వ్యసనం

వలదు వలదన్న వాటికే మనుషులు అలవాటు పడతారు. కాదు కాదన్న వాటి చెంతకే  చేరుతారు. నిషేధిత పనుల మీదనే మనుషులకు ఆకర్షణ ఎక్కువ. సమాజం ఒప్పని పనులు చేయకూడదని తెలిసినా వాటి వైపే మొగ్గు చూపుతారు. తప్పని తెలిసినా వాటికి లొంగిపోతారు. అలవాటు అన్నది వదిలిపెట్టడానికి వీల్లేనంతగా పరిణమిస్తే వ్యసనమవుతుంది. ఆ వ్యసనానికి బానిసలయితే కోలు కోవడం కష్టం. అందువల్లనే మన పెద్దలు సప్త వ్యసనాలకు దూరంగా ఉండటం క్షేమకరమని చెప్పారు. పురాణాలు, శాస్త్రాలు చెప్పిన ఈ ఏడు వ్యసనాల్లో జూదం, మాంసభక్షణం, మద్యపానం, వేశ్యాసంగమం, వేట, దొంగ తనం, పరస్త్రీలపై లౌల్యం ఉన్నాయి. ఇవే గాక ఇతరులు మరికొన్ని వ్యసనాల గురించి ప్రస్తావించారు. ఈర్ష్య, అసూయ, కోపం వంటి అవలక్షణాలతో తరచుగా కోపావేశాల్ని ప్రదర్శించటాన్ని కూడా వ్యసనాలకిందికి చేర్చారు మరికొందరు. 
అలవాటుకు భిన్నమైంది వ్యసనం. అలవాట్లలో మంచీ చెడు ఉంటాయి. వ్యసనాల్లో మనిషికీ, సమాజానికీ హాని చేసే లక్షణం అధికం. నేటి కాలాన మాంసం తినడాన్ని వ్యసనంగా అంగీకరించలేం. కానీ మిగతా ఆరు అంశాల్ని ఏ సమాజమూ ఆమోదించదు. అయితే సభ్యసమాజం ఆమోదించని వ్యసనాల్ని రాజ్యం సమర్థిస్తుంది. ప్రభుత్వాలే ప్రోత్సహిస్తాయి. వాటికి పరిమితులు విధిస్తూనే ఆ వ్యసనాలకు మనుషులు లొంగిపోయే పరిస్థితుల్ని ప్రభుత్వమే కల్పిస్తోంది. జనాల్ని తాగుడుకు అలవాటు చేసి వందల, వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచుకో వాలన్న లక్ష్యాల్ని ప్రభుత్వం నిర్దేశించుకోవడం దుర్మార్గం. మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీత్యా నేరం. కానీ మద్యం తాగడం నేరం కాదు. ఇదొక వైచిత్రి. తాగినందుకు కాదు, తాగి వాహనం నడిపినందుకు చలాన్లు విధిస్తారు. 
మద్యపానం తప్పు అని ప్రభుత్వం చెప్పదు గానీ సమాజం తప్పుగానే భావిస్తుంది. కనుకనే తాగుడు అలవాటును ఎవరూ అంగీకరించరు. మర్యాదగా తలపోయరు. ఆ వ్యసనానికి బానిసలైన వారి ప్రవర్తనని అభిశంసిస్తారు. అయినా తాగుడు అలవాటు మునుపెన్నడూ లేనంతగా సమాజంలో పెరిగింది. మంచినీళ్ళు దొరకని గ్రామాలుంటాయేమో గానీ మద్యం దొరకని గ్రామం లేదు. నగరాలు, పల్లెలు, పట్టణాలు... ప్రతిచోటా మద్యం అత్యంత అందుబాటులో వుండే సరుకయ్యింది. గ్లోబలైజేషన్‌ పరిణామాల నేపథ్యంలో మద్యాన్ని వినోదపు సరుకుగా మార్చారు. ఈ కాలాన ప్రతి చిన్న అంశమూ ఉత్సవ భరిత సన్నివేశమవుతుంది. ఈ క్రమాన విందు వినోదాల్లో మునిగితేలడానికి మద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. కనుకనే టీనేజీ వయసు నుంచే మద్యపానానికి అలవాటు పడుతున్నారు. సాయంత్రం నలుగురు కలిసి మాట్లాడుకోడానికి 'కూర్చుందామా' అంటూ మొదలెడతారు. 'సిట్టింగ్‌ల' పేరిట మద్యపాన వ్యసనానికి లోబడుతున్నారు. ప్రభుత్వమే ఆదాయం కోసం టార్గెట్లు పెట్టి జనాల్ని తాగుడుకు బానిసల్ని చేస్తోంది. 
మద్యపానమే కాదు ధూమపానం కూడా ప్రమాద కరమైన వ్యసనం. ప్రాణాలు పోతాయని తెలిసినా చైన్‌ స్మోకర్లుగా మారుతున్నారు. ఏ రకంగానూ మనిషి ఆరోగ్యా నికి ఉపకరించని ధూమపానం వేల కోట్ల రూపాయల వాణిజ్యంగా వర్థిల్లుతోంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఎన్ని హెచ్చరికలు చేసినా ఈ అలవాట్లు తగ్గకపోగా మరింతగా పెరుగుతున్నాయి. సిగరెట్లు, బీడీలు మానకపోతే బతకవని వైద్యులు చెప్పినా ఆ వ్యసనాన్ని వదులుకోలేని వారు ఎందరో! దీనికన్నా ఇంకా ప్రమాదకరమైనది గుట్కాసేవనం. 
ఇది గత ఇరవై ఏళ్ళ కాలంలో భయంకరంగా పెరిగింది. ఈ వ్యసనం అత్యంత హేయమైంది. ఒక్కసారి ఇది అలవాటయితే బతుకు సర్వనాశనమే. ఎందుకంటే కొందరయినా పట్టుదలతో, కౌన్సెలింగ్‌తో మద్యం మానేస్తు న్నారు. సిగరెట్లు తాగే అలవాట్లకు స్వస్తి చెబుతున్నారు. కానీ గుట్కా ప్యాకెట్లు తినే అలవాటయిన ప్రబుద్ధులు ఆ వ్యసనాన్ని మానలేకపోతున్నారు. అంత బీభత్సమైన గుట్కాల మీద ఎన్ని విధినిషేధాలున్నా ప్రతిచోటా దొరుకు తున్నాయి. గుట్కా తినే అలవాటు ఆయా కుటుంబాల పాలిటి పెనువిషాదం. 
ఇరవై, ముప్పయ్యేళ్ళ కిందటి పరిస్థితులతో పోలిస్తే సమాజంలో నానారకాల వ్యసనాలు పెరిగాయి. గ్లోబలైజేషన్‌ పరిణామాల ప్రభావ ఫలితంగా మనుషులు వ్యసనపరులై బతుకుల్ని బుగ్గి చేసుకుంటున్నారు. మద్యపానం, ధూమపానం, గుట్కాల సేవనం తక్షణం సమాజం నుంచి పారదోలాల్సిన వ్యసనాలు. ఈ వ్యసనాలకు నిండు జీవితాలు బలయిపోతున్నా ప్రభుత్వాలు ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ వ్యసనాలకి వివిధరూపాల్లో తోడ్పాటును అందిస్తున్నాయి. విధినిషేధాల్ని పకడ్బందీగా అమలు జరపాలన్న కృతనిశ్చయం పాలకవర్గాలకు లేదు. తమ దోపిడినీ ప్రశ్నించకుండా ప్రజలు వ్యసనపరులు కావడమే పెట్టుబడిదారీ శక్తులకు కావాలి. కనుకనే వాటికి వత్తాసు పలికే ప్రభుత్వాలకు ఈ వ్యసనాల నియంత్రణకు కృతనిశ్చయంతో వ్యవహరించే చిత్తశుద్ధి లేదు. ఈ పరిస్థితుల్లో సమాజంలో మార్పుకోసం పోరాడే శక్తులే ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడం అవసరం. గతంలో మద్యం కారణంగా బతుకులు ఛిద్రమయ్యే పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజా సంఘాలే ఆయా గ్రామాల్లో ప్రజల్ని సంఘటితం చేసి ఉద్యమపథంలోకి తీసుకొచ్చాయి. అలాంటి అనుభవాల నేపథ్యంలోంచి అన్నిరకాల వ్యసనాలకు దూరంగా ప్రజల్లో నూతన చైతన్యాన్ని పాదు కొల్పడం ఇవాళ్టి అవసరం.