వికృత రూపాల్లో మతవాద దాడి..

శుక్రవారం నాడు బిజెపి కేంద్ర మంత్రులు చాలా అట్టహాసంగా నెహ్రూ మ్యూజియం లైబ్రరీలో విజయోత్సవం జరుపుకొన్నారు. అంతకు ముందు దానికి డైరెక్టరుగా ఉన్న మహేష్‌ రంగరాజన్‌ను వదిలించుకున్న సంతోషమది. ఆ ఊపులో మాజీ జనసంఘం అధ్యక్షుడైన దీన దయాళ్‌ ఉపాధ్యాయ శతజయంతి వేడుకలు ప్రకటించడమే గాక ఆయన సిద్ధాంతంగా చలామణిలో ఉన్న సమగ్ర మానవతావాదం(ఇంటిగ్రల్‌ హ్యూమనిజం)పై పరిశోధన జరగాలని ప్రకటించారు. సరిగ్గా అదే రోజున వెంకయ్య నాయుడు హైదరాబాదులో దీనదయాళ్‌పై ఒక పుస్తకం విడుదల చేస్తూ కమ్యూనిజం విఫల మైందని, దేశంలో ఆ సిద్ధాంతాన్ని అనుసరించే పార్టీలకు స్థానం లేకుండా పోయిందని ప్రకటించారు. ''బెంగాల్‌ కంచుకోట బద్దలై పోయింది. కేరళ కోట బీటలు వారింది. ఆంధ్రా లో పుచ్చలపల్లి సుందరయ్య, మోటూరు హనుమంతరావు వంటి దిగ్గజాలు ఉండేవారు. అక్కడా గుర్తింపు లేకుండా పోయింది. అసెంబ్లీలో సీట్లే లేకుండా పోయింది' అని మహానందపడిపోయారు. రిజర్వేషన్లపై చర్చ జరగాలని ఆరెస్సెస్‌ అధినేత ఇచ్చిన పిలుపూ వివిధ విద్యా పరిశోధనా సంస్థల కైవశం చేసుకోవడానికి ప్రగతిశీల సృజన కారులను వేటాడ్డానికి సంఘ పరివార్‌ చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ తరహా వ్యాఖ్యలను చూడవలసి ఉంటుంది. కేవలం మూడో వంతు ఓట్లతో ఒక్కసారి లోక్‌సభలో స్వంతంగా ఆధిక్యత వచ్చినంత మాత్రాన తమ సిద్ధాంతాలను దేశ ప్రజలు మొత్తంగా ఆమోదించారని బిజెపి, ఆరెస్సెస్‌ నాయక గణం టముకు వేసుకోవడం హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ఈ నేతల మాటల్లో పొంగిపొర్లుతున్న అతిశయాలు అహానికి అద్దంపడుతున్నాయి.
