
విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)ను రాష్ట్రప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని, దీనిని ప్రైవేట్‌పరం చేయరాదని డిమాండ్ చేస్తూ నేడు విశాఖజిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద సిపిఐ(యం) ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్.నరసింగరావు పాల్గొని మాట్లాడుతూ విమ్స్ ఆసుపత్రి నిర్మాణం మొదటి దశ పూర్తయి మూడేళ్ళు అయినా రాష్ట్రప్రభుత్వాలు వివక్షత, నిర్లక్ష్యం వల్ల నేటికీ ప్రారంభానికి నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేసారు. ఇటీవ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు విమ్స్‌ను ప్రభుత్వ-ప్రైవేట్-భాగస్వామ్యం (పిపిపి) పేర బడా కార్పొరేట్ సంస్థలకి ధారాధత్తం చేయబోతున్నట్లు ప్రకటనలు వచ్చాయి. మొదటివిడతగా విమ్స్‌లోని రెండుబ్లాకులను టాటా కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిస్తున్నది. ఇది అత్యంత దుర్మార్గం. సామాన్యప్రజల ఆరోగ్యం కోసం నిర్మించిన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని రాజకీయ కుట్రతో కార్పొరేట్ సంస్థలపరం చేయడం ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్యానికి గొడ్డలిపెట్టువంటిది. తక్షణం ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని ఉపసంహరించాలని ఆయన కోరారు. అలాగే విమ్స్‌ను వెంటనే ప్రారంభించి పేదలకు వైద్యసేలవందించేదానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు.
విశాఖనగరం హైవేకు ఆనుకొని ఉన్న హనుమంతువాక జంక్షన్‌లో 2007లో 110 ఎకరాల్లో విమ్స్‌ను నిర్మించాలని నాటి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. మొత్తం 250 కోట్లు (సవరించిన అంచనా 450కోట్లు) వ్యయంతో 21 సూపర్ స్పెషాలిటీస్‌తో 1300 పడకలతో నిర్మించాలని నిర్ణయించింది. 3ఏళ్ళ క్రితం మొదటి దశలో భాగంగా 6 బ్లాక్‌లు, 250పడకలు పూర్తయ్యాయి. కేవలం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 85కోట్లు మాత్రమే విమ్స్‌కి ఖర్చుచేసింది. గతంలో వైద్యపరికరాలకోసం విడుదల చేసిన 30కోట్లు కూడా ప్రభుత్వ కుట్రవల్ల టెండర్లదశలోనే మురిగిపోయాయన్నారు.
చంద్రబాబునాయుడు ప్రభుత్వం తొలి క్యాబినెట్ విశాఖపట్నంలో జరిగింది. ఆ సందర్భంగా విమ్స్‌కి 60కోట్లు కేటాయిస్తున్నట్లు 100 రోజుల్లో విమ్స్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత ఆరోగ్యశాఖా మంత్రి కామనేని శ్రీనివాసరావు పలుమార్లు విశాఖ వచ్చి విమ్స్ ప్రారంభానికి యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గడిచిన 14నెలల్లో వీరి వాగ్ధానాలన్నీ వాగ్ధానభంగమయ్యాయి. ఆచరణలో విమ్స్ ప్రారంభంయెడల గత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన వివక్షత, నిర్లక్ష్యాన్నే నేటి తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ ధోరణి విడనాడాలని సిపిఐ(ఎం) పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది.
డిమాండ్స్ :
1. విమ్స్‌లో తక్షణమే ‘ఓపి’ ని ప్రారంభించాలి.
2. విమ్స్‌కి అవసరమైన 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి.
3. విమ్స్‌ను ప్రభుత్వ-ప్రైవేట్-భాగస్వామ్యం పేర బడాకార్పొరేట్ సంస్థలకి ధారాధత్తం చేసే చర్యలు విరమించాలి.
4. విమ్స్‌లోని రెండుబ్లాకులను టాటా కేన్సర్ ఇనిస్ట్యూట్‌కి ఇవ్వాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేయాలి.
5. విమ్స్‌ను ప్రారంభానికి డాక్టర్లు, సిబ్బందిని వెంటనే రిక్రూట్ చేయాలి.