విద్యార్థుల బలి..

కార్పొరేట్‌ విద్యా సంస్థల ఉక్కుపాదాల కింద విద్యా కుసుమాలు నలిగిపోతున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తుండగా అటువంటి ఉదంతాలు ఇటీవల వరుసగా జరగడం పెను విషాదం. సోమవారం కడప సమీపంలో నారాయణ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థినులు నందిని, మనీషా బలయ్యారు. అంతలోనే గురువారం నెల్లూరు జిల్లా గూడూరులో డిఆర్‌డబ్ల్యు కాలేజీలో బిఎస్‌సి విద్యార్థిని రవళి ప్రాణాలు తీసుకుంది. తమ పిల్లల భవిష్యత్తుపై గంపెడాశతో వేలకు వేలు పోసి ప్రైవేటు కాలేజీల్లో చేర్పిస్తున్న తల్లిదండ్రులకు గర్భశోకం మిగలడం పాషాణ హృదయాలను సైతం కలచివేస్తుంది. కాగా కార్పొరేట్‌ విద్యా సంస్థలు తమ పేరు ప్రతిష్టల కోసం అభం శుభం ఎరుగని పిల్లలను బలికోరుతున్నా ప్రభుత్వం చోద్యం చూడటం బాధ్యతారాహిత్యం. కడపలో ఇద్దరు విద్యార్థినులు కాలేజీ హాస్టల్‌లో ఒకే గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది కుటుంబ వివాదాల వల్లనో, ఆర్థిక సమస్యల కారణంగానో కాదు. ప్రైమరీ పరీక్షల్లో తక్కువ మార్కులొస్తాయన్న భయంతో. ఇంటర్‌లో చేరిన మూడు నెలల్లోపే మార్కుల కోసం విద్యార్థినులు ఉరేసుకున్నారంటే కాలేజీ యాజమాన్యం ఎంతగా వారిని ఒత్తిడికి గురి చేసిందో ఆకళింపు చేసుకోడానికి పెద్దగా పరిశోధనలు, విచారణలు అవసరం లేదు. టెన్త్‌లో 80 మార్కులు తెచ్చుకున్న మెరిట్‌ విద్యార్థినులే యాజమాన్యం కాఠిన్యానికి తట్టుకోలేకపోతే ఇక సాదాసీదాగా చదివే వారి పరిస్థితి ఏంటో ఊహించవచ్చు. విద్యార్థినుల ఆత్మహత్యలు దారుణం కాగా తప్పించుకునేందుకు యాజమాన్య చేష్టలు మరింత హేయమైనవి. ఆత్మహత్యల సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలపడం దగ్గర నుంచి పోస్టుమార్టం వరకు ప్రతి విషయంలోనూ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్రేమలేఖలు సృష్టించడం మరీ దారుణం. ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాల నుంచి ఆందోళనలు, నిరసనలు మిన్నంటే వరకూ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. విద్యార్థులు, బాధితులు రోడ్డెక్కాకనే త్రిసభ్య కమిటీ విచారణకు ఆదేశించింది.
దేశంలో సంస్కరణలు మొదలయ్యాక క్రమంగా విద్య ప్రైవేటీకరించబడుతోంది. ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్య ఒక మోస్తరు వ్యాపారం నుంచి మాఫియా స్థాయికి ఎదిగింది. దానాల్లోకెల్ల విద్యాదానం గొప్పదనే సూక్తి కాస్తా పెట్టుబడుల్లో కెల్లా విద్యారంగ పెట్లుబడి లాభదాయకం అన్న స్థితికి మారింది. అందులోనూ ఇంటర్‌ విద్య ప్రైవేటుకు మాంచి లాభాలు కురిపిస్తోంది. ఎపిలో ఉన్న జూనియర్‌ కాలేజీల్లో 444 ప్రభుత్వ, 131 ఎయిడెడ్‌ కాగా 2,009 ప్రైవేటువి. వాటిలోనూ నారాయణ, శ్రీచైతన్య గ్రూపువే అత్యధికం. ప్రైవేటు ఎలా వేళ్లూనుకుందో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుంది. ప్రభుత్వాలు ఎత్తుకున్న ప్రైవేటీకరణ విధానాల ఫలితమే ఈ ఉత్పాతం. హద్దూ అదుపూ లేని ప్రైవేటు మాఫియా ఊరుకుంటుందా? ఇంటర్‌ బోర్డును తన చెప్పుచేతల్లో పెట్టుకొని ఆడిస్తోంది. ప్రభుత్వాలను తన అదుపాజ్ఞల్లో పెట్టుకుంటోంది. అఫిలియేషన్‌ మొదలుకొని అడ్మిషన్లు, పరీక్షల నిర్వహణ అన్నింటిలోనూ అవకతవకలే. ర్యాంకుల కోసం తొక్కే అడ్డదార్లు ఎన్నెన్నో! జూనియర్‌ కాలేజీ ఏర్పాటు చేయాలంటే 8 వేల చదరపు అడుగుల భవనం, రెండెకరాల ఆటస్థలం, అగ్నిమాపక పరికరాలు, పారిశుధ్యం, ల్యాబ్‌ల వంటి కనీస సౌకర్యాలుండాలి. ఈ నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కుతున్నాయి కార్పొరేట్లు. ఫీజుల గుంజుడు గురించి చెప్పనే అక్కర్లేదు. ఫస్ట్‌ ఇంటర్‌ డేస్కాలర్‌కు బోర్డు నిర్ణయించిన ఫీజు రూ.1,760. హాస్టల్‌, ఎంసెట్‌, ఐఐటి అమాంబాపతు కలిపి వేలు, లక్షల్లో పిండుకుంటున్నా అడిగే నాథుడు లేడు.
ప్రభుత్వంతో కార్పొరేట్‌ చెట్టపట్టాలేసుకున్నాక కార్పొరేట్‌ అకృత్యాలపై ప్రజలకు న్యాయం జరుగుతుందనుకోవడం అత్యాశే అవుతుంది. గతంలో ప్రభుత్వాలకు నిధులివ్వడం వరకే పరిమితమైన కార్పొరేట్లు ప్రస్తుతం ప్రభుత్వంలో నేరుగా భాగస్వామ్యం అయ్యేంత ఎత్తుకు ఎదిగాయి. కార్పొరేట్‌ దిగ్గజం నారాయణ సంస్థల అధినేత నారాయణ తెలుగుదేశం ప్రభుత్వంలో కీలక మంత్రి అయ్యాక ఆయన సంస్థల్లో అక్రమాలను సర్కారు అడ్డుకోగలుగుతుందా? పధ్నాలుగు మాసాల్లో కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో విద్యార్థుల మరణాలు పెరగ్గా, ఒక్క నారాయణ విద్యాసంస్థల్లోనే పదకొండు మంది చనిపోయారు. వీరిలోనూ అమ్మాయిలు తొమ్మిది మంది. వరుసగా ఒకే గ్రూపునకు చెందిన కాలేజీల్లో విద్యార్థుల అనుమానాస్పద మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వం చేతులు కట్టుకుంది ఎందుకో అర్థం చేసుకోలేనంత అవివేకులు కారు ప్రజలు. త్రిసభ్య కమిటీలు, ఇతరత్రా విచారణలు కంటి తుడుపు కోసమే. గతంలో 2002లో చంద్రబాబు సర్కారు హయాంలో వచ్చిన ప్రొఫెసర్‌ నీరజారెడ్డి కమిటీ సిఫారసులు అటకెక్కాయి. విద్యార్థినుల వరుస మరణాలతోనైనా ప్రభుత్వం కార్పొరేట్‌ అక్రమాలను అడ్డుకోవాలి. కడప ఉదంతంపై పారదర్శకంగా విచారణ జరిపి నిందితులను శిక్షించినప్పుడే ప్రభుత్వ చిత్తశుద్ధిపై ప్రజల్లో విశ్వాసం కలుగుతుంది.