు. మతాధిపతు లను మించిపోయి ప్రవచనాలు చేశారు. ఆరెస్సెస్‌ అత్యున్నత నేత మోహన్‌ భగవత్‌ స్వయంగా వచ్చి పాల్గొన్నాడు. ఆ సభలోనైతే కొందరు స్వాములు రెచ్చి పోయి వ్యాఖ్యానాలు చేశారు. స్వాములను ఎంతటి ఆరోపణలు వచ్చినా అంటుకోకూడదన్నట్టు మాట్లా డారు. ఇతర మతాలు దిక్కుమాలినవన్నట్టు నోరుపారే సుకున్నారు. ఆరెస్సెస్‌ ఔన్నత్యాన్ని ఆకాశానికెత్తారు.
ఇదంతా ఒక భాగమైతే సందట్లో సర్కారు తంతులు కొన్ని ముగించుకుంది. గతంలో పుష్క రాలంటే టిటిడి వంటి ధార్మిక సంస్థలూ, దేవాదాయ శాఖ ప్రధాన పాత్ర వహించేవి. కానీ ఈసారి రోజుకో సెమినార్‌ అంటూ మంత్రివర్యులు సకల శాఖలనూ సమ్మిళితం చేశారు. ఆఖరుకు నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణ ప్రణాళికకు కూడా పుష్కరాలనే వేదికగా చేసుకుని క్యాబినెట్‌తో మమ అనిపించారు. కృష్ణాతీరంలో కట్టే రాజధాని గురించి గోదావరి తీరంలో చర్చించడం ఒక విచిత్రమే. ఇంతా చేసి బాహుబలి సెట్టింగుల వంటి రాజధాని కల ప్రణాళి కకూ, తెలుగు సంస్కృతికీ ఏ సంబంధం ఉన్నట్టు? సింగపూర్‌, జపాన్‌లకు రైతుల భూమి అప్పగిం చేందుకు సర్కారే ఒక దళారీగా మారిపో యినట్టు స్పష్టమవుతుంది. పైసా తీసుకోరు గాని వేల ఎకరాలు కబళిస్తారు! అసలు వ్యూహాత్మ కంగా కీలకమైన తీర ప్రాంతంలో రాజధానిని అచ్చం గా విదేశీ శక్తుల చేతుల్లో అందులోనూ ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయడం గతంలో ఎక్కడైనా జరిగిందా? దీనంతటి పట్ల కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కూడా ఎందుకు ఉపేక్ష వహిస్తున్నది? ఈ బడా సంస్థలతో వారికీ బ్రహ్మముడి ఉండటమే ఇందుకు కారణమ వుతున్న దనుకోవాలి. రాజధాని మౌలిక నిర్మాణాల కోసం మూడు గ్రామాలు తరలించాల్సి వస్తుందని స్వయ ంగా చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే ఆయన రాజధాని ఇన్‌ఛార్జి, మున్సిపల్‌ మంత్రి నారాయణ అదేం లేదని తీసిపారేస్తున్నారు. ఇక్కడ ఎవరు శక్తివంతులు? రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి నడిపిస్తున్నారా లేక నారాయణుడే చక్రం తిప్పుతున్నారా? పారదర్శ కత లవలేశం లేకపోవడం వల్ల ఇక్కడ ఎవరు చెప్పేది సరైందో ప్రజలకు మాత్రం బోధపడటం లేదు. రాజ ధాని రథచక్రాల కింద మాయమయ్యే గ్రామీణ శ్రామి కుల,పేదల గోడు ఉభయులూ పట్టించు కోవడం లేదు.
పుష్కరాల ముచ్చట్లో ఉభయ రాష్ట్రాలూ మునిసిపల్‌ కార్మికుల సమ్మెను ఘోరంగా నిర్లక్ష్యం చేశాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఎర్రజండాల నీడన కార్మికులు పోరాడటమే నేరమైనట్టు, తనను వేడుకుంటే వరాలిస్తానన్నట్టు వ్యవహరించారు. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు విద్రోహాలను ప్రోత్సహించారు. అయితే ముఖ్యంగా వామపక్షాలు రాజకీయ దీక్షతో ఐక్యంగా సమ్మెకు అండ నిచ్చాయి. అందరి దృష్టిలో పడే హైదరాబా దులో మాత్రం కొన్ని కోర్కెలు అంగీకరించి మిగిలిన చోట్ల ఉపేక్ష ప్రదర్శించారు. రాష్ట్ర బంద్‌ జరిగినా- కార్మిక సంఘాలు వాస్తవికతతో హైదరాబాదును మినహాయించినా ఏలిన వారు మాత్రం ఏకపక్ష పోకడలు మానుకోలేదు. ఇది రాసే సమయానికి ఏదో మధ్యే మార్గం కనుగొన్నట్టు చెబుతున్నారు. చూడవలసే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతిపాదనలపై కూడా కార్మిక సంఘాల ప్రతిస్పందన ఇంకా అందలేదు. ఏది ఏమైనా ఈ సమ్మె పట్ల అనుసరించిన వైఖరిలో కార్మిక వ్యతిరేకత, రాజకీయ పాక్షికత, కక్షసాధింపు తాండవించాయనడంలో సందేహం లేదు. కార్మిక చట్టాలలో కూడా చాలా కర్కోటక సవరణలు తీసుకొస్తున్నట్టు అధికార వర్గాలే చెబుతున్నాయి. కనుక శ్రమజీవులు అప్రమత్తంగా ఉండక తప్పదు.
