
" భారతదేశ విద్యాచరిత్ర "
సమాజ అభివృద్ధిలో విద్య ముఖ్య భూమికను పోషిస్తుంది. భారతీయ సమాజంలో వచ్చిన మార్పుల ప్రభావం విద్యారంగం మీద ఎలా పడిందనే విశ్లేషణే 'భారత దేశ విద్యా చరిత్ర' (ప్రాచీన కాలం నుంచి నేటి వరకు). ఈస్టిండియా కంపెనీ భారతదేశానికి రాక ముందు భారత దేశ విద్యారంగ పరిస్థితుల మీద చేసిన విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది. గణిత శాస్త్ర అభివృద్ధిలో భాగంగా ప్రపంచానికి ''సున్నా''ని పరిచయం చేయడం, జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు బోధించే పద్ధతి, బౌద్ధ, ఇస్లాం పాఠశాలల్లో రెండంచెల విద్యావిధానం వంటి మంచి అంశాలు ఉన్నప్పటికీ సమాజంలో బహు కొద్ది మందికి మాత్రమే విద్య అందుబాటులో ఉండేది. ఈస్టిండియా కంపెనీ పాలన మొదలయ్యాక విద్యారంగంలో నూతన శకం ప్రారంభమైంది. స్వాతంత్య్రానికి ముందు భారత దేశంలో విద్యా వ్యాప్తిని మొదటి భాగంలోనూ, స్వాతంత్య్రం తరువాత 21వ శతాబ్దపు విద్యా పరిస్థితులను రెండవ భాగంలోనూ రచయిత ఈ పుస్తకంలో విశ్లేషించారు. ఈస్టిండియా కంపెనీ పరిపాలన కాలంలో ఇంగ్లీషు చదువులకు పునాది పడింది. క్రైస్తవ మిషనరీలు, కంపెనీ నడిపిన సెక్యులర్ పాఠశాలలు ఒక వైపున ,భారతీయ సంస్కృతిలో భాగమైన వీధి బడులు మరొకవైపు విద్యావ్యాప్తికి కృషి చేశాయి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఫలితంగా యూనివర్శిటీ విద్య ప్రారంభం జరిగింది.ఈ కాలంలోనే చదువుకున్న భారతీయ నూతనతరం చేసిన ప్రతిపాదనలను విద్యా వ్యాప్తికి వారు చేసిన కృషిని రచయిత చాలా చక్కగా విశ్లేషించారు. ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిషు ప్రభుత్వానికి పాలనా మార్పిడి జరిగిన తరువాత భారతదేశాన్ని ఒక మార్కెట్‌గా మార్చివేయడానికి విద్యారంగాన్ని ఎలా ఉపయోగించిన ''విభజించు పాలించు'' అనే దమన నీతిని విద్యారంగంలో చొప్పించిన విధానాన్నీ రచయిత చక్కగా వివరించారు. ఈ కాలంలో ఒక పక్కన ప్రాథమిక విద్య ప్రయివేటు రంగంలో వ్యాప్తి చెందడానికి అవకాశం కల్పిస్తూనే మరొక పక్కన ఎంపిక చేయబడిన కొంతమందికి మాత్రమే యూనివర్శిటీ విద్యను అందించిన ఫలితంగా దేశంలో సెకండరీ విద్యా విధానం ఎలా వెనుకబడిందీ గణాంకాలతో వివరించారు. ఇంగ్లీషు చదువుకున్న విద్యాధికులు భారత స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన క్రమం, బ్రిటిషు విద్యావిదానం మీద వారు చేసిన విమర్శలు ప్రజల రాజకీయ చైతన్య స్థాయిని పెంచడానికి విద్యారంగం ఎలా కేంద్రమయిందనే విశ్లేషణ ఈ భాగంలో మనం చూడవచ్చు.
స్వాతంత్య్రం తరువాత భారతదేశంలో జరిగిన విద్యావ్యాప్తిని నూతన విద్యావిధానానికి ముందు, తరువాత-అనే రెండు భాగాలుగా రచయిత విశ్లేషించారు. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే జాతీయోద్యమ కాలంలో రేకెత్తిన ఆకాంక్షలకు అనుగుణంగా రాధాకృష్ణన్ కమిషన్, మొదలి యార్ కమిషన్ చేసిన సూచనలను చక్కగా వివరించారు. ప్రభుత్వం పక్కన పెట్టిన ముఖ్య మైన అంశాలు యుజిసికి స్వయం ప్రతిపత్తి కల్పిం చకపోవడం, పారిశ్రామిక సెస్‌ని వేయకపోవడం లాంటి చర్యలు భారతీయ సమాజం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించిందీ రచయిత చక్కగా విశ్లేషించారు. కొఠారీ కమిషన్ సిఫార్సు లతో పాటు ప్రభుత్వరంగం ప్రభావం విద్యావ్యాప్తి మీద ఎలా పడిందనే వివరణ బాగుంది.
ప్రైవేటు రంగం- బహుళజాతీ సంస్థల మధ్య అనుబంధం నూతన విద్యావిధానానికి ఎలా నాంది పలికింది. అనే విశ్లేషణ ఈ పుస్తకంలోని ప్రత్యేకత. నూతన విద్యా విధానం ప్రవేశపెట్టిన తరువాత భారతీయ సమాజంలో వచ్చిన పెను మార్పులకు సంబంధించిన వివరణ తప్పక చదవవలసిందే. భారతదేశ ప్రత్యేకతలు అర్థం చేసుకుని సరైన విద్యావిధ్యానాన్ని రూపొందించడానికి అవసరమైన చారిత్రక నేపథ్యం విశ్లేషణ ఈ పుస్తకంలో పుష్కలంగా కనబడుతుంది. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, విద్యారంగ చరిత్రను తెలుసుకోగోరే వారికి... ఒక్క మాటలో చెప్పాలంటే... విద్యారంగం మీద ఆసక్తి వున్న వారందరికీ ఈ పుస్తకం చాలా ఉపయోగకరంగా వుంటుంది.
- ప్రొ|| ప్రతాప్ రెడ్డి
భారత దేశ విద్యా చరిత్ర
(ప్రాచీన కాలం నుంచి నేటి వరకు),
కె. కేశవరెడ్డి,
పేజీలు: 317/-, వెల: 200/-, ప్రతులకు: ప్రజాశక్తి బుక్ హౌస్, 27-1-54, కారల్ మార్క్స్ రోడ్, గవర్నర్‌పేట,
విజయవాడ. ఫోన్- 27660013.