వామపక్ష శక్తుల విచ్ఛిన్నం ఆర్‌ఎస్‌ఎస్‌ తరం కాదు. - రామారావు

అభ్యుదయ, వామపక్ష శక్తులను విఛ్చిన్నం చేయటం ఆర్‌ఎస్‌ఎస్‌ తరం కాదని, పేద, ధనిక తారతమ్యాలు ఉన్నంత కాలం ఆయా శక్తులుంటాయని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయంపై ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపి దాడిని నిరశిస్తూ ఆదివారం నగర పార్టీ కార్యాలయం నుండి శంకర్‌ విలాస్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఢిల్లీలోని జెఎన్‌యు ఎంతో మంది మేధావుల్ని, దేశానికి నాయకుల్ని అందించిందన్నారు. అలాంటి వర్సీటీలో చోటు చేసుకున్న ఒక ఘటనను ఆధారం చేసుకొని అక్కడున్న అభ్యుదయ, వామపక్ష, ప్రజాతంత్ర శక్తులన్నింటినీ విచ్ఛన్నం చేయటానికి బిజెపి ప్రయత్నిస్తుందన్నారు.ఈ నేపధ్యంలోనే సిపిఎం జాతీయ కార్యాలయంపైనా దాడి జరిగిందని, ఇది లౌకిక వాదంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.ఒక జాతీయ పార్టీ కార్యాలయంపై ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపికి చెందిన వారు దాడికి పాల్పడటం హేయమని చర్యని, దీనికి ప్రభుత్వ అందదండలు పుష్కలంగా ఉన్నాయన్నారు. నేను చెప్పిందే వినాలి, భిన్నాభిప్రాయాలకు తావు లేదనే విధంగా కేంద్ర ప్రభుత్వ పాలన ఉందన్నారు. మతోన్మాదుల ఆగడాలు సిపిఎం కార్యాలయంపై దాడితో ఆగవని, మేధావులు, ప్రజాస్వామ్య వాదులు, ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని, వీరి ఆగడాలను ప్రజాస్వామ్య శక్తులన్నీ ఖండించాలని కోరారు. సాంఘిక, సైద్ధాంతిక, విద్యా అన్ని రంగాల్లో మతోన్మాదులు వారి భావాలను చొప్పించి దేశ ఐక్యతకు భంగం కలిగించే చర్యలను అడ్డుకుని తీరుతామన్నారు.అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలువబడే దేశంలో ప్రజాస్వామ్యానికి స్థానం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం విశ్వాసం లేని ఫాసిస్ట్‌ శక్తులు దేశాని పాలిస్తున్నాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు వారే ఘర్షణలు సృష్టించి వాటి ద్వారా లబ్ది పొందాలని చూస్తున్నారన్నారు.