విశాఖలో సీపీఐ సీపీఎం బస్సు యాత్ర

విజయవాడలో సెప్టెంబర్‌ 15న నిర్వహించే మహాగర్జనకు ప్రజలను సమాయత్తం చేస్తూ సిపిఎం-సిపిఐ ఆధ్వర్యంలో శనివారం విశాఖలో బస్సు యాత్ర చేపట్టారు. ముందుగా బహిరంగ సభ నిర్వహించారు. సభలో సిపిఎం పొలిట్‌బ్యూ‌రో స‌భ్యు‌లు బి.రాఘవులు మాట్లాడుతూ.. టిడిపి, వైసిపి విధానాలు రాష్ట్రంలో ఒకే విధంగా ఉన్నాయన్నారు. టిడిపి, వైసిపిలు ఇంతవరకూ చాలా పాదయాత్రలు, బస్సు యాత్రలు చేశాయి కాని రాష్ట్ర ప్రజల సమస్యల్ని పరిష్కరించలేకపోయాయని, ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని చూపలేకపోయాయని దుయ్యబట్టారు. అనంతరం సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. 2014కు ముందే విశాఖ రైల్వే జోన్‌ కోసం రైల్వే పోరాట సాధన కార్యాచరణ కమిటి వేశారని తెలిపారు. అధికారంలోకి వస్తే విశాఖ రైల్వే జోన్‌ ఇస్తామన్న టిడిపి, వైసిపి నేతలు రాష్ట్ర ప్రజలను నయవంచన చేశారన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ..పిటిపిఐఆర్‌ పేరిట చంద్రబాబు లక్షల ఎకరాల భూముల్ని లాక్కున్నారని తెలిపారు. అమరావతిలోలానే లాండ్‌పూలింగ్‌ పేరిట విశాఖలో కూడా చేయాలనుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.