
విద్యార్థులు, యువత తమలోని జ్ఞానాన్ని వెలికితీసి దేశాభివృద్ధికి తోడ్పడాలని రాజ్యసభ సభ్యుడు, బెనారస్ యూనివర్సిటీ చాన్సలర్, పద్మవిభూషణ్ కరణ్‌సింగ్ అన్నారు. ఆదివారం శామీర్‌పేటలోని బిట్స్ క్యాంపస్‌లో వైస్ చాన్సలర్ బిజేంద్రనాథ్ జైన్ ఆధ్వర్యంలో 4వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కరణ్‌సింగ్ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. మన వేదాలు, ఉపనిషత్తుల్లో ఎంతో సమాచారం ఉందని, అందులో నుంచి జ్ఞానాన్ని వెలికితీయాలని.. ఇందుకు విద్యార్థులు, యువత చైతన్య స్ఫూర్తితో ముందడుగేయాలని కరణ్ సింగ్ పిలుపునిచ్చారు. ఈ తరం యువత ప్రశ్నించే తత్వాన్ని ఒంటబట్టించుకునే విద్యను నేర్చుకోవాలని సూచించారు. కొత్త విషయాలు నేర్చుకునేలా మనుసును సిద్ధం చేసుకోవాలన్నారు. క్రమశిక్షణతో పనిచేసే యువత వల్లే దేశానికి లాభమని.. వర్సిటీల నుంచి బయటపడేవారిలో సగం మంది నిరుద్యోగులుగా మారేందుకు ఇదే కారణమని ఆయన తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల మధ్యనున్న అంతరాన్ని నింపేలా విద్యావిధానం ఉండాలని ఆయన తెలిపారు. బిట్స్ సంస్థలు విద్యార్థుల్లో అత్యుత్తమ నైపుణ్యాలను పెంపొందిస్తున్నాయని.. ఇలాంటి విద్యావిధానమే దేశానికి అవసరమన్నారు. దేశంలో మరిన్ని ప్రైవేటు వర్సిటీలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. భారత దేశ సాంస్కృతిక వారసత్వన్ని సునిశితంగా పరిశీలించడం ద్వారా ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు వెతకాలని సూచించారు. ప్రపంచంలో తొలి వ్యవస్థీకృత విద్యావ్యవస్థ మన దేశంలో వేదకాలంలోనే ప్రారంభమైందన్నారు.