ఇక షరామామూలుగా ఇద్దరు ముఖ్యమంత్రుల లేదా రెండు పాలక పార్టీల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అమరావతి నగరం హైదరాబాదును మించిపోతుందని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఒకటి. ఎన్టీ రామారావు వచ్చాకే ఇక్కడ త్వరగా లేవడం అలవాటైందనే వ్యాఖ్య మరొకటి. ఇవి రెండూ అవసరం లేనివి. కానీ హైదరాబాదును తామే అభివృద్ధి చేశామన్న ప్రచార వ్యూహం మానుకోవ డానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. ఆయన వ్యాఖ్యల ను వ్యక్తిగతంగా కొట్టిపారేయడం లేదా తెలుగు దేశంపై విమర్శకు పరిమితం కావడం వల్ల తనకు రాజకీయంగా కలిగే ప్రయోజనం ఉండదని చంద్ర శేఖర రావు భావిస్తారు. అందువల్ల వాటిని ఖండించ డంతో ఆగరు. అనివార్యంగా 'ఆంధ్రోళ్లు' అంటూ పల్లవి జోడిస్తారు. ఆఖరుకు మునిసిపల్‌ సమ్మెను కూడా ఆంధ్రా పార్టీలు నడిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించడం ఇందుకు పరాకాష్ట. కనుక ఆయన వ్యూహాత్మకంగానే వచ్చిన ప్రతి వ్యాఖ్యనూ తెలంగా ణపై దాడిగా చెబుతారు. అసలు కెసిఆర్‌ను, టిఆర్‌ఎస్‌ను అనడమంటే తెలంగాణను అనడమేనని ఆయన వందిమాగధులు, కొందరు వీర శైవ సిద్ధాంత కర్తలు ఊగిపోతారు. ఇలా ఇద్దరు చంద్రులూ ఒకరినొకరు తిట్టిపోసుకుంటూ ఆ క్రమంలో అసలు సమస్యలు దాటేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కొందరు మేధావులు కేవలం ప్రాంతీయ కోణానికే పరిమితం కావడంతో ఇలాటి ధోరణులకు మరింత ఊతం దొరుకుతుంది. ఇక తెలుగుదేశం అధినేత ఉద్దేశపూర్వకంగానే పదే పదే హైదరాబాదు గురించి ప్రస్తావిస్తుంటారు. ఆయన గతంలో ఎంత సుదీర్ఘ కాలం పాలించినప్పటికీ ఇప్పుడు హైదరాబాదు మరో రాష్ట్ర రాజధాని తప్ప తనకు ఎలాటి అధికారం లేదనే వాస్తవాన్ని ఒప్పుకుంటే ఇలా చేయరు. పైగా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తను చేసే ప్రతి వ్యాఖ్య ప్రజలపై ప్రభావం చూపిస్తుందనేది పట్టించుకోరు. ఓటుకు కోట్ల కుంభకోణం బహిర్గతమైన తర్వాత ఇది తప్ప మరో అస్త్రమేదీ లేదని ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తుంది. మొత్తం మీద ఈ వ్యర్థ వివాదాల వల్ల వాతావరణం కలుషితమై పోతున్నది.
కేంద్రం కూడా తన వంతు పాత్ర నిర్వహించి స్పష్టత ఇస్తే పరిస్థితి కొంతైనా మెరుగ్గా ఉండేది. కానీ ఎపికి ప్రత్యేక హోదా మంజూరు చేయకుండా, వివాదాస్పదమైన విషయాల్లో ఇదమిత్థమైన సూచ నలు పంపకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తున్నది. ఓటుకు కోట్ల వ్యవహారం లో ఇంతకాలం మౌనం వహించి ఇప్పుడు కోర్టులు తీర్పులు ఇచ్చిన తర్వాత భద్రతా కారణాలను ముందు కు తెచ్చింది. మరి తాము ఫిర్యాదు చేశామని తెలుగు దేశం నేతలు పదే పదే చెబుతున్నప్పుడు కేంద్ర హోం శాఖ ఎందుకు మౌనం వహించింది? కాల్‌ లిస్టులు ఇస్తే భద్రతకు ముప్పు అని మొదటే చెప్పి ఉండొచ్చు కదా. కనక రాజకీయాలు న్యాయస్థానాలు, కేంద్రం, ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇదొక నాలుగు స్తంభాలాటగా మారిన విచిత్ర స్థితి ఏర్పడింది. విద్యుచ్ఛక్తి ఉద్యోగుల విషయంలో ఏకపక్ష తొలగింపు సరికాదన్న కోర్టు ఆదేశం తర్వాత మిగిలిన విభాగా లలో కూడా అలాటి మార్గదర్శకాలు జారీ చేయొచ్చు. విడిపోయింది రాష్ట్రాలే తప్ప ప్రజలు కాదనీ, ప్రజలు, ప్రభుత్వాల మధ్య సుహృద్భావం కాపాడటం తన బాధ్యతనీ అందరూ గుర్తిస్తే అప్పుడు ఈ చికాకులూ, కీచులాటలూ ఉండనే ఉండవు.
- తెలకపల్లి రవి