విశాఖలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం రాష్ట్ర మహాసభ, భారత రాజ్యాంగం- పౌరహక్కులు అనే సెమినార్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

    ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కు సంఘం రాష్ట్ర మహాసభలు  మార్చి 27వ తేదీన విశాఖనగరంలో జరుగుతుంది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం - పౌరహక్కులు  అనే అంశంపై రాష్ట్ర స్థాయి సెమినార్‌ జరుగుతుంది. ఈ సెమినార్‌ను జయప్రదం చేయాలని ఈ రోజు (24-03-2016) పోస్టర్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ ఆవిష్కరణలో విశాఖ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షులు  కె.ఎస్‌. సురేష్‌ కుమార్‌, ఐలూ నాయకులు ఎన్‌. హరినాధ్‌, ఎ.కె.ఎన్‌ మల్లేష్‌, ఐ.ఎ.ఎల్‌ నాయకులు వెంకటేశ్వరరావు, సాయికుమార్‌ లు  పాల్గొన్నారు.  ఈ సందర్బంగా వారు ప్రసంగించారు.
    భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన ప్రాధమిక హక్కులను కాపాడవలసిన భాద్యత ప్రభుత్వాలపై ఉన్నది. కాని ప్రస్తుతం ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పౌరహక్కులను కాపాడటంలో వైఫల్యం  చెందుతున్నాయి. ప్రజలు స్వేచ్ఛగా వారి భావాలను వ్యక్తం చేయలేని పరిస్థితులు  నేటి సమాజంలో ఏర్పడుచున్నవి. అసహనం పెరగడం వలన భావవ్యక్తీరణ చేస్తున్న అభ్యుదయ, లౌకిక, ప్రజాస్వామ్యవాదులపై భౌతికంగా దాడులు, హత్యలు పెరుగుచున్నవి. కాల్‌బుర్గి లాంటి రచయితను హత్య చేయడం, ప్రజలుకు నష్టం కలిగించే ప్రభుత్వ విధానాలను విమర్శించినట్లయితే వారిపై అక్రమ కేసు పెట్టి హింసించడం, ప్రజా ఉద్యమాలను నిర్భంద విధానాల  ద్వారా అణిచివేయడం, తదితర చర్యలన్ని పౌరహక్కులకు భంగం కలిగించడమే అవుతుంది. మైనారిటీలకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కూడా గుర్తించకుండా, వారిపైన భౌతికదాడులు  చేస్తూ, వారి ప్రార్ధన మందిరాలను కూలగొట్టుట ద్వారా లౌకిక వ్యవస్థకు ప్రమాదకర పరిస్థితులు మతోన్మాద శక్తులు  తెస్తుంటే, వారిపైన కూడా కఠినచర్యలు  తీసుకొనడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుచున్నవి. ఈ నేపధ్యంలో విశాఖలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం రాష్ట్ర మహాసభ జరుగుచున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధులు  ఈ మహాసభలో పాల్గొని పౌరహక్కులు , రాజ్యాంగంపై జరుగుతున్న దాడులపై పలు  తీర్మాణాలు  చేస్తారు.  రాష్ట్ర నూతన నాయకత్వాన్ని ఎన్నుకుంటారు.
      ఈ మహాసభ సందర్భంగా ‘‘భారత రాజ్యాంగం మరియు పౌరహక్కులు’’ అనే అంశంపై మార్చి 27న జరిగే రాష్ట్ర స్థాయి సదస్సు  విశాఖపట్నం, డాబాగార్డెన్స్‌లో ఉన్న హోటల్‌ చండ్రాస్‌ (నెల్లూరు మెస్‌)లో ఉదయం 10.00గంటల నుండి నిర్వహించబడును. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌, డి.ఎస్‌.ఆర్‌. వర్మ, ఎ.పి బార్‌ కౌన్సిల్‌ సభ్యులు  సుంకర రాజేంద్రప్రసాద్‌, ముప్పాళ్ళ సుబ్బారావు, ఐ.ఎ.ఎల్‌.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చలసాని అజయ్‌ కుమార్‌, ఐలూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు, ఉపాధక్షులు  పొత్తూరి సురేష్‌ కుమార్‌ తదితరులు  పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సదస్సుకు అత్యధిక మంది మేధావులు, అభ్యుదయవాదులు, పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.