విజయవాడలో ఉద్రిక్తత

విజయవాడ రాజీవ్‌నగర్‌ కరకట్ట ప్రాంతంలోని పేదల గుడిసెల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కార్యక్రమాన్ని బాధితులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఓ వృద్ధురాలు వంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. స్థానిక కార్పొరేటర్‌ పైడి తులసి తమను నట్టేట ముంచారని బాధితులు కంటతడిపెట్టారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న తమకు పునరావాసం కల్పించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు సిపిఎం నాయకులు మద్దతుగా నిలబడ్డారు. పేదల పక్షాన నిలబడి ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలదీశారు. దీంతో 200 మందికిపైగా ఉన్న పోలీసు బలగాలు మొహరించి అడ్డువచ్చిన సిపిఎం నేతలను, స్థానిక మహిళలను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేశారు. సిపిఎం నగర కమిటీ సభ్యులు పి.సాంబిరెడ్డి, బి రమణరావు, నాయకులు పి వెంకటరెడ్డి, సిహెచ్‌ శ్రీనివాస్‌ తదితరులను అరెస్టు చేసి ఆ ప్రాంతం నుండి వారిని తరలించారు. అనంతరం ఇళ్ల నుండి బయటకు రావల్సిందిగా మైకు ద్వారా చెప్పి జెసిబితో తీవ్ర ఉద్రిక్తత నడుమ సుమారు వెయ్యికిపైగా ఇళ్లను తొలగించారు. రాజీవ్‌నగర్‌ ఎడమ కట్ట నుండి వడ్డెర కాలనీ కట్టపై ఇళ్లను సైతం కూల్చివేశారు. కూల్చివేసిన ఇళ్లకు ఎన్యుమరేషన్‌ జరపలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పేర్లు నమోదు కాలేదని బాధితులు వేడుకున్నారు. 
బాధితులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పరామ ర్శించారు. కనీస సమాచారం లేకుండా ఇళ్లు కూల్చేయటం దుర్మార్గమన్నారు. రాజీవ్‌నగర్‌ కరకట్ట ప్రాంతంలో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్యుమరేషన్‌ జరుపకుండా వడ్డెర కాలనీలో ఇళ్లు కూల్చటం అమానుషమన్నారు. కట్టుబట్టలతో పేదలను రోడ్డుపై తోసిన ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పటం తధ్యమన్నారు. వందలాది మంది కుటుంబాలు ఇళ్లు ఇవ్వకుండా కూల్చివేస్తుంటే ప్రజా ప్రతినిధులు ఏమయ్యారని ప్రశ్నించారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని టిడిపి ప్రభుత్వం విజయవాడ నగరంలో నివసిస్తున్న పేదలను నగరానికి దూరంగా గెంటేసే ప్రయత్నం చేస్తోందన్నారు. బాధి తులకు తక్షణం ప్రత్యామ్నాయం చూపించాలని, ఎన్యుమరేషన్‌ జరిపి అందరికీ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.