విషం చిమ్ముతున్న దివిస్‌

 పరిశ్రమలొస్తే స్థానికులకు ఉపాధి లభిస్తుందని, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పాలకులు చెబుతున్న మాటలు భ్రమలు కల్పించేవి తప్ప భరోసా ఇచ్చేవి కావని అర్థమవుతోంది. నమ్మించి పారిశ్రామికవేత్తల అవసరాలు తీర్చడం కోసం ప్రజలతో ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాలని అనుభవాలు చెబుతున్నాయి. విశాఖ జిల్లాలోని సెజ్‌, ఫార్మా, హెటిరోడ్రగ్స్‌, బ్రాండిక్స్‌, డెక్కన్‌ కెమికల్స్‌, దివిస్‌ ఇలా ఏ కంపెనీని స్పృశించినా, దాని చరిత్ర చూసినా, నడత చూసినా అర్హతవున్న స్థానికులకు ఉద్యోగాలివ్వకపోవడం, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, కాలుష్య నియంత్రణ చర్యలు అమలుచేయకపోవడం, ఆర్జించిన వార్షిక లాభాల్లో రెండు శాతం సిఎస్‌ఆర్‌ నిధులను ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు కేటాయించకపోవడం వంటి సమస్యలే దర్శనమిస్తున్నాయి. పరిశ్రమంటే ప్రజలు భయపడే స్థితికి ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. హక్కులు, దైనందిన సమస్యలపై మాట్లాడితే అణచివేతలు, బెదిరింపులు, అక్రమ కేసులు బనాయించి గొంతునొక్కడం చంద్రబాబు పాలనలో నిత్యకృత్యమైంది. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గ కేంద్రంలోని దివిస్‌ ఔషధ కంపెనీ పరిసర ప్రాంతాలను విషతుల్యం చేస్తోంది. ఒకప్పుడు పిల్లా, పాపలతో సంతోషంగా గడిపిన కుటుంబాలిప్పుడు బతుకుతెరువులేక అల్లాడుతున్నాయి. భీమిలి మండలం చిప్పాడ పంచాయతీలో దివిస్‌ కంపెనీని 2003లో ప్రారంభించారు. కంపెనీ ప్రారంభానికి ముందు జల, వాయు, శబ్ద కాలుష్యం ఉండదని, ఈ ప్రాంత ప్రజలదంరికీ ఉపాధి కల్పిస్తామని, మెరుగైన జీవనం పొందుతారని చెప్పి కంపెనీ ఉత్పత్తి ప్రారంభించింది. చదువుకున్న తమ పిల్లలకు ఉద్యోగాలొస్తాయని స్థానికులు నమ్మారు. ఉన్న చోటే తమ పిల్లలు ఉద్యోగాలు చేస్తారని సంబరపడ్డారు. కాలక్రమంలో దాని అసలు రూపం బయటపడింది. స్థానికులకు ఉపాధి కల్పిస్తే ఒక్కటై సమస్యలపై నిలదీస్తారని, స్థానికేతరులైతే భయపడి పనిచేస్తారని భావించిన యాజమాన్యాల కుతంత్రాలకు ప్రభుత్వాలు సహకరించడంతో ఇప్పుడు బతుకుతెరువులేక ఉపాధి కోసం ఉద్యమించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కంపెనీ దశాబ్దమున్నర కాలంగా ఔషధాలను ఉత్పత్తి చేస్తోంది. దీన్నుంచి విడుదలయ్యే వాయు, జల, రసాయన కాలుష్యంతో భూగర్భ జలాలు కలుషితమై తాగడానికి నీరులేకుండాపోయింది. పచ్చని పంటపొలాలు పనికిరాకుండాపోయాయి. సముద్రంలో రసాయనాలు విడిచిపెట్టడంతో మత్స్య సంపద నాశనమైంది. వేటపై ఆధారపడి బతుకుతున్న మత్స్యకారులకు జీవనోపాధిపోయింది. కలుషిత నీరు, గాలి పీల్చుకుంటూ జీవశ్చవాల్లాగా బ్రతుకుతున్నారు.
దివీస్‌ కంపెనీకి ఆనుకొనివున్న కంచేరుపాలెం, చిట్టినగర్‌, కోసవానిపాలెం, నమ్మివానిపాలెం, ఆసిపాలెం, అన్నవరం, చిప్పాడ, ములకుద్ది, పెద్దనాగయ్యపాలెం ప్రజలు చర్మ, టిబి, కీళ్లనొప్పులు, గుండె, కంటి, కిడ్నీ, శ్వాసకోశ వంటి వ్యాధుల బారినపడుతున్నారు. దివిస్‌ బారి నుంచి తప్పించి రక్షించమని ప్రజలు డిమాండ్‌ చేస్తుంటే యాజమాన్యం కంపెనీ విస్తరణ పనులు ప్రారంభించింది. ఈ విస్తరణ పనులు గ్రామానికి అతి దగ్గరగా జరుగుతుండంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. విస్తరణ పనులు నిలిపేయాలని పరిసర ప్రాంతాల ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. కంపెనీ గేటు వద్ద వందలాది మంది తమ వ్యతిరేకతను చాటిచెప్పారు. కంపెనీ విస్తరణ పనులు నిలిపివేయాలని ఎంతో కాలంగా ప్రజలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. అక్రమ కేసులు పెట్టి ఉద్యమకారుల అణిచివేతకు పాల్పడుతోంది. అయినప్పటికీ పిల్లలతో సహా వేలాదిగా విశాఖపట్నం తరలివచ్చి నగరంలో ర్యాలీ నిర్వహించి చలో కలెక్టరేట్‌ విజయవంతం చేసి కంపెనీ పట్ల తమ వ్యతిరేకతను వ్యక్తీకరించారు. కంపెనీ విస్తరణ పనులు నిలిపివేయాలని 20 రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేపట్టి నిరసన తెలియజేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినాలేదు. మంత్రి గంటా శ్రీనివాసరావుకు లండన్‌ వెళ్లడానికి సమయముందిగాని దివిస్‌ బాధిత ప్రజల సమస్యలపై స్పందించి మాట్లాడే తీరికలేనట్లుంది. ఇంతవరకు ఆయన పట్టించుకున్న పాపానపోలేదు.
దివిస్‌ కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణలో యాజమాన్యం ఇచ్చిన హామీలేవీ పద్నాలుగేళ్లవుతున్నా అమలు జరగలేదు. స్ధానిక యువతకు పర్మినెంట్‌ ఉద్యోగాలిస్తామని మోసం చేశారు. అన్నవరంలో 500 మంది మత్స్యకారులు ఉపాధిలేక వలస పోయారు. భూగర్భ జలాలు కలుషితమవ్వడంతో తాగు నీరు కొనుక్కోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. వాయు కాలుష్యం వల్ల పంటలు పండడంలేదు. పశువులు బక్కచిక్కిపోవడంతో పాల ఉత్పత్తి తగ్గిపోయింది. గోస్తనీ నదీ జలాలను కంపెనీ అవసరాలకు కారుచౌకగా ఇస్తున్న ప్రభుత్వం తాగునీటికి కటకటలాడుతున్న ప్రజలకు మాత్రం తాగునీటి సౌకర్యం కల్పించడంలేదు. దివిస్‌ కంపెనీ కాలుష్యంతో ప్రజలింత బాధపడుతున్నా ప్రభుత్వ యంత్రాంగానికి, కాలుష్య నియంత్రణ మండలికి పట్టడంలేదు. కంపెనీ వస్తే ఉపాధి దొరుకుతుందన్న ఆశతో సాగుచేసిన భూములు కంపెనీకిచ్చారు. పధ్నాలుగేళ్లవుతున్నా స్థానికులు 15 మందికి కూడా పర్మినెంట్‌ ఉద్యోగాలు ఇవ్వలేదు. కంపెనీలో కార్మికులకు కనీస భద్రత లేదు. కంపెనీ, కాంట్రాక్టర్లు ఎంత ఇస్తే అంతే వేతనానికి పని చేయాలి. కనీస వేతనాలు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, బోనస్‌ వంటి చట్టాలు అమలుకావడంలేదు. ఎవరైనా నోరెత్తి అడిగితే వాళ్ల 'బ్యాడ్జీ'ని లాక్కొని నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేస్తున్నారు. ఏడాదిలో 240 రోజులు పనిచేసిన కార్మికుణ్ణి పర్మినెంట్‌ చేయాలని కార్మిక చట్టాలు చెబుతున్నా అమలుచేయడంలేదు. కార్మికులను మండుటెండలో రోడ్లపై, దుమ్ము, ధూళిలో భోజనాలు చేయిస్తుందంటే కార్మికుల పట్ల యాజమాన్యం వైఖరేంటో అర్థమవుతుంది. పిఎఫ్‌, ఇఎస్‌ఐ వంటి సదుపాయాలు లేవు. ప్రమాదం జరిగితే ప్రాథమిక చికిత్స కూడా అందించరు. యాజమానుల కోసం అన్ని రకాల అనుమతులు సింగిల్‌ విండో ద్వారా లభించేలా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే స్థిరపడిన కార్పొరేట్‌ కంపెనీలు ఇష్టారాజ్యంగా అనుమతుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి కారుచౌకగా భూములుకొట్టేయాలని చూస్తున్నారు. ఆ నేపథ్యంలోనే విశాఖ జిల్లా భీమిలి మండలంలో చిప్పాడ, ములకుద్ది, పెద్దనాగయ్యపాలెం, కంచేరుపాలెం, చిట్టినగర్‌, కోసవానిపాలెం, నమ్మివానిపాలెం, ఆసిపాలెం, అన్నవరం పంచాయతీల్లో 16 వేల జనాభా కల్గిన 17 గ్రామాల పరిధిలో 2003లో వంద ఎకరాల్లో ఏర్పాటుచేసిన దివిస్‌ లేబోరేటరీ ఔషధ కంపెనీ ఇప్పుడు మరలా కంపెనీ ఎదురుగా ఉన్న ''మాన్సాస్‌ ట్రస్టు'' నుంచి 99 ఎకరాలు కొనుగోలు చేసి విస్తరణకు సిద్ధపడింది. ప్రజాభిప్రాయం నిర్వహించకుండా కంచేరుపాలెం గ్రామాన్ని ఆనుకొని గోడను నిర్మించడం చట్ట వ్యతిరేకం. మాన్సాస్‌ ట్రస్టు భూములు అమ్మడం కూడా దేవాదాయ, ధర్మాదాయ నిబంధనలకు విరుద్ధం. ఆ భూముల్లో తాతముత్తాతల నుంచి సాగులో ఉన్న రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా బలవంతంగా వెళ్లగొట్టారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ చట్టం ప్రకారం సాగుదార్లందరికీ పరిహారం ఇవ్వాల్సివున్నా ఏ ఒక్కరికీ పరిహారం చెల్లించలేదు. దివిస్‌ విస్తరణ జరిగితే కంచేరుపాలెం, పరిసర ప్రాంతమంతా కాలుష్యమయమై ప్రజలు రోగాలబారినపడే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడనున్నాయి.
దివిస్‌ యాజమాన్య నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విశాల ఐక్య ఉద్యమాలు నిర్వహించినప్పుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. స్థానికులకు ఉపాధి సాధన, కాలుష్య నియంత్రణ చర్యలు, విస్తరణ పనుల నిలిపివేత వంటి వాటిపై పోరాడే శక్తులకు ఇతరేతర శక్తులు శక్తినిచ్చి సహకరించినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది.
- కె లోకనాథం
(వ్యాసకర్త సిపియం విశాఖ జిల్లా కార్యదర్శి)