విలువలతో కూడిన విద్య నేటి అవసరం

స్వాతంత్య్రోద్యమంలో మహా నాయకులు తమ పుట్టినరోజులను సామాజిక ఆశయాలతో ముడిపెట్టుకున్నారు. పుట్టిన రోజును కొత్త తీర్మానాలు చేసుకొనేదిగా నిర్ణయించుకున్నారు. కొత్త ఆశయాలకు కంకణబద్ధులై అందుకు ప్రణాళిక రచించుకొనే రోజుగా మార్చుకొని రాజీలేని పోరాటం చేశారు. కాబట్టే సెప్టెంబర్‌ 5న భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని యావత్‌ భారతావని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొంటోంది. 'విద్యకు విద్యార్థులు అంకితం.. ఉపాధ్యాయులు విద్యార్థులకు అంకితం' అని చెప్పిన మహానుభావుడు ఆయన. ఉపాధ్యాయుల దిశానిర్దేశం లేకపోతే విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరమే అనేందుకు మరో మాటలేదు. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే.. వారికి విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణను, సామాజిక విలువలను ఒంటబట్టించి సమగ్ర వ్యక్తిత్వం కల్గిన మనిషిగా తీర్చిదిద్దడంలో గురువు కృషి అసమానమైనది. అందుకే మాతృదేవో భవ, పితృ దేవోభవ, ఆచార్య దేవో భవ అంటారు. అయితే, నేడు విద్య అంగడి సరుకుగా మారిన తరుణంలో విద్యావ్యవస్థలో విచ్ఛిన్నకరమైన ధోరణులు ప్రవేశించాయి. పాఠశాలల్లో గ్రంథాలయాలు, ఆటస్థలాలు, ప్రయోగశాలలు, తరగతి గదులు ఉంటేనే ఉపాధ్యాయుడు తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగల్గుతాడు. ఎలాంటి విద్యా వసతులు కల్పించకుండా విద్యా ప్రమాణాల పతనానికి ఉపాధ్యాయులనే బాధ్యులుగా చేయడం సబబు కాదు. ఇప్పటికే దిగజారిపోయిన విద్యా ప్రమాణాలపై ప్రభుత్వాలు దృష్టిపెట్టకపోతే టీచర్లను మొక్కుబడిగా సత్కరించే రోజుగానే ఉపాధ్యాయ దినోత్సవం మిగిలిపోయే ప్రమాదం ఉంటుందని పాలకులు గుర్తుంచుకోవాలి.
గురువే మార్గదర్శి
ప్రతి మనిషీ తన జీవిత కాలంలో కుటుంబ సభ్యుల తర్వాత ఎక్కువ సమయం గడిపేది ఉపాధ్యాయునితోనే. అందుకే వారు చెప్పేదే విద్యార్థి వింటాడు.. ఆ మాటలకే ప్రేరేపితుడవుతాడు.. ఆయన మార్గాన్నే అనుసరిస్తాడు.. ఆయననే అనుకరిస్తాడు.. చివరకు ఆయన జీవన విధానానికే ఆకర్షితుడై తనకు మార్గదర్శిగా భావిస్తాడు. జీవితాంతం ఆయనను గుర్తుపెట్టుకుంటాడు. ఇదో సామాజిక ప్రక్రియ. గురువు జీవితం విద్యార్థి క్యారెక్టర్‌ను ప్రభావితం చేస్తుంది కాబట్టే గతంలో ఇంటర్వ్యూల్లో మీ గురువు ఎవరు అని కూడా అడుగుతుండేవారు. ఒక విద్యార్థి జీవితంపై గొప్ప ఉపాధ్యాయుడి ప్రభావం ఎంత ఉంటుందో చెప్పేందుకు ఇదో మంచి ఉదాహరణ. సామాజిక విలువలతో కూడిన చదువే సమాజాభివృద్ధికి బీజం వేస్తుంది. మానవత్వాన్ని పరిమళింపజేస్తుంది. ప్రాచీన భారతీయ విద్యా వ్యవస్థ వ్యక్తిత్వ వికాసం, విలువలు, నైతికత, నిస్వార్థ జీవన విధానాలను నేర్పింది. తద్వారా సామాజిక అభ్యున్నతికి కొత్తబాటలు నిర్మించింది. ఈ ప్రక్రియలో ఉపాధ్యాయులకు ఎంతో గౌరవం ఏర్పడింది. ఉపాధ్యాయులు కూడా నిత్యవిద్యార్థులుగా ఉంటూ ప్రజల అవసరాలను తీర్చే దిశగా చొరవ తీసుకుంటూ మార్గదర్శకులుగా ఉండేవారు. బతకలేక బడిపంతులు అనే నానుడి ఆ రోజుల్లో ఉన్నా.. ఉపాధ్యాయులు మాత్రం నిరాడంబర జీవితాన్ని కొనసాగిస్తూ సామాజిక అభ్యున్నతికే కృషిచేశారు. గ్రామాగ్రామాన తిరిగి విద్యా వ్యాప్తికి వారు సాగించిన పోరాటం అజరామరం. ఎంత పేదరికం అనుభవించినప్పటికీ పాఠశాలల పట్ల మమకారాన్ని, విద్యార్థుల పట్ల ప్రేమను, వృత్తిపట్ల అంకిత భావాన్ని వదులుకోలేదు. విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు బోధించడం తమ సామాజిక బాధ్యతగా గుర్తించారు తప్ప ఏనాడూ దాని నుంచి పక్కకు తప్పుకొనే ప్రయత్నం చేయలేదు.
ప్రేమకు ప్రతీక
ఉపాధ్యాయుడు ప్రేమ, సామాజిక బాధ్యత, భవిష్యత్తుపై ఆలోచన అనే మూడు అంశాలకు ప్రతీకగా నిలుస్తాడు. ప్రేమ లేనిదే చదువులేదు. ఉపాధ్యాయుడు నేర్పిన విద్యను పిల్లలు నేర్చుకోవాలంటే వారిపట్ల ప్రేమపూర్వకంగా వ్యవహరించాలి. అప్పుడే వారు శ్రద్ధగా విని ఒంటబట్టించుకుంటారు. దేశంలోని ప్రజల పట్ల ప్రేమ బీజాలు చిన్నప్పుడే నాటాలి. ఉపాధ్యాయుడు ఎంత వాత్సల్యంతో చిన్నారులను దగ్గరకు చేర్చుకుంటాడో వారు కూడా భవిష్యత్తును అంతగా ప్రేమిస్తూ ప్రజలకు అండగా నిలుస్తారు. ఉపాధ్యాయుడు తన సామాజిక బాధ్యతను ఎవరి గొప్పల కోసమో నిర్వర్తించడు. వచ్చే తరానికి సామాజిక బాధ్యత కల్గిన సైన్యాన్ని తయారుచేయాలనే కాంక్షతోనే ఇదంతా చేస్తాడు. గతం కన్నా భవిష్యత్తుపైనే ఉపాధ్యాయుడు ఎక్కువగా దృష్టి సారించాలి. ఎందుకంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాబోయే కాలంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే తరాన్ని సిద్ధం చేయాలి. జ్ఞానంతో పరుగెత్తాలంటే తాను స్వతహాగా అధ్యయనశీలి కావాలి. పాత భావాలను వల్లెవేయడమో, కొత్త భావాలను చెప్పడమో బోధన కాదు. సరికొత్త భావాలను పిల్లల్లో రేకెత్తించే నైపుణ్యాలను వారికి బోధించాలి. జీవితమంతా సుఖమయం కాదు.. ఎన్నో ఒడిదుడుకులు, సమస్యలు ఎదురవుతాయి. ఆపాటి సమస్యలకు కుంగిపోవడం, అననుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు నీరుగారిపోవడం ఉపాధ్యాయుని లక్షణం కాదు. సమాజంలోని నిగూఢమైన అంశాలను భవిష్యత్తు తరాలకు తెలియజెప్పడమే బాధ్యతగా గుర్తించాలి. ఉపాధ్యాయుడు చేసే పని కేవలం