విమ్స్‌ హాస్పటల్‌ను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలి. - పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎం.వి.యస్‌.శర్మ

విమ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎం.ఎల్‌.సి శ్రీ ఎం.వి.ఎస్‌.శర్మ డిమాండ్‌ చేశారు. విమ్స్‌ను ప్రారంభించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) చేస్తున్న 48 గంటల నిరాహారదీక్షా శిభిరాన్ని నేడు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ నిమ్స్‌ తరహాలో విమ్స్‌ను అభివృద్ధి చేయాలని, సామాన్య ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తేవాలని కోరారు. గోదావరి పుష్కరాలకు 1600 కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు ప్రభుత్వం విమ్స్‌కు 100 కోట్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో విమ్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పిన చంద్రబాబు 600రోజులు పూర్తవుతున్నా విమ్స్‌ గుర్తుకు రాకపోవడం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వ వైద్యం కోసం ఒక లక్ష ఎనభైవేల కోట్లరూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట కేవలం 40కోట్లు ఖర్చుచేసి ప్రజలను మోసం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌.టి.ఆర్‌ ఆరోగ్యశ్రీ పేరుతో 1200 కోట్లు రూపాయలు కార్పొరేట్‌ సంస్థకు ఇస్తోంది తప్ప విమ్స్‌కు కనీసమైన కేటాయింపు చేయకుండా నిర్వీర్యం చేస్తోందన్నారు. 600 కోట్లు విలువచేసే విమ్స్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. విమ్స్‌ వస్తే ప్రజలకు వైద్య సేవలతో పాటు విద్యార్ధులకు మెడిసిన్‌లో పిజి సీట్లు వస్తాయన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు.
    ఈ సమస్యపై మార్చి 1న ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదికగా ధర్నా చేస్తామని చెప్పారు. శాసనమండలిలో ఈ సమస్యను లేవనెత్తుతానని, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ప్రకటించారు.
    ఈ దీక్షా శిభిరానికి పెన్షనర్స్ అసోసియేషన్‌ నాయకులు బిటిమూర్తి, జి.సూర్యప్రకాశరావు, ఇన్సూరెన్సు కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.కామేశ్వరి, ఎన్‌.రమణాచలం, కాంగ్రెస్‌పార్టీ తూర్పునియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌ గుత్త శ్రీనివాసరావు, నగర మహిళా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలు  శిరీషా, సామాన్యప్రజాపార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.చంద్రశేఖర్‌, జిల్లా అధ్యక్షు పల్లా వేణుగోపాల్‌, ఎయు హాస్టల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ మాజీ గౌరవాధ్యక్షులు వై.కృష్ణారావు, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక నాయకులు బి.బి.గణేష్‌ తదితరాలు  పాల్గొని తమ సంఫీుభావం తెలిపారు.