విమానాశ్రయాలు నిర్మిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందా?

విమానాశ్రయాలు నిర్మిస్తేనే దేశం, రాష్ట్రం వేగంగా అభివృది ్ధచెందుతుందని కేంద్రంలోని నరేంద్ర మోడీ, రాష్ట్రంలోని చంద్రబాబు నోట తరచూ వినిపిస్తున్నది. ఇది వాస్త వమా..? ఇదే నిజమైతే ఇప్పటికే మన దేశంలో 448 విమానాశ్రయాలున్నాయి. దేశం ఎంత అభివృద్ధి చెంది ఉండాలి? ప్రజల జీవన ప్రమాణం ఎంత మెరుగుపడి ఉండాలి? అసలు విమానాశ్రయాలు నిర్మిస్తే దేశం అభివృద్ధి చెందినట్లా..? లేక విమానాల్లో ప్రయాణించ గలిగే ఆర్థిక స్తోమత ప్రజలకు కలిగిస్తే దేశం అభివృద్ధిచెందినట్లా..? అన్నది పాలకులు ఆలోచించాలి. ఇటీవల కేంద్ర పౌర విమాన యాన శాఖ వెలువరించిన నివేదికను పరిశీలి స్తే.. ప్రభుత్వ అధిపతులు విమానాశ్రయాల నిర్మాణ కోసం నిర్వహిస్తున్న ప్రచారంలోని డొల్లతనం ఇట్టే అర్థమవుతుంది.
దేశంలో ప్రస్తుతం 448 విమానాశ్రయాలున్నాయి. వీటిలో మిలిటరీ సర్వీసుల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నవి 136, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోవి 156, ప్రైవేటు వ్యక్తులు, సంస్థల ఆధ్వర్యంలోవి 66 ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయమేమంటే దేశంలో విమాన ప్రయాణికుల్లో 94 శాతం మంది కేవలం 24 విమానాశ్రయాల ద్వారానే ప్రయాణం సాగిస్తున్నారు. అంటే మిగిలిన 424 విమానాశ్రయాల ద్వారా ప్రయాణాలు సాగిస్తున్నవారు 6 శాతం మాత్రమే. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే పూర్తిస్థాయిలో నిర్మించిన విమానా శ్రయాల్లో సుమారు 424 విమానాశ్రయాలు నిరుపయోగంగా ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలు తెలియజేస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం 2020 నాటికి కొత్తగా మరో 500 విమానాశ్రయాలు నిర్మిస్తామని ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు ఇప్పటికే నిర్మాణం పూర్తయిన విమానాశ్రయాల్లో ఒక్క సర్వీసు కూడా నడపని, ఒక్క ప్రయాణికుడు కూడా ప్రయాణించని విమానాశ్రయాలు దేశంలో తొమ్మిది ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసినది రాజస్థాన్‌లోని జైసల్మేర్‌. ఈ విమానాశ్రయం ప్రపంచస్థాయి హంగులతో రూ.200 కోట్ల ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. పర్యాటక రంగం అభివృద్ధి చెందిన రాజస్థాన్‌ రాష్ట్రంలోని విమానాశ్రయాల పరిస్థితే ఇలా ఉంటే అత్యంత వెనుకబడిన విజయనగరం జిల్లా బోగాపురంలో నిర్మించనున్న విమానాశ్రయం పరిస్థితి ఇంతకంటే మెరుగ్గా ఉంటుందని ప్రభత్వాధిపతులు చెప్పగలరా..?
విమానాశ్రయాల నిర్మాణం విషయంలో మోడీ, చంద్రబాబులకు ప్రత్యేక అజెండా ఉంది. బీహార్‌ ఎన్నికల్లో గెలుపు కోసం విమానాశ్రయాల నిర్మాణ అంశాన్ని బిజెపి ముందుకు తెస్తున్నది. ఇప్పటికే బీహార్‌లోని 13 విమానాశ్రయాల్లో సర్వీసులు అంతంతమాత్రంగానే నడుస్తూ నష్టాల్లో ఉన్నాయి. అయినప్పటికీ ఎన్నికల్లో గెలుపు కోసం బీహార్‌లో రూ.2,700 కోట్ల ఖర్చుతో నాలుగు విమానాశ్రయాలు నిర్మిస్తామని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. అంటే అక్కడి ప్రజల అవసరాల కోసం కాకుండా ఎన్నికల్లో లబ్ధి కోసమే విమానాశ్రయాలు నిర్మించడం, ప్రజాధనం దుర్వినియోగం చేయడం కాదా? ఇది పచ్చి అవకాశం కాదా? అత్యంత వెనుకబడిన బీహార్‌లో ఈ డబ్బును సాగునీటి రంగంపై ఖర్చు చేస్తే రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నప్పటికీ పాలకుల చెవికెక్కడంలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో విమానయానరంగం పరిస్థితి కూడా తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఏడు విమానాశ్రయా లున్నాయి. కడప, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, నాగార్జునసాగర్‌ ఎయిర్‌పోర్టు, సత్యసాయి ఎయిర్‌పోర్టు. వీటిలో ఏ విమానాశ్రయం నుంచి కూడా పూర్తిస్థాయిలో విమాన సర్వీసులు నడపడంలేదు. దీనికి కారణం పూర్తిస్థాయి ప్రయాణికులు లేకపోవడమే. ఇప్పటికే నడుపుతున్న విమాన సర్వీసుల్లో 50 శాతం లోపు ఆక్యుపెన్సీ మాత్రమే ఉంది. ఈ విషయాన్ని స్వయంగా స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ సంజీవ్‌కపూర్‌ ప్రకటించారు. దేశంలో ప్రస్తుతం ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌, స్పైస్‌జెట్‌, ఇండిగో, జెట్‌ ఎయిర్‌వేస్‌, కింగ్‌ఫిషర్‌ వంటి సంస్థలు విమాన సర్వీసులు నడుపుతున్నాయి. విమానాల్లో ప్రయాణి కులు లేక అనేక సర్వీసులను రద్దు చేస్తున్నారు. ఇటీవల పర్యాటక కేంద్రమైన మైసూర్‌ నగరానికి కూడా సర్వీసులను నిలుపుదల చేశారు. దాదాపు అన్ని విమాన సంస్థలూ నష్టాల్లో ఉన్నట్లు ఆ సంస్థలు ప్రకటించాయి. ఉదాహరణకు విశాఖ పట్నం నుంచి హైదరాబాద్‌కు సాధారణ ఛార్జి పది రోజుల ముందు టిక్కెట్‌ కొంటే ఒక మనిషికి రూ.2,200. అదే టిక్కెట్‌ను ప్రయాణం చేసేరోజు కొంటే రూ.7,500. ఇంకా ఈ సంస్థల్లో పనిచేసే కార్మికులకు జీతాలు కూడా సక్రమంగా చెల్లించడంలేదు.
వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే చంద్రబాబు విజయనగరం జిల్లాలో బోగాపురం విమానాశ్రయం నిర్మించడానికి అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తున్నారు? ఇందులో రహస్యం ఏమిటంటే రాష్ట్రం విడిపోయిన తరువాత చంద్రబాబు, ఆయన అనుయాయులు విశాఖపట్టణాన్ని వ్యాపార కేంద్రంగా మార్చుకొని లాభాలు పొందాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ విమానాశ్రయం ప్రచారంతో లక్షల రూపాయల విలువచేసే భూమి కోట్ల రూపాయలకు చేరింది. ఇప్పటికే సామాన్యుల నుంచి అధికార పార్టీ నాయకులు వేలాది ఎకరాలు కొనుగోలుచేశారు. సన్‌రే, మిరాకిల్‌, అవంతి వంటి సంస్థలను, విహార కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. విమానాశ్రయం కోసం భూమి ఇవ్వాలని మాట మాత్రంగానైనా వీరికి చెప్పకుండా సామాన్యుల భూములు బలవంతంగా లాక్కోవడం ఎంత వరకు సమంజసం? అసలు బోగాపురంలో విమానాశ్రయం నిర్మించకుండానే ఇప్పటికే ఉన్న విశాఖపట్నం విమానాశ్రయాన్ని అభివృద్ధిచేస్తే వచ్చే 50 ఏళ్ల పాటు విమాన ప్రయాణికుల తాకిడిని తట్టుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నా ఎందుకు చంద్రబాబు చెవికెక్కడంలేదు?
ఎర్రబస్సే రాని తమ గ్రామాలకు ఎయిర్‌బస్సు ఎందుకని సామాన్యుడు వేసే ప్రశ్నకు చంద్రబాబు దగ్గర సమాధానమే లేదు. నిజంగా అభివృద్ధి కోసమే విమానాశ్రయం అంటున్న చంద్రబాబు అవసరం లేకపోయినా 15 వేల ఎకరాల భూమిని ఎందుకు సేకరించదలిచారు? ప్రజల ఆగ్రహం వెల్లడైన తరువాత 5,311 ఎకరాల భూమిని మాత్రమే సేకరించడానికి నోటిఫికేషన్‌ ఎందుకు మార్చారు? అంటే అదనంగా సేకరించదలచిన 10 వేల ఎకరాలతో తన అనుయాయుల ద్వారా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేయడానికి కాదా? తమ పార్టీకి చెందినవారి భూములను తప్పిస్తూ మూడుసార్లు ఎయిర్‌పోర్టు ప్లాను ఎందుకు మార్చినట్లు? అంటే బోగాపురం విమానాశ్రయం ద్వారా చంద్రబాబు తన రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు పొందడానికే ప్రయత్నిస్తున్నారా అన్నది ప్రజల మదిలో మెదలాడుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు చంద్రబాబు ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పాల్సిందే. దేశం అభివృద్ధి చెందాలంటే విమానాశ్రయాలు నిర్మించడం కాదు.. విమానాల్లో ప్రయాణించగలిగే ఆర్థిక స్థోమత ప్రజలకు కలిగే విధంగా పాలకులు చిత్తశుద్ధితో విధానాలు రూపొందించి అమలుచేయాలి.
- బొత్స వెంకటరమణ
(వ్యాసకర్త సిపిఎం విజయనగరం జిల్లా కమిటీ సభ్యులు)