విశాఖ కెజిహెచ్ హాస్పటల్ ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం సిగ్గుచేటు ...

విశాఖ కెజిహెచ్ ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్నివ్యతిరేకిస్తూ సిపియం పార్టీ ఆద్వర్యంలో  సంతాల సేకరణలో పాల్గొన్న బి.వి.రాఘవులు ... 

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు ఆరోగ్యం నుండి కాపాడేది కేజిహెచ్‌. అటువంటి కేజిహెచ్‌లో కార్డియాలజీ విభాగాన్ని ప్రభుత్వం కేర్‌ కార్పొరేట్‌ సంస్థకు అప్పగించాలని నిర్ణయించడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అలాగే కార్డియాలజీ విభాగానికి అవసరమైన వైద్య సిబ్బందిని నియమించి ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని విజ్ఞప్తి చేస్తోంది.
    ప్రస్తుతం గుండెజబ్బుకు వైద్యం అత్యంత ఖర్చుతో కూడుకున్నది. పేదలు ప్రైవేట్‌ వైద్యం చేయించుకోలేక కేజిహెచ్‌లోనే వైద్యం చేయించుకుంటున్నారు. రోజుకు రెండువేల మందికిపైగా రోగులు వస్తున్నారు. దీనికి వైద్య సిబ్బంది కొరతగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆదిశగా అడుగు వేయడం లేదు. కేజిహెచ్‌లో కార్డియాలజీ థొరాసిక్‌ సర్జరీ విభాగంలో బైపాస్‌ సర్జరీలు నిర్వహిస్తున్నారు. గత ఆరునెలల క్రితం కార్డియో సర్జన్‌ రిటైర్డ్‌ కావడంతో ఆ స్థానాన్ని భర్తీచేయకుండా ఈ విభాగాన్ని ప్రైవేట్‌వారికి అప్పగిస్తామంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ప్రకటించడం దుర్మార్గం. ఒక్క విభాగం ప్రైవేట్‌వారికి ఇచ్చినట్లైతే రాబోయే కాలంలో కేజిహెచ్‌ మొత్తం ప్రైవేట్‌వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కేజిహెచ్‌కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోగా ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలకు జేబులు నింపుకోవడం కోసం ఆరోగ్యశ్రీ పథకం పెట్టింది. ఈ పథకం ద్వారా పేదలు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరినా ఆ డబ్బు ఉన్నంతవరకూ వైద్యం చేసి తరువాత రోగులను డిచార్జ్‌చేసి కేజిహెచ్‌కు పంపుతున్నారు. ఇది అత్యంత ధారుణం. కేజిహెచ్‌ను సూపర్‌స్పెషాలిటీ హాస్పటల్‌గా తీర్చుదిద్దుతాం అని తెలుగుదేశం ప్రభుత్వం వాగ్ధానం చేసింది. దానిని అమలు చేయకుండా నేడు ప్రైవేటీకరిస్తామని అంటున్నారు. ఈ హాస్పటల్‌ను గాని ప్రైవేటీకరిస్తే వైద్యం పేదవాడికి అందనిద్రాక్షగా మిగులుతుంది. కేజిహెచ్‌లో డాక్టర్లు, నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని వెంటనే భర్తీచేయాలి. రోగులుకు అవసరమైన మరుగుదొడ్లు, మంచినీరు, బెడ్స్‌, మందులు అందుబాటులో ఉండేవిధంగా ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని సిపిఐ(ఎం) పార్టీ డిమాండ్‌ చేస్తోంది.
    ప్రభుత్వవైద్యాన్ని ప్రైవేట్‌పరం చేసే విధానాలు తెలుగుదేశం వేగంగా అమలు చేస్తున్నది. అందుకే ప్రభుత్వ ఆసుపత్రులకు నిధులు ఇవ్వకపోవడం, డాక్టర్స్‌ను భర్తీ చేయకపోవటం, అవసరమైన పరికరాలను కొనకపోవటం, కొత్త ఆపరేషన్‌థియేటర్స్‌, బ్లాక్‌లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించకుండా వివక్షత చూపుతున్నది.
    విశాఖ ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (విమ్స్‌) ను ప్రారంభించకుండా పిపిపి ముసుగులో తమ తాబేదార్లకు కట్టబెట్టాలని తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. 3నెలల్లో విమ్స్‌ను ప్రారంభిస్తామని చెప్పి సంవత్సరం గడిచినా నేటికీ ప్రారంభించలేదు.  నేడు విమ్స్‌లో కొంతభాగాన్ని టాటా క్యాన్సర్‌ ఇనిస్ట్యూట్‌ కి ఇవ్వటానికి బేరసారాలు కుదుర్చుకుంటున్నారు. ఈ చర్య ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేయడమేనని సిపియం భావిస్తోంది. కావున ప్రజలందరూ ఈ చర్యలను ఖండించాలని కోరుతోంది.