విజయవాడ కల్తీ మద్యం ఘటనపై హైకోర్టు న్యాయమూర్తితో జ్యూడిషియల్ విచారణ జరిపించాలని, ఘటనకు బాధ్యత వహించి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర తక్షణమే రాజీనామా చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు డిమాండ్ చేశారు. కల్తీ మద్యం ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో బందర్ రోడ్డులోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎక్సైజ్ మంత్రి రాజీనామా చేయాలని, ఎక్సైజ్ పాలసీని మార్చాలని, స్వర్ణా బార్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. మహిళలు ముఖానికి నల్లగుడ్డలు కట్టుకుని ప్రభుత్వ మద్యం పాలసీపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ కల్తీ మద్యం కారణంగా ఐదుగురు మృతి చెంది మరికొందరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన మొక్కుబడిగా ఉందన్నారు. సబ్ కలెక్టర్‌తో విచారణకు ఆదేశించి, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు నష్ట పరిహారం ఇచ్చి చేతులు దులుపుకునేలా ప్రభుత్వతీరు ఉందన్నారు.