వృత్తిపరమైనదే కాదు.. అది సామాజిక బాధ్యతలో భాగం మాత్రమే. రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు కల్పించింది. కానీ సమత్వంలేని ఈ సమాజంలో అంతస్తులు రూపుమాపేందుకు ఉపాధ్యాయుడే ఓ రోడ్‌ రోలర్‌గా వ్యవహరించాలి. నాలుగు గోడల మధ్య మేధోమధనం ద్వారా సమసమాజాన్ని స్థాపించే అవకాశం ఒక్క గురువుకే సాధ్యమవుతుంది. కానీ.. పాలకులు సిలబస్‌ పూర్తిచేసేంత వరకే ఉపాధ్యాయులను పరిమితం చేస్తున్నారు. కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ (ఆదేశించు, నియంత్రించు) అనే పద్ధతుల్లోనే బోధనను కొనసాగించేలా వ్యవహరిస్తున్నారు. దీంతో విద్యార్థి అసమాన సమాజానికే సమిథగా మారుతున్నాడు. విద్యార్థులు సమాజంలోకి రాకముందే లింగవివక్ష, వివక్షకు గురవుతున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. సమాజంలో పాతుకుపోయిన కులవ్యవస్థకు మరింత ఆజ్యం పోసేలా పాలకులు వ్యవహరిస్తున్నారు. చివరకు స్త్రీల భద్రతకు, ఉపాధికి భరోసా కల్పించలేకపోతున్నాం. మన విద్యా విధానంతో తోటి చెల్లెళ్లకు జీవితంపై కొత్త ఆశలు కల్గించే వాతావరణం తీసుకురావాల్సి ఉంది. అసమాన సమాజానికి మూలకారణం కుల వ్యవస్థే అని గుర్తించినా.. అదే కులం కోసం నేడు పాకులాడుతున్న వైనం తేటతెల్లమవుతోంది. సమాజంలో శాంతిస్థాపనకు బదులు ద్వేషం, అసూయలను రగిల్చేలా వ్యవహరిస్తున్నారు. సామాజిక పరివర్తనకు ప్రధాన సాధనమైన విద్య స్వార్థపరుల చేతుల్లోకి మారిపోయిన తర్వాత సామాజిక అంతస్తులకు బీజం పడింది. విధేయులైన కార్మికులను తయారుచేసే విద్యావిధానాలు దేశంలో అమలవుతున్నాయి. సామాజిక అంతస్తులు కూల్చేస్తుందన్న విద్యే నేడు అసమానతలకు కారణమై.. కొందరిని కోటీశ్వరులను చేస్తుంటే.. మరికొందరిని బికారులుగా మార్చుతోంది. ఆర్థిక ఆదాయాన్ని ఆశించని ప్రక్రియే నేడు కనబడటంలేదు. మానవత్వపు ఛాయలు దూరమవుతున్నాయి. ఉపాధ్యాయులు ఈ విష వలయంలో సమిథలు కాకుండా అప్రమత్తం కావాల్సిన సమయమిది. విద్య ద్వారానే నవభారత సమసమాజం సాధ్యమని నమ్మి, అందుకు తమ జీవితాలనే త్యాగం చేసిన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ లాంటి ఎంతోమంది గొప్ప గురువులందరినీ ఆదర్శంగా తీసుకోవాల్సిన సందర్భమిది. ప్రతి ఉపాధ్యాయుడూ సామాజిక బాధ్యతతో మెలిగి ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకొనే దిశగా, విలువలతో కూడిన విద్యా వ్యాప్తికి కృషిచేయాలి. అప్పుడే సర్వేపల్లి రాధాకృష్ణన్‌ లాంటి మహోపాధ్యాయుల మహాసంకల్పంలో మనమూ భాగస్వాములం కాగలం.
- డాక్టర్‌ చుక్కా రామయ్య (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు)