విశాల ఉద్యమం చేపట్టాలి: YV

కార్పొరేట్ల అనుకూల విధానాలను అనుసరిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయా తరగతుల ప్రజలు విశాల ఉద్యమం చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు పిలుపు నిచ్చారు. పార్టీ ఒంగోలు జిల్లా కమిటీ సమావేశం మంగళవారం సుందరయ్య భవన్‌లో జరిగింది. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జాలా అంజయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో వై వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా మాట్లాడారు. గత తొమ్మిది సంవత్సరాల కాలంలో కార్పొరేట్ల అనుకూల విధానాలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం గతం కంటే మరింతగా కార్పొ రేట్ల ప్రయోజనాలు కోసం పని చేస్తోందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి పేరు చెప్పి బహుళజాతి కంపెనీలకు, పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలకు పేద రైతులు, దళితులు ఎన్నో దశాబ్ధాలుగా అనుభవిస్తున్న భూములను కట్టబెడు తోందని విమర్శించారు. కార్మికుల హక్కులను కాల రాసే విధంగా శాసనసభలో కార్మికచట్టాలలో మార్పులు చేసిందని దుయ్యబట్టారు. ప్రపంచబ్యాంక్‌ రెండో ర్యాంక్‌ ఇచ్చిందని సింగ్‌పూర్‌లో చెప్పకుంటున్న చంద్రబాబు రాష్ట్రంలో ఎటువంటి కార్మిక ఆందోళనలు, ఉద్యమాలు ఉండవని సింగ్‌పూర్‌లో చెప్పడం ఆయన నైజాన్ని బయటపెట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయా ల్సింది పోయి ప్రయివేట్‌ విశ్వవిద్యాలయాలను శరవేగంగా తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయడం ప్రభుత్వ రంగం పట్ల ఉన్న చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోందన్నారు. వైద్యరంగాన్ని కూడా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేయకుండా కార్పొరేట్ల చేతుల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ విధానాలను ప్రజలు నిరసించాలని పిలుపునిచ్చారు.