విద్యాహక్కుచట్టం అమల్లో ప్రభుత్వాలు విఫలం

కేంద్ర ప్రభుత్వం 2012లో జారీ చేసిన విద్యాహక్కు చట్టం అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ అన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా విద్యా హక్కుచట్టానికి ఎటువంటి నిధులూ కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. స్టూడెంట్‌, టీచర్‌ నిష్పత్తి ప్రకారం స్కూల్‌లను మూసివేస్తున్నారని, ఇప్పటికే 400 స్కూళ్లను మూసివేశారని విమర్శించారు. అభివృద్ధి చెందాల్సిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూసివేసిన ప్రాథమిక పాఠశాలలను తెరవాల్సినవసరం ఉందన్నారు. సర్వశిక్షా అభియాన్‌ కింద బడ్జెట్‌లో కేటాయింపులు కుదించిందనీ, ఈ మేరకు ఈ పథకం కింద బడ్జెట్‌లో నిధులను పెంచాలని డిమాండ్‌ చేశారు. ఏటా ప్రాథమిక విద్యకు కేటాయించాల్సిన నిధులను దుర్వినియోగం చేస్తూ ఇతరాత్ర పరిశ్రమలకు జమ చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం విద్యా హక్కుచట్టానికి నిధులు కేటాయించాలని నిబంధనలున్నాయన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత విద్యా హక్కు చట్టం ఎటువంటి ప్రగతీ సాధించలేదన్నారు. విద్యార్ధులంతా ప్రభుత్వ పాఠశాలలను వదిలి ప్రయివేటు పాఠశాలలకు వెళ్తున్నారని చెప్పడం కుంటెషాకు మాత్రమే అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న ఉచిత మధ్యాహ్న భోజనం, యూనిఫారమ్‌, ఉచిత పుస్తకాలను వదిలి ప్రయివేటు పాఠశాలలకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. జాతీయ ఆర్టీఈ ఫోరం గత ఐదేళ్లుగా విద్యా హక్కు చట్టంలోని అంశాలను పటిష్టంగా అమలు జరుపేందుకు కృషి చేస్తుందన్నారు. ఇందులోభాగంగా ఎపి ఆర్టీఈ ఫోరం అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలుకు నిధులను బడ్జెట్‌లో కేటాయించాలని మెమొరాండంను విడుదల చేశారు. ఇందులో పొందుపరచిన అంశాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని కోరారు. ముఖ్యంగా రాబోయే బడ్జెట్‌లో పదిశాతం ప్రాథమిక విద్యకు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రయివేటు ఫీజులను నియంత్రించే విధంగా కమిటీని పటిష్టం చేయాలన్నారు. విద్యారంగంలో ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఇంకా వెనుకబడిపోతామని గుర్తుచేశారు.