విదేశీ బాబు :రాహుల్‌

 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీబాబు అయ్యారని, రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోవడం లేదని ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ విమర్శించారు. పేదల సమస్యలను పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు(ఒడిసి) నుంచి ప్రారంభమైన రాహుల్‌ రైతు భరోసా పాదయాత్ర కొండకమర్ల గ్రామం వద్ద ముగిసింది. 1979లో ఒడిసిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇందిరాగాంధీ పాల్గొన్న వేదిక వద్దనే బహిరంగ సభ నిర్వహించారు. ఆ ప్రాంతంలో రాహుల్‌ వేపమొక్కను నాటారు. గ్రామశివారులో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబ సభ్యులతో సమావేశ మయ్యారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. 47 మంది బాధితుల కుటుంబాలకు రూ.50వేలు చొప్పున చెక్కులను అందజేశారు. రైతులు, చేనేత కార్మికులు, పేదలకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులతో కలిసి దాదాపు 10 కిలోమీటర్లు రాహుల్‌గాంధీ పాదయాత్ర చేశారు. పలు చోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం బిజెపి తరహాలోనే పాలన కొనసాగిస్తోందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు విదేశీ పర్యటనలతో కాలం గడిపారని అన్నారు. రైతులు, చేనేత కార్మికుల, డ్వాక్రా మహిళా సంఘాల రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే మాట తప్పారన్నారు. ఏ ఒక్క రుణాలను సక్రమంగా మాఫీ చేయలేదన్నారు. మహిళా సంఘాలను రుణమాపీ పేరుతో సర్వనాశనం చేశారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరంపై అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు కేంద్రాన్ని గట్టిగా ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే చంద్రబాబునాయుడు, ఇటు జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు భయపడుతున్నారో తెలియడం లేదన్నారు. వీటి సాధన కోసం తమ శక్తివంచన లేకుండా పోరాడుతామనన్నారు. ఉపాధిహామీ చట్టం పనికి రాని పథకంలా ఉందని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం దారుణమన్నారు.