వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన కోసం ప్రజా సమీకరణ

మానవ చరిత్రను మార్చిన అక్టోబరు మహా విప్లవం ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమని సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. దేశంలో పాలకులు.. పెట్టుబడిదార్ల గుప్పిట్లో చిక్కుకున్న క్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులను సమీకరించి వారితో వామపక్ష ప్రజాతంత్ర సంఘటనను రూపొందించాలని పిలుపునిచ్చారు. గుంటూరులో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన 'అక్టోబర్‌ మహా విప్లవ శతవార్షికోత్సవ సభ'కు ఏచూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభకు సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు అధ్యక్షత వహించారు. ఏచూరి మాట్లాడుతూ.. అన్ని దేశాల్లో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులతోనే ఉద్యమాలు నడుస్తున్నాయని చెప్పారు. సోషలిజం కోసం పోరాడాల్సిన అవసరాన్ని అక్టోబర్‌ విప్లవం తర్వాత లెనిన్‌ ప్రత్యేకంగా చెప్పారని గుర్తుచేశారు. పస్తుతం సోవియట్‌ యూనియన్‌ లేకున్నా అక్టోబరు మహా విప్లవ ప్రాధాన్యం ఎంతో ఉందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా పెట్టుబ డిదారీ వర్గాలకే కొమ్ముకాస్తున్నాయని విమర్శిం చారు. ప్రజలకు విద్య, వైద్యం, నివాసం కల్పించడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించారు. ఆర్థిక సంక్షోభం, పెట్టుబడిదారీ సంక్షోభం, దోపిడీలతో వర్థిల్లుతున్న మన దేశంలో ప్రజాతంత్ర విప్లవం సాధించడానికి తగిన కృషి అవసరమని నొక్కిచెప్పారు. మతోన్మాద రాజకీయాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసిన ఏచూరి కుల వ్యవస్థ, సామాజిక దౌర్జన్యాలను నిర్మూలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. చాలా దేశాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొందని, పెట్టుబడిదారీ వర్గం తీరుతెన్నులపై కారల్‌ మార్క్స్‌ రాసిన పెట్టుబడి గ్రంథాన్ని పోప్‌ సైతం అధ్యయనం చేశారని చెప్పారు. మార్క్స్‌ మరణించినా ఆయన సిద్ధాంతం ప్రజల్లో జీవించి ఉందనడానికి ఇదొక ఉదాహరణగా పేర్కొన్నారు.