వ్యవసాయంతో బ్యాంకుల దోబూచులాట

నేటి వ్యవసాయ రంగంలో కొనసాగుతున్న మాంద్యానికి పెట్టు బడులు ప్రధాన కారణం. 1965-85 మధ్య బ్యాంకింగ్‌ రంగం వ్యవ సాయ రంగానికి పూర్తి సహాయ సహకారాలు అందించింది. ఫలితం గా, ఉత్పత్తి, ఉత్పాదకత ఆహార ధాన్యాలలో ఐదు రెట్లు పెరిగింది. పెరిగిన జనాభాకు తగి నంత ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసుకోగలి గాం. ఆహార ధాన్యాలలోనే కాక పప్పులు, నూనెగింజలు, తదితర పంటల్లో కూడా స్వయంపోషకత్వం సాధించాం. 1969లో 17 బ్యాంకులను జాతీయం చేశారు. 1980లో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా, విజయ బ్యాంకును జాతీయం చేశారు. జాతీయం చేయడంతో బ్యాంకులు వ్యవసాయ రంగానికి తగినంత రుణ సౌకర్యం కల్పించాయి. 1972లో రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ యం నర్సింహ్మం నేతృ త్వంలో వేసిన కమిటీ సేవా దృక్పథంతో గ్రామీణ బ్యాంకులు విరివిగా పెట్టాలని జాతీయం చేయబడిన బ్యాంకులకు సూచించింది. దాని ఆధారంగా దేశవ్యాప్తంగా వేలకొద్ది గ్రామీణ బ్యాంకులు ప్రారంభించారు. అంతకు ముందు వ్యవసాయ రంగానికి సహకార బ్యాంకు రుణ సౌకర్యం కల్పిస్తూ వచ్చింది. వాణిజ్య బ్యాంకుల ప్రవేశంతో సహకార బ్యాంకు ఖాతాదారులైన రైతులందరూ రుణం అధికంగా లభిస్తుందని వాణిజ్య బ్యాంకుల వైపు మారారు. ఆంధ్ర ప్రదేశ్‌లో 130 సహకార సొసైటీలను వాణిజ్య బ్యాంకులు దత్తత తీసుకున్నాయి. ఆ విధంగా రైతులకు తగినంత రుణం లభించడంతో పెట్టుబడులకు ఇబ్బంది లేకుండా గడిచింది. అదే కాలంలో వ్యవసాయ శాఖను విస్తృత పరిచింది. ప్రతి గ్రామానికీ విడిఒ లేక విఎల్‌డబ్ల్యును, వ్యవసాయ అధికారిని కేటాయించారు. ఈ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి పంటలకు తగు సూచనలు చేశారు. అంతేగాక తైచింగ్‌నేటీవ్‌-1, ఐఆర్‌-8 వరి రకాలను థారులాండ్‌ నుంచి దిగుమతి చేసుకుని మన పంటలతో సంకరపరచి అధికోత్పత్తి వంగడాలను సృష్టించారు. తరువాత ముతక ధాన్యాలలోకి, కూరగాయల విత్తనాలలోకి హైబ్రిడ్‌, హై ఈల్డింగ్‌ విత్తనాలను తయారుచేశారు. ఆ విధంగా విత్తన రంగంలో ప్రభుత్వ పరిశోధనలతో ఊహించని మార్పు వచ్చింది. ప్రస్తుతం మోన్‌శాంటో, డ్యూ-పంత్‌, కార్గిల్‌, సింజెంటా లాంటి కంపెనీలు విత్తన రంగలోకి ప్రవేశించి ఏటా వేల కోట్లు రైతుల నుంచి లాభాలు ఆర్జిస్తున్నాయి. ఒకవైపున విత్తనాల ధరలు పెంచారు. మరోవైపున నాణ్యతలేని విత్తనాల వల్ల ఏటా లక్షల ఎకరాల పంటలకు నష్టం వాటిల్లుతున్నది. ఇంతవరకు కేంద్రంగానీ, రాష్ట్రంగానీ విత్తన చట్టం చేయలేదు. ఇది నేటి పరిస్థితి. గతంలో మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లభించాయి. ఏనాడూ రైతులు పెట్టిన పెట్టుబడికి నష్టం వచ్చిందని అనుకోలేదు. ఈ రెండు దశాబ్దాల కాలంలో బ్యాంకుల జాతీయం, వ్యవసాయ విస్తరణ, నూతన వంగడాల పరిశోధన, మార్కెట్‌ ఒడిదుడుకులు లేకుండా ఉండటం వల్ల రైతుల ఆదాయాలు పెరిగాయి. రైతుల పిల్లలు చదువులకు వెళ్లారు. అంతేగాక ఆరోగ్య వసతులకు ఇబ్బందులు పడలేదు. కానీ, 1985 నుంచి 1995 వరకు వ్యవసాయంలో నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి విస్తరణ కార్యక్రమాలూ చేపట్టలేదు. ఫలితంగా వృద్ధిరేటు ఉన్నచోటనే ఉంది. పెరుగుతున్న జనాభాకు ఆహారధాన్యాల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరాన్ని నాటి ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయి.
1995లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పు వచ్చింది. 1994 డిసెంబర్‌ 31న గాట్‌పై భారత ప్రభుత్వం సంతకాలు చేసింది. 1995 జనవరి 1 నుంచి గాట్‌ ''ప్రపంచ వాణిజ్య సంస్థ''గా పేరు మార్చుకుంది. నాటి నుంచి భారత వ్యవసాయ రంగానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా గాట్‌లో చేరకూడదని పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినా నాటి భారత నేతలు ధనిక దేశాల ఒత్తిడికి లొంగి ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగమయ్యారు. దీంతో సంస్కరణలు ప్రారంభమయ్యాయి. అందులో మొదటగా వ్యవసాయ రంగానికి బ్యాంకు రుణాలను తగ్గించడం చేబట్టారు. ఇంతకాలం వాణిజ్య బ్యాంకులపై ఆధారపడిన రైతులు ప్రైవేట్‌ రుణదాతలను ఆశ్రయించడం ప్రారంభించారు. క్రమానుగతంగా మైక్రో ఫైనాన్స్‌ వ్యవసాయ రంగంలోకి అడుగిడింది. దాంతో రైతులు రుణగ్రస్తులు కావడం పెరిగింది. ఎన్‌ఎస్‌ఎస్‌ డేటా ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 82 శాతం మంది రైతులు అప్పులలో కూరుకుపోయినట్లు తేల్చారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏటా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశాలు జరిపి పంట రుణాలకు, దీర్ఘకాలిక రుణాలకు, వ్యవసాయ అనుబంధ రుణాలకు కేటాయింపులు చేస్తూనే వస్తోంది. దీనికి సంబంధించి రిజర్వుబ్యాంకు ఆదేశిక సూత్రాలను విడుదల చేసింది. వాటిని బ్యాంకులన్నీ కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. మొత్తం బ్యాంకుల వ్యాపారంలో 40 శాతం ప్రాథమిక రంగమైన వ్యవసాయానికి కేటాయించాలి. ఇందులో 18 శాతం పంట రుణాలకు, దీర్ఘకాలిక రుణాలకు కేటాయించాలి. మిగిలిన 22 శాతం వ్యవసాయ అనుబంధ రంగాల (గొర్రెలు, చేపలు, కూరగాయలు, పందులు, కోళ్లు, పాడి)కు, వ్యవసాయ, పారిశ్రామిక వనరులకు కేటాయించాలి. మొత్తం వ్యవసాయ రుణంలో 15 శాతం దళిత, గిరిజనులకివ్వాలి. ఈ విధంగా ఆదేశాలున్నప్పటికీ, నేటికీ ఏనాడూ 10 శాతానికి మించి బ్యాంకులు రుణాలివ్వలేదు. పాత బాకీ రుణాలను కలిపి అంకెలు మార్చి లెక్కలు చూపుతున్నారు. వాస్తవానికి ఏ సంవత్సరం వ్యాపారం ధనంలో ఆ సంవత్సరమే 18 శాతం పంట రుణాలు ఇవ్వాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల రీ-షెడ్యూల్డ్‌ చేసినా, మరే ఇతర కారణాల వల్ల వాయిదా వేసినా ఆ బకాయిలు ఇందులోకి రాకూడదు. ఈ మధ్య కాలంలో వాణిజ్య బ్యాంకులు మొత్తం రుణాలను రెన్యూవల్‌ చేసే పద్ధతిని అనుసరిస్తున్నాయి. అప్పులు చెల్లించకుండానే రెన్యూల్‌ చేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వాలు ప్రకటిస్తున్న పథకాలు, రుణమాఫీ పథకాలను అమలు చేస్తున్నామంటూనే నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో 2014 మార్చి నాటికి 3,83,804 బ్యాంకు బ్రాంచీలు ఉన్నాయి. ఇవి రైతుల నుంచి డిపాజిట్లు సేకరించడానికే తప్ప రైతులకు రుణాలివ్వడానికి ముందుకు రావడం లేదు. పై తేదీ నాటికి బ్యాంకుల్లో రూ.85,33,100 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. రుణాలు ఇచ్చింది రూ.67,35,200 కోట్లు మాత్రమే. ఇందులో వ్యవసాయరంగానికి రూ.6,69,400 కోట్లు అప్పులివ్వగా పరిశ్రమలకు రూ.25,22,900 కోట్లు, సేవారంగానికి రూ.13,37,000 కోట్లు, వ్యక్తులకు రూ.10,36,500 కోట్లు మార్చి 2014 నాటికి ఇచ్చినట్లు బ్యాంకు నివేదికలు తెల్పుతున్నాయి. పై గణాంకాలు చూస్తే వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణాలు మొత్తం డిపాజిట్లలో 7.84 శాతం మాత్రమే. రిజర్వుబ్యాంకు సూచనలు కూడా బ్యాంకులు ఎలా ఉల్లంఘిస్తున్నాయో బోధపడుతుంది. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ (6 బ్యాంకులు) 2013-14లో రూ.13,282 కోట్ల రుణాలు రద్దు చేసింది. అయినా, ఈ బ్యాంకులకు లాభం రూ.13,668 కోట్లు వచ్చింది. కానీ, పారు బాకీల కింద రూ.93,098 కోట్లు ఉన్నాయి. ఈ పారుబాకీలన్నీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు తీసుకున్నవే. 30 మంది పెద్దలపై బ్యాంకులు కేసులు వేశాయి. అందులో చేరిన మొత్తం రూ.16,877 కోట్లు కాగా, కింగ్‌ఫిషర్‌ రూ.3,782 కోట్లు, జూం-డెవలపర్స్‌ రూ.2,267 కోట్లు ఉన్నారు. ఇవి ఒక ఉదాహరణ మాత్రమే.
దేశంలో రూ.8.45 లక్షల కోట్లు 2013-14లో రుణాలిస్తారని ప్రకటించారు. కానీ, తీరా ఇచ్చింది రూ.6.45 లక్షల కోట్లు మాత్రమే. అందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.98 వేల కోట్లు ఇచ్చినట్లు ప్రకటించారు (ప్రత్యక్ష రుణాలు 82 వేల కోట్లు, పరోక్ష రుణాలు 16 వేల కోట్లు). అదే సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రూ.45 వేల కోట్లు మైక్రో ఫైనాన్స్‌ కొరకు బ్యాంకులు ఆ సంస్థలకు రుణాలిచ్చాయి. మొత్తం దేశంలో మైక్రో ఫైనాన్స్‌ రుణ సంస్థలకు రూ.6.40 లక్షల కోట్లు రుణాలిచ్చారు. ఈ విధంగా బ్యాంకులు మైక్రో ఫైనాన్స్‌ సంస్థల ద్వారా రుణాలు ఇస్తున్నాయి. వ్యవసాయ రంగానికి 9 శాతానికి రుణం ఇస్తే మైక్రోఫైనాన్స్‌ సంస్థలకు 12 శాతానికి ఇస్తారు. వారు 24 శాతానికి గ్రామీణ ప్రాంతాలలో రుణాలిస్తున్నారు. వారం వారం వసూళ్లు కాబట్టి చక్రవడ్డీని లెక్కవేస్తే 48 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఈ రోజు మైక్రో ఫైనాన్స్‌ రంగంలోకి రిలయన్స్‌, ఎల్‌ అండ్‌ టి లాంటి కంపెనీలు కూడా ప్రవేశించాయి. ఒక విధంగా గుత్త సంస్థలన్నీ ఈ రంగంలో అడుగుపెట్టాయి. పెట్టుబడి, ఫైనాన్స్‌ పెట్టుబడిగా మారడంతో వడ్డీ రాబడినే ప్రధాన లాభంగా బ్యాంకులు చూస్తున్నాయి. చివరికి బ్యాంకులు పారిశ్రామికవేత్తలకు అప్పులివ్వడమే కాక, వారితో కలిసి తమ బ్యాంకు పెట్టుబడి వాటాతో పరిశ్రమలు స్థాపిస్తున్నాయి. వాటాల వ్యాపారం చేస్తున్నాయి. ఈ వ్యాపారంలో కొన్ని బ్యాంకులు దివాళా తీస్తున్నాయి. అవి డిపాజిటర్లకు టోపీ పెడుతున్నాయి.
దీనికి తోడు ఎఫ్‌డిఐ పెద్ద ఎత్తున దేశంలోకి వస్తున్నది. 2014-15లో 68.69 కోట్ల డాలర్లు ప్రవేశించింది. అందులో టెక్స్‌టైల్‌ రంగంలోకి 16.43 కోట్ల డాలర్లు, ఆహార రంగంలోకి రూ.14,429 కోట్లు వచ్చాయి. ఇవి వ్యవసాయ రంగం నుంచి లాభాలు తరలించుకు పోవడమే. ఈ విధంగా వ్యవసాయ రంగానికి బ్యాంకులు రుణాలు తగ్గించడం వల్ల అనివార్యంగా ప్రైవేట్‌ అప్పుల వైపు రైతులు వెళ్తున్నారు. 1965-85లో సహకార వ్యవస్థ ఒక వెలుగు వెలిగింది. దాని ప్రాంతంలోకి వాణిజ్య బ్యాంకులు వచ్చి తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుని ఆ రంగాన్ని చచ్చుబడేటట్లు చేసి నేడు పారిశ్రామిక రంగం వైపు పరుగులు పెడుతున్నాయి. 
కనీసం ప్రభుత్వాలు ప్రాథమిక రంగాన్ని కాపాడు కోవాలన్న లక్ష్యాన్ని కూడా అనుసరించడం లేదు. బ్యాంకులకు వంత పాడుతూ పాలక పక్షాలు అవి చెప్పిన అవాస్తవాలను వల్లె వేస్తున్నాయి. అందువల్ల ఈ రోజు వ్యవసాయ రంగం పూర్తిగా మాంద్యం అంచుకు చేరుతుంది. దాని ఫలితంగానే ఆహారోత్పత్తుల పంటలు కూడా తగ్గాయి. బ్యాంకు నివేదికల ప్రకారమే ఆహార ధాన్యాల ఉత్పత్తి 2011-12లో 259.29 లక్షల టన్నులు కాగా, 2014-15లో 252.68 లక్షల టన్నులకు తగ్గిపోయింది. అలాగే మొత్తం నూనె గింజలు 324.79 లక్షల టన్నుల నుంచి 266.75 లక్షల టన్నులకు తగ్గాయి. నేడు 1.15 కోట్ల టన్నుల వంటనూనెలు మలేషియా, సింగపూర్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే, పప్పుధాన్యాలు 18.24 లక్షల టన్నుల నుంచి 17.20 లక్షల టన్నులకు తగ్గాయి. 40 లక్షల టన్నుల పప్పు ధాన్యాలు మయన్మార్‌, ఉత్తర అమెరికాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వ్యవసాయ మాంద్యం వల్ల ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గడమే గాక రైతులు ఈ రంగాన్ని వదిలిపెట్టి ఇతర రంగాలకు వలసలు పోతున్నారు. అక్షర జ్ఞానం లేని రైతులు 50 శాతం ఉన్నారు. వీరు మరో నైపుణ్యం గల పని చేయలేరు. అందువల్ల, ఆత్మహత్యలే శరణ్యంగా భావిస్తున్నారు. బ్యాంకులు తమ విధానాలు మార్చు కోకుండా వ్యవసాయ సంక్షోభం పరిష్కారం కాదు.
- సారంపల్లి మల్లారెడ్డి 
(వ్యాసకర్త ఎఐకెఎస్‌ ఉపాధ్యక్షులు)