ముందుగా నెహ్రూ మ్యూజియం గ్రంథాలయం సంగతి చూద్దాం. నెహ్రూ నివసించిన తీన్‌మూర్తి భవన్‌ను ఆయన మరణానంతరం మ్యూజియంగా మార్చారు. గ్రంథాలయం పరిశోధనా కేంద్రం నెలకొల్పారు. కాంగ్రెస్‌ సంస్కృతి ప్రకారం నెహ్రూ, గాంధీ కుటుంబం కనుసన్నల్లో నడుస్తున్నా అక్కడ అనేక విద్యా విజ్ఞాన కార్యక్రమాలు నడుస్తున్నాయనేది నిజం. లౌకిక, ప్రజాతంత్ర మేధావులు, పరిశోధకులు దాన్ని బాగా ఉపయోగించుకుంటారు. మహేష్‌ రంగరాజన్‌ ఈ నేపథ్యంలో దాని డైరెక్టర్‌గా పనిచేసేవాడు. ఆయన ప్రసిద్ధిగన్న పరిశోధకుడు, అధ్యాపకుడుగా గౌరవం పొందారు. ఇప్పటి వరకూ మ్యూజియం డైరెక్టర్లుగా పనిచేసిన వారంతా 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకూ పదవిలో ఉన్నారు. ఈయనకు కూడా ఆ అవకాశం కల్పించేందుకై కొంత పొడిగింపునిస్తూ మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం చివరి క్షణాల్లో అంటే ఎన్నికల ప్రకటనకు రెండు రోజుల ముందు ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని కారణంగా చూపించి మోడీ ప్రభుత్వ సాంస్కృతిక శాఖా మంత్రి మహేష్‌ శర్మ ప్రతికూల వైఖరి ప్రకటించారు. దాంతో రంగరాజన్‌ ఐచ్ఛికంగా రాజీనామా సమర్పించి నిష్క్రమించారు. ఆయన రాజీనామా ఆమోదించవద్దని మేధావులు చాలా మంది సూచించారు. కానీ రెండు సార్లు వారించినా రాజీనామాకై పట్టుపట్టారు గనక తాము అంగీకరించామంటూ కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే ఐసిహెచ్‌ఆర్‌ డైరెక్టర్‌గా సుదర్శన రావును, ఫిలిం టెలివిజన్‌ శిక్షణా సంస్థ సారథిగా గజేంద్ర చౌహాన్‌ను, ఇంకా దీనానాథ్‌ బత్రా, తదితర ఆరెస్సెస్‌ తలలను తెచ్చి ప్రతిష్టాత్మక సంస్థలను కాషాయీకరించిన విధానమే ఇక్కడా పునరావృతమైంది.
నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయక ముందు జరిగిన తొలి పార్లమెంటరీ సమావేశంలోనే దీనదయాళ్‌ వారసత్వం గురించి మాట్లాడ్డం యాదృచ్ఛికం కాదు. ఆయన పాలక పార్టీ తొలి నాయకుడు గనక శతజయంతి వేడుకలు జరుపుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన చెప్పిన సమగ్ర మానవతావాదం ఏదో ప్రత్యేక సిద్ధాంతం అన్నట్టు మాట్లాడ్డమే అర్థ రహితం. సంఘ పరివార్‌ భావజాలానికి ఒకింత గాంధేయ పదజాలం అద్ది హిందూ మత కోణంలో వాదనలు చేసినదే దీన దయాళ్‌ వాదం. కమ్యూనిజం ఇంకా చాలా ఆకర్షణీయమైన సిద్ధాంతంగా ఉండగానే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించడం దీన దయాళ్‌ గొప్పతనమని ఈ సందర్భంలో అరుణ్‌ జైట్లీ చేసిన వ్యాఖ్య వారి ఉద్దేశాలకు అద్దం పడుతుంది. ఎవరి దాకానో ఎందుకు, బిజెపి కూడా ఈ పైపై సిద్ధాంతాన్ని పట్టించుకోలేదు.
జనతా పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కారకులైన నాటి జనసంఫ్‌ు నేతల తరపున అద్వానీ 1980 ఫిబ్రవరి26న జనతాపార్టీ అధ్యక్షుడైన చంద్ర శేఖర్‌కు లేఖ రాశారు. తాము గాంధేయ సోషలిజానికి, లౌకికతత్వానికి కట్టుబడి ఉన్నామని అందులో పేర్కొన్నారు. 1980 డిసెంబరు20న బిజెపిగా తొలి ప్లీనరీ సమావేశం జరిగినప్పుడు గాంధేయ సోషలిజంతో పాటు జాతీయవాదం, సానుకూల లౌకికవాదం వంటి లక్ష్యాలను జతపర్చారు. 1984 ఎన్నికల్లో ఇవన్నీ విఫలమై బిజెపి రెండు సీట్లకు పడిపోయింది. 1985 మార్చిలో సమగ్ర మానవ తావాదం పేరిట 47 పేజీల పత్రం విడుదల చేశారు. ఏడాది తిరక్కుండానే 1986 జనవరి 31న రాజీవ్‌గాంధీ ప్రభుత్వం అయోధ్యలో వివాదాస్పద కట్టడం తాళాలు తీసింది. ఇంకేముంది? పాత పల్లవులన్నీ పక్కకు నెట్టి హిందూత్వ సిద్ధాంతం తలకెత్తుకున్నారు. దీని సృష్టికర్త, గాంధీజీ హత్య కేసులో నిందితుడుగా చివరి వరకూ విచారణ నెదుర్కొని సాంకేతికంగా బయిటపడిన దామోదర సావర్కార్‌. ఆ మాటకొస్తే దీన దయాళ్‌ కూడా తక్కువేమీ కాదు. 1961లో ఆయన గాంధీజీని గౌరవిద్దాం కాని జాతిపిత అనడం ఆపేద్దాం అని పిలుపునిచ్చారు! మౌలికంగా తమ నరనరాల్లో సంఘ పరివార్‌ భావాలు ప్రవహిస్తున్నట్టు చెప్పుకునే బిజెపి నేతలకు గోల్వాల్కర్‌, దేవరస్‌ల భావాలు శిరోధార్యమని అందరికీ తెలుసు. గాంధీజీ హత్యకేసు నిందితుడు సావర్కార్‌ చిత్రం పెడతారు. గాడ్సేను పొగుడుతారు, కానీ గాంధేయ సోషలిజం అంటారు. ఇందులోని అవకాశవాదం ఎంతగా వర్ణించినా సరిపోదు. అలాటి వారు దీన దయాళ్‌ పేరిట నెహ్రూ కేంద్రాన్ని ఆక్రమించుకోవడం ఉదారవాద భావజాలంపై దాడి చేసేందుకే దారి తీస్తుంది.
ఈ దేశానికి నెహ్రూ ఒక్కరే నాయకుడు కాదంటూ వారు తమ నేతలను పదే పదే పైకి తీసుకొస్తున్నారు. ఇటీవలనే స్టాంపులను కూడా ఉపసంహరించారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయికి భారతరత్న ప్రకటించారు. మరి అదే సమయంలో దేశాన్ని విశేషంగా ప్రభావితం చేసి వారి పార్టీ కూడా కుహనా సోషలిజం జపించక తప్పనంత ప్రభావం చూపిన కమ్యూనిస్టు ఉద్యమ నేతలు ఎందుకు కనిపించరు? సోషలిజం తాము జపించినప్పుడు దేశీయం, కమ్యూనిస్టులు చెబితే విదేశీయం అయిపోతుందా? ఉదాహరణకు సిపిఎం ఎప్పుడూ భారత దేశ నిర్దిష్ట పరిస్థితులకు తగిన సోషలిజం అని చెబుతున్నదే! కానీ శ్రమజీవుల హక్కుల కోసం పోరాడ్డం అంటే వారికి కంటగింపు గనక శ్రమజీవుల పోరాట ఐక్యతను ముక్కలు చేయడమే సంఫ్‌ు లక్ష్యం గనక ఏవో ముసుగులతో, తొడుగులతో మత విద్వేషం, అగ్ర వర్ణ ఆధిపత్యం ప్రచారం చేస్తుంటారు. ఈ సమయంలో ప్రధాని మోడీ అమెరికాలో అగ్ర శ్రేణి ఫార్చ్యూన్‌ కంపెనీలను ప్రసన్నం చేసుకోవడానికి తంటాలు పడినా, అమెరికా ముందు సాగిలపడినా అందులో దేశీయం ఏముంది? గుత్తాధిపతులను సంతోషపెట్టే మార్కెట్‌ మంత్రం తప్ప! నెహ్రూ విధానాల్లో మిగిలిన విమర్శలు ఏమైనా స్వావలంబన, లౌకికతత్వం చెప్పుకోదగిన పాత్ర వహించాయి. అవి మరింత సక్రమంగా అమలు జరిగేందుకు కమ్యూనిస్టులు పోరాడారు. కనుకనే బిజెపి ఆరెస్సెస్‌లు ఆ ఇద్దరిపైనా దాడి చేస్తున్నారు. మార్క్సిస్టు మేధావులు భారత దేశ చరిత్రను తప్పుగా చిత్రించారని కూడా ఇటీవలనే వెంకయ్య నాయుడు వాపోయారు. గతాన్ని మతం కళ్లతో చూసి చరిత్రను తలకిందులుగా చిత్రించడం ఆరెస్సెస్‌కే అలవాటు. పురాణాలనూ, విజ్ఞాన శాస్త్రాలనూ కలగాపులగం చేయడం వారికే చెల్లింది. వినాయకుడిలో ప్లాస్టిక్‌ సర్జరీ ఉందని మోడీ చెబితే ప్రాచీన రుషులు ఇంజనీర్లు, శాస్త్రజ్ఞులని రక్షణ మంత్రి పరిక్కర్‌ అంటారు. మత విశ్వాసాలు ఎవరికైనా ఏవైనా ఉండొచ్చు. కానీ వాటిని విజ్ఞానశాస్త్రాల కింద చలామణి చేయడమే దారుణం. ప్రస్తుతం చరిత్ర పరిశోధనా మండలి బాధ్యతలు చేపట్టిన సుదర్శన రావు ఆ విషయంలో సిద్ధ హస్తుడు. అలాటి వారికి నెహ్రూ మ్యూజియం లైబ్రరీ నుంచి ఇక ఇతోధిక సహకారం లభిస్తుందన్నమాట!
ఇక రాష్ట్రంలో కమ్యూనిస్టులకు చోటు లేకుండా పోయిందన్న వెంకయ్య నాయుడుగారి మాటలు చూద్దాం. ఇప్పటికి ఎన్నో ఏళ్ల కిందటే ఇక్కడ నెగ్గలేక కర్ణాటకను ఆశ్రయించి నెట్టుకొస్తున్న వ్యక్తి ఆ సంగతి మర్చిపోవడం వింతే మరి. తమ అధినేతలంతా కొలువైన ఢిల్లీలోనే ఠికాణా లేకుండా పోయిన ఉదంతం ఇంత తొందరగా మర్చిపోయారన్నమాట. రేపు బీహార్‌ కోసం శత విధాల తంటాలు పడటం దేశమంతటికీ కనిపిస్తున్నది. కింది తరగతుల ఓట్లు ఎలాగూ రావన్న అనుమానంతో పై తరగతుల మెప్పు కోసం రిజర్వేషన్లపైనే దాడికి దిగారనీ అందరికీ తెలుసు. రకరకాల నినాదాలతో, మతతత్వ రాజకీయాలతో, దేశ విదేశీ గుత్తాధిపతుల సేవలతో అధికారం సంపాదించుకోవడం పెద్ద ఘనకార్యమేమీ కాదు. ఆఖరుకు మోడీ అనే నేతను ఆకాశానికెత్తి ప్రచారం చేసి ఆ పైన అచ్చంగా ఆ శక్తులకే అప్పగించిన వైనమే నడుస్తున్న భారతం. ప్రజల కోసం పోరాడ్డం, దేశ స్వాతంత్రం సమైక్యత సార్వభౌమత్వాలను కాపాడేందుకై పోరాడ్డం సుందరయ్య వారసత్వం. ఆ క్రమంలో జయాపజయాలు ఏమైనా రంగులు మార్చని ఎర్రబాట ఆయన వారసులది. ఆరెస్సెస్‌ రిజర్వేషన్లపై దాడి చేస్తున్న తరుణంలోనే ఢిల్లీలో దళిత్‌ శోషణ్‌ ముక్తి మంచ్‌ సమరశీల నినాదాలు వినిపిస్తున్నది. ఆ విధంగా విశాల సామాజిక శక్తులను సమీకరిస్తూ ఆ ఉద్యమం ముందుకు సాగుతుంది.
- తెలకపల్లి రవి