వాగ్దానం చేసిన ఉద్యోగాలెక్కడ

దేశంలో నిరుద్యోగం పెరుగుదల, ఉద్యోగాలు పెరగక పోవటాన్ని గురించి ఈమధ్య కార్పొరేట్‌ మీడియా చర్చ చేస్తున్నది. లేబర్‌ బ్యూరో చేసిన త్రైమాసిక సర్వేలో ఉద్యోగాల పెరుగుదల ఎక్కువగా ఉండే ఎనిమిది రంగాలైన బట్టల పరిశ్రమ, చేనేత వస్త్రాలు, బంగారు నగలు, నూలు ఉత్పత్తి, ఐటి రంగం, తోలు ఉత్పత్తులు, లోహాలు, ఆటోమొబైల్స్‌లలో 2014లో 4,90,000 మందికి, 2009లో 12,50,000 మందికి ఉద్యోగాలుకల్పించగా 2015లో 1,50,000 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించి నట్లుగా వెల్లడి కావటం ఈ చర్చకు తక్షణ కారణం కావచ్చు. గ్రామీణ ఉద్యోగితకు సంబంధించి పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. జిడిపిలో వ్యవసాయ రంగం వాటా తగ్గుతున్నది. గ్రామీణ ప్రాంతంలోని పేదలకు, యువతకు వ్యవసాయ రంగం నుంచి ఇతర రంగాలలో ఉద్యోగాలు కల్పించే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఈ సంవత్సరం మార్చి మూడవ వారం వరకు 8,40,00,000 మంది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని దరఖాస్తులు పెట్టుకోవటం గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగ తీవ్రతను తెలుపుతున్నది.
పార్లమెంటు ఎన్నికల సందర్భంలో బిజెపి, నరేంద్రమోడీ పెద్ద మొత్తంలో ఉద్యోగాలు కల్పిస్తామని చేసిన వాగ్దానం ప్రధానమైనది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఉద్యోగ రంగంలో పరిస్థితి నిరాశాజనకంగా ఉన్నది. ప్రభుత్వం జిడిపి 7.5 శాతం పెరుగుతున్నదని తప్పుడు లెక్కలు చెబుతున్నప్పటికీ, ఈ విధమైన నయా ఉదారవాదంపై ఆధారపడిన పెరుగుదల ఉద్యోగాలను సృష్టించలేదని స్పష్టమౌతున్నది. ప్రభుత్వాన్ని సమర్థించే ఆర్థికవేత్తలు, కార్పొరేట్‌ మీడియా విశ్లేషకులు ఎప్పటిలాగే ఆర్థికవ్యవస్థలో పెరుగుదల వేగవంతం కావటానికి, ఉద్యోగాలు పెరగటానికి వివిధ రకాలైన సలహాలు ఇస్తున్నారు. కానీ వారందరూ అసలు విషయాన్ని వదిలేస్తున్నారు. అసలు వాస్తవం ఏమిటంటే నయా ఉదారవాద అభివృద్ధి ఉద్యోగాలను పెంచకపోగా, ఉన్న ఉద్యోగాలను కూడా కుదిస్తుంది. ఈ వ్యవస్థకు ఎన్ని విధాలైన అతుకులు పెట్టినప్పటికీ విధానాలలో మౌలికమైన మార్పులు లేకుండా నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేరు.
ప్రయివేటీకరణపైనా, ప్రయివేటు పెట్టుబడులపైనా మరింతగా ఆధారపడటం ఉద్యోగాలను కల్పించదు. పెట్టుబడులు ఎక్కువగా, కార్మికులను తక్కువగా వినియోగించే సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే రంగాలలోకి పెట్టుబడులు తరలివచ్చే విధంగా నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ఆదేశిస్తాయి. ఇవి కార్మికులను పెద్దసంఖ్యలో వినియోగించటాన్ని నిరోధిస్తాయి. దీనితో పాటు దొరికే ఉద్యోగాలు కూడా కాంట్రాక్టు ప్రాతిపదికగా, అభద్రతతో కూడిన, కొద్దికాలం మాత్రమే ఉండేవాగానే ఉంటాయి. భారతదేశంలో పెద్ద మొత్తంలో ఉద్యోగాలు కల్పించే అసంఘటితరంగంలో కూడా 2004-05 నుంచి 2011-12 మధ్యకాలంలో ఉద్యోగాలు 6 శాతం తగ్గాయి.
కార్మికులను ఎక్కువగా వినియోగించే పరిశ్రమలు కాని, చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయటం కాని నయా ఉదారవాద అభివృద్ధి ప్రాధాన్యత కాదు. వాణిజ్యాన్ని సరళీకరించటం వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే పారిశ్రామిక సరుకులపై సుంకాలు తగ్గి, దేశీయ పరిశ్రమలు నడపటం గిట్టుబాటుకాక అనేక రంగాలు పారిశ్రామిక రహితం అవుతున్నాయి. నయా ఉదారవాద విధానాల వల్ల ప్రభుత్వం బడా కార్పొరేట్‌ సంస్థలకు, ధనికులకు వేలాది కోట్ల రూపాయల సబ్సిడీలను ఇవ్వటం, పన్నులను వదులుకోవటం చేస్తున్నది. అదే సమయంలో లక్షలాది మంది స్త్రీపురుష కార్మికులకు ఉపాధి కల్పించే సంప్రదాయ పరిశ్రమలైన చేనేత, జీడిపప్పు, కొబ్బరిపీచు, చేతివృత్తులకు మద్దతును అందించటానికి తిరస్కరిస్తున్నది. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించటం, సామాజిక రంగాలలో-విద్య, వైద్యం, యంజియన్‌ఆర్‌ఇజిఎ- పెట్టుబడులలో తీవ్రంగా కోతపెట్టటం కూడా దేశంలో ఉద్యోగిత కల్పించే శక్తి తగ్గటానికి కారణం అవుతున్నాయి.
అన్ని రంగాలలో ఉపాధి కల్పించే విధంగా ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా కావాలి. వ్యవసాయ రంగం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వ పెట్టుబడులను పెద్ద ఎత్తున పెంచాలి. ఇవి ఉద్యోగాలను కల్పిస్తాయి. కార్మికులను ఎక్కువగా వినియోగించే పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయోత్పత్తులను ప్రాసెసింగ్‌ చేసే పరిశ్రమలను ప్రోత్సహిస్తూ, వాటికి రాయితీలు అందించాలి. విద్య, వైద్యరంగాలలో ప్రభుత్వ పెట్టుబడులు గణనీయంగా పెరగటం ప్రభుత్వ వైద్యం, విద్య విస్తరించటానికి, నాణ్యత పెరగటానికి దారితీసి ఉద్యోగాలను కల్పిస్తుంది. వీటితో పాటు యువతకు వృత్తి శిక్షణ, నైపుణ్యం పెంచటంపై కేంద్రీకరించటం వల్ల వివిధ రంగాలలో వచ్చే విభిన్నమైన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవటానికి వారిని సన్నద్ధం చేస్తుంది.