విద్యా వ్యతిరేక విధానాలను ఎదిరించేందుకే బంద్‌..

ప్రైవేట్‌ యూనివర్శిటీల బిల్లును వ్యతిరేకిస్తూ, డిగ్రీలో సెమిస్టర్‌ విధానాన్నీ రద్దు చేయాలని, సంక్షేమ హాస్టళ్ళను మూసివేసే జీవో నెంబర్‌ 45ను రద్దు చేయాలని, విద్యా హక్కు చట్టాన్ని పటి ష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు సంఘా ల ఆధర్యంలో ఏర్పడిన విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7 తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల బంద్‌ నిర్వహిస్తున్నాం. విలీనం పేరుతో 20 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న పాఠశాలలు మూసివేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీని ద్వారా ఐదు వేలకు పైగా పాఠశాలలు మూత పడుతున్నాయి.
30 మంది విద్యార్థులున్న పాఠశాలలు మూసివేస్తే 12 వేల పాఠశాలలు మూతబ డతాయి. రాష్ట్రంలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో వేల రూపాయల ఫీజుల దోపిడీ జరుగుతున్నది. ఎక్కడా ప్రభుత్వ నిబంధనలు అమలు కావడం లేదు. విద్యా హక్కు చట్టం నిర్వీర్యం అవుతోంది. రాష్ట్రంలో పేరుమోసిన నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థల బ్రాంచీలే గుర్తింపు లేకుండా నడుస్తున్నాయి. కనీస సౌకర్యాలు కూడా ఉండవు. ఎయిడెడ్‌ పాఠశాలల్లో 2,347 పాఠశాలల్లో మూడు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. సుమారు 16 వేల పోస్టులు ఉండగా ఎనిమిది వేల మంది మాత్రమే అధ్యాపకులు ఉన్నారు. పోస్టుల భర్తీకి ఆటంకంగా ఉన్న జీవో నెంబర్‌ 35ను రద్దు చేయాలి. 50 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న హాస్టళ్ళను మూసివేసి సమీపంలో ఉన్న గురుకుల పాఠశాలల్లో చేర్పించడానికి సిద్ధం అవుతున్నారు. గత సంవత్సరం దాదాపు 1,200 హాస్టళ్ళను మూసివేశారు. ఈ సంవత్సరం 199 హాస్టళ్ళను మూసివేశారు. 
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. 2014-15 విద్యా సంవత్సరంలో ఆరు లక్షల మంది విద్యార్థులకు రూ.2,445 కోట్లు అవసరం. కానీ బడ్జెట్‌లో కేవలం రూ.799 కోట్లు మాత్రమే కేటాయించారు. 2015-16 విద్యా సంవత్సరానికి ఫ్రెషర్‌, రెన్యూవల్‌ విద్యార్థులకు కలిపి రూ.4.090 కోట్ల నిధులు అవసరం. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ధరఖాస్తుదారులను తగ్గించడానికి తల్లిదండ్రుల ఆధార్‌ను లింక్‌ చేయడం. వరుసగా ఏడు సంవత్సరాలు ఒకే ప్రాంతంలో చదివిన విద్యార్థులకు మాత్రమే ఫీజులు చెల్లిస్తామని ఆంక్షలు పెట్టారు. విద్యార్థులకు ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌లు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో 12 ప్రభుత్వ యూనివర్శిటీలు ఉన్నాయి. అందులో 1,164 ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయాలని పదే పదే యుజిసి హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. 
కారణంగా రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్శిటీలకు యుజిసి ద్వారా రావాల్సిన రూ.8,360.23 లక్షల నిధులు విడుదల చేయకుండా ఆపివేశారు. ప్రైవేట్‌ యూనివ ర్శిటీలను తీసుకురావడానికి ప్రభుత్వం బిల్లును సిద్ధం చేసింది. రాబోయో అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆరు ప్రైవేట్‌ యూనివ ర్శిటీలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసు కున్నాయి. వాటికి గుంటూరు జిల్లా సిఆర్‌డిఎ పరిధిలో 50 ఎకరాల భూమిని ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. 
కుప్పం ద్రావిడ యూనివర్శిటీలో యూనివర్శిటీ చెందిన 50 ఏకరాలను ఒక ప్రైవేట్‌ మెడికల్‌ యూనివర్శిటీకి ఇవ్వడానికి పథకాలు సిద్ధం చేశారు. ప్రభుత్వ వర్శిటీలను దివాళా తీయించి ప్రైవేట్‌ వర్శిటీల వ్యాపారానికి ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నది.
మెడిసిన్‌ బి కేటగిరీ సీట్లను యథావిధిగా కొనసాగించాలి. ఎన్‌ఆర్‌ఐ సీట్లు బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు. కానీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మెడికల్‌ సీట్ల భర్తీలో జరిగిన అక్రమాలపై విచారణ నిర్వహించి మెరిట్‌ సాధించిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాము.
రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ప్రపంచీకరణ విధానాల పల్లకి మోస్తున్నది. ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ విద్యార్థి లోకం ఈ నెల 7వ తేదీన తలపెట్టిన విద్యాసంస్ధల బంద్‌లో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాము.
- ఎస్‌ నూర్‌మహమ్మద్‌ 
(వ్యాసకర్త ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి)