విద్యుత్‌ ఛార్జీలు పెంచితే ఆందోళన ఉధృతం

       విద్యుత్‌ ఛార్జీలు పెంచితే ఆందోళన ఉధృతం చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు హెచ్చరించారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యాన కార్యకర్తలు, ప్రజలు గురువారం ఇపిడిసిఎల్‌ కార్యాలయం ధర్నా నిర్వహించారు. దీనికిముందు ద్వారకానగర్‌ కూడలి నుంచి ఎపిఇపిడిసిఎల్‌ కార్యాలయం వరకూ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తలకు రాయితీలిస్తూ వినియోగదారులపై ఛార్జీల మోపి నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ఆరిలోవ కొండవాలు ప్రాంతంలోని బిఎన్‌ఆర్‌ నగర్‌లో 400 ఇళ్లకు విద్యుత్‌ సరఫరా లేదన్నారు. చాలాసార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోతుందన్నారు. వెంటనే ఆ ప్రాంతానికి విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. 
సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణపై ముందు నుంచి విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉన్నా అధికారులు ఆ దిశగా ప్రయత్నించడంలేదన్నారు. ముఖ్యంగా ప్రజాభిప్రాయసేకరణ పెద్ద మైదానంలో ఏర్పాటు చేయాలే తప్పా కార్యాలయాల్లో చాటుమాటున చేస్తే ప్రజలకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఆ పార్టీ నగర కార్యదర్శి గంగారావు మాట్లాడుతూ, సున్నా నుంచి 50 యూనిట్ల వరకూ ఒకే కేటగిరిగా పరిగణిస్తున్నారనీ, అలా కాకుండా సున్నా నుంచి 100 యూనిట్ల వరకూ ఒకే కేటగిరిగా పరిగణించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా విద్యుత్‌ బిల్లులు ఇచ్చే సిబ్బంది వచ్చేటప్పుడు వినియోగదారులు ఇంటి వద్ద లేకపోతే డోర్‌లాక్‌ అని చెప్పి వెళ్లిపోతున్నారన్నారు. దీనివల్ల వినియోగదారునికి వాస్తవ ఛార్జీల కంటే అదనంగా రూ.75 అపరాద రుసుం చెల్లించాల్సి వస్తుందన్నారు. ఈ అపరాద రుసుం రూ.25కు తగ్గించాలని కోరారు. అనంతరం కార్యాలయంలోకి వెళ్లి ఎపిఇపిడిసిఎల్‌ సిఎండి ముత్యాలరాజు, చైర్మన్‌ భవానీప్రసాద్‌లకు వినతి పత్రం అందించారు. వినతిపత్రాన్ని పరిశీలించిన అధికారులు బిఎన్‌ఆర్‌ నగర్‌కు విద్యుత్‌ సరఫరా చేసేందుకు అంగీకరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్‌.రమేష్‌, ఆర్‌కెఎస్‌వి. కుమార్‌, బి.వెంకటరావు, మణి, బొట్టా ఈశ్వరమ్మ, మాధవి, డి. పద్మ, సూర్యమణి తదితరులు పాల్గొన్నారు.