వేదాలకు వ్యతిరేకంగా రచనలు

వేదాలు, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా రచనలు చేయాలని ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య పిలుపునిచ్చారు. ఐఆర్‌టీఎస్‌ రిటైర్డ్‌ అధికారి అప్పికట్ల భరత్‌ భూషణ్‌ రచించిన ‘మెమొరీస్‌ ఆఫ్‌ దళిత్‌ సివిల్‌ సర్వెంట్‌’ పుస్తకాన్ని బుధవారం హైదరాబాద్‌లో ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి బి. ప్రసాదరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కంచె ఐలయ్య ప్రసంగిస్తూ... ‘‘ఈ దేశంలో బ్రాహ్మణ, అగ్రకుల ఆధిపత్యం నశించి... అంబేద్కర్‌, జ్యోతిబా పూలే కలలు నెరవేరాలంటే వేదాలకు వ్యతిరేకంగా రచనలు చేయాలి. బ్రాహ్మణులపై పోరాడే తెలివి వెనుకబడిన వర్గాలకు లేదు. క్రైస్తవులు, దళిత మేధావులే ఆ పని చేయాలి’’ అని సూచించారు. ఈ దేశంలో హిందుత్వం ఉండరాదని కూడా అన్నారు. గోదావరి పుష్కరాలకు ఒక్కరు కూడా వెళ్లకుండా క్రైస్తవులు, దళితులు చూడాలన్నారు. భరత్‌ భూషణ్‌లో మంచి సేవాగుణం ఉందని ప్రసాదరావు ప్రశంసించారు. స్వీయ అనుభవాలతో భరత్‌ భూషణ్‌ రచించిన పుస్తకం అందరూ చదవతగ్గదన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్‌ స్కూళ్ల కార్యదర్శి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ... భరత్‌ భూషణ్‌ రాసిన పుస్తకంలో ఎన్నో మంచి విషయాలున్నాయన్నారు. కడుపు నింపుకోలేని, కాలికి చెప్పుల్లేని వారి గురించి ఆలోచించే మంచి మనసు ఆయనకుందని పుస్తకం చదివాక తెలుస్తుందని చెప్పారు. తెలంగాణలోని రెసిడెన్షియల్‌ స్కూళ్లలో విద్యార్థులతో విజ్ఞానాన్ని పెంపొందించే జైభీమ్‌ దీక్ష చేయిస్తున్నామని తెలిపారు. దళితులు రచనల్లో మరింత శ్రద్ధ చూపాలని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కాకి మాధవరావు సూచించారు. ఈ పుస్తకాన్ని తన తల్లికి అంకితమిస్తున్నట్లు రచయిత భరత్‌ భూషణ్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు దళిత, క్రైస్తవ అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు.