విధ్వంసకర అభివృద్ధి

 విధ్వంసకర అభివృద్ధికి తాము వ్యతిరేకమని మానవ హక్కుల వేదిక 5వ జిల్లా మహా సభలో వక్తలు స్పష్టంచేశారు. నగరంలోని సిరిపురం కూడలిలోని బిల్డర్సు అసోసియేషన్‌ సభా వేదికలో ఆదివారం జిల్లా అధ్యక్షులు ఎం.శరత్‌ అధ్య్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్‌ మాట్లాడుతూ పదేళ్లుగా తమ సంఘం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన, మానవ హక్కుల పరిరక్షణకు పోరాటం చేస్తుందని చెప్పారు. ప్రాజెక్టులను, పరిశ్రమలను వ్యతిరేకిస్తామని తమ మీద నింద ఉందని, తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, విధ్వంసకర అభివృద్ధిని మాత్రమే అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పిసిపిఐఆర్‌ పేరుతో ఏర్పరచబోయే కోస్టల్‌ కారిడార్‌తో ప్రజల జీవనాధారం, పర్యావరణం దెబ్బతింటాయని, పోలాకిలో నిర్మించతలపెట్టిన విద్యుత్‌ ప్రాజెక్టు, కొవ్వాడ అణు విద్యుత్‌ ప్రాజెక్టుల వల్ల నష్టాలే ఎక్కువగా ఉంటాయని, వీటిపై తాము పోరాటం చేస్తామని చెప్పారు. హెచ్‌ఆర్‌ఎఫ్‌ ఉభయ రాష్ట్రాల ఉపాధ్యక్షులు ఎం.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ, 'అసమాన అభివృద్ధి-రాయలసీమ, ఉత్తరాంధ్ర దుస్థితి' అనే అంశంపై మాట్లాడారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఎవరైనా అభివృద్ధి చేస్తారు కానీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అందుకు భిన్నంగా పోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ సంపదతో అమరావతి నిర్మించడం విచారకరమన్నారు. 
'కార్పొరేట్‌ రాజధానా-ప్రజారాజధానా'' అనే అంశంపై మాజీ ఐఎఎస్‌ అధికారి ఇఎఎస్‌ శర్మ మాట్లాడారు. రాష్ట్ర పునర్వవ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాజధాని నిర్మాణంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంఘాలను, అన్ని పార్టీల ప్రతినిధులను కలుపుకుని ఒక కమిటీ వేసి, దాని నివేదిక ప్రకారం రాజధాని నిర్మించాలని, అయితే అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి తన సొంత నిర్ణయంతో పోతున్నారని విమర్శించారు. భవిష్యత్తులో ఆహార ఉత్పత్తుల కొరతకు ముఖ్యమ్నంతే పరోక్షంగా కారణమవుతున్నారన్నారు. రైతులు, రైతులపై ఆధారపడి బతికే ప్రజల నోటిలో మట్టి కొట్టి కార్పొరేట్‌ రాజధానిని నిర్మిస్తున్నారని విమర్శించారు. భోగాపురంలో ప్రజలు బస్టాండు ఏర్పాటుచేయాలని కోరుతుంటే దానికి దిక్కులేదు కాని, అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు పూనుకుంటున్నారని, దీని వల్ల అక్కడి రైతులు నిర్వాసితులవుతున్నారని పేర్కొన్నారు. భూమి, ఇసుక, ఇతర వనరులు కొల్లగొట్టే మాఫియాలు, చివరికి పేదల పథకాలను కూడా బినామి పేర్లతో పెద్దలు దిగమింగే మాఫియాలు రాజ్యమేలుతున్నాయని, వీటిపై పోరాటాలకు ప్రజలు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలలో ప్రజలు, ప్రజా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.