విద్యుత్ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సీపీఎం తప్పుబట్టింది. ప్రజలపై భారాలు మోపడం సరికాదని పేర్కొంది. ఈ ఛార్జీల పెంపును సీపీఎం, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా చేపట్టింది. ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమని, పెద్ద పెద్ద కంపెనీలపై పన్నులు వేసి డబ్బులు వసూలు చేస్తే ఛార్జీలు పెంచాల్సినవసరం లేదన్నారు. నాలుగు శాతం అనేది చాలా ఎక్కువని, ఛార్జీలు పెరగడం వల్ల ప్రతి వస్తువు ధర కూడా పెరుగుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి మిగులు విద్యుత్ ఉండడమే కాకుండా 24గంటల విద్యుత్ సరఫరా చేయవచ్చన్నారు. దాదాపు 1650 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని, ప్రతి సంవత్సరం ప్రజాభిప్రేయ సేకరణ జరపడం..ఛార్జీలు పెంచడం సర్వసాధారణమైందన్నారు. వెంటనే ఛార్జీల పెంపు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.