వలసలు..

వలసలు లేకపోతే మానవాళి నేడున్న విధంగా భూగోళం అంతా విస్తరించి ఉండేది కాదు. ఆదిమ మానవుల కాలంలో ఒక గుంపు పరిమాణం చాలా పెద్దదిగా మారినప్పుడు ఆ గుంపులోని ఒక భాగం వేరే ప్రాంతానికి వలసవెళ్లేవారు. అందువల్ల మానవ నాగరికతా వికాసానికి కూడా ఈ వలసలు కారణమని చెప్పవచ్చు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, నదులు, సముద్రాలు, అడవులు దాటి కూడా వెళ్ళడానికి ఈ వలసలు దారితీశాయి. బహుశా దీని నుంచే కొన్ని ఊళ్ళ పేర్లకు చివర వలస, ఊరు అనే పదం వచ్చి ఉంటుంది. తగరపు వలస, ఆమదాల వలస, కొత్తూరు, పాతూరు వంటివి పేర్లు అలాగే వచ్చి ఉండవచ్చు. మొట్టమొదట ఈ వలసలు ఆఫ్రికాలో సాగినట్లు చరిత్ర చెబుతోంది. తెల్లవారి జనాభా బాగా పెరిగిపోవడంతో అనేక ప్రాంతాలకు వలసలు వెళ్ళి అక్కడి మూలవాసులను తరిమేసి, కొన్ని సందర్భాల్లో చంపేసి కూడా తమ ఆవాసాలను ఏర్పరచుకున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి అనేక దేశాలు అలా ఏర్పడినవే. ఆయా ప్రాంతాలలోని సహజ వనరులను దోచుకునేందుకు ఈ వలసలు జరిగాయి. ఆఫ్రికాలోని వజ్రాలు, బంగారు గనులను తెల్లవారు ఆక్రమించుకొని అక్కడి మూలవాసులను వాటిల్లో పనిచేయించిన వైనం మనకు తెలుసు.
వలసలు కేవలం మానవులకే పరిమితం కాదు. జంతువులు, పక్షులు, సీతాకోక చిలుకలు, క్రిమికీటకాదులు కూడా వలస వెళ్తుంటాయి. ఎక్కడో సైబీరియా నుంచి అనేక రకాల పక్షులు మన దేశంతోపాటు అనేక దేశాలకు ప్రతి సంవత్సరం వలస వచ్చి, ఇక్కడ పిల్లలను పొదిగి తమ సంతతిని వృద్ధి చేసుకుని తిరిగి వెళ్ళడం కన్పిస్తుంది. మన రాష్ట్రంలోని తేలినీలాపురం, ఉప్పలపాడు వంటి ప్రదేశాలకు ప్రతి సంవత్సరం ఇలా పక్షులు సుదూర ప్రాంతాల నుంచి వలస వస్తుంటాయి. కొన్ని సముద్ర జీవజాతులు ఇలా ప్రతిరోజూ వేరే ప్రాంతాలకు వలసవెళ్ళి సాయంత్రానికి తిరిగి తమ నివాస ప్రాంతానికి చేరుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది.
పెట్టుబడిదారీ సమాజ ఆవిర్భావంతో అనేక దేశాలను వలసలుగా చేసుకునే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా ఫ్రెంచి, డచ్చి, ఇంగ్లీషువారు అనేక దేశాలను తమ వలసలుగా మార్చుకున్న చరిత్ర తెలిసిందే. ఆంగ్లేయులైతే సూర్యుడు అస్తమించని విశాలమైన బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. వారు తమ లాభాల వేటలో ఖండాతరాలకు వెళ్ళి అక్కడి ప్రజలను తమ బానిసలుగా మార్చుకొని, వారి శ్రమ శక్తిని దోచుకుని లాభాలను తమ స్వదేశాలకు తరలించుకుపోయిన విషయం తెలిసిందే. వలసలనేవి ఒక దేశం నుంచి మరో దేశానికి మాత్రమేగాక దేశాల లోపల కూడా జరుగుతున్నాయి. మన దేశానికి స్వాతంత్య్రం లభించిన సమయంలో ఇలా ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, భారత్‌ నుంచి పాకిస్తాన్‌కు, పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు తరలి వెళ్ళే క్రమంలో పెద్ద సంఖ్యలో శరణార్థులు మరణించడం, చంపేయడం జరిగింది.
వలసల్లో శాశ్వత వలసలు కొన్ని కాగా, ఆయా కాలాల్లో అంటే పనులున్న కాలాల్లో వలసలు వెళ్ళడం మరోటి. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో సాంకేతిక విద్యనభ్యసించినవారు ఇతర దేశాలకు వలసపోవడం చాలా ఎక్కువగా ఉంది. తమ దేశాల్లో తమ చదువుకు తగిన ఉద్యోగాలు దొరకకపోవడం, అక్కడ ఎక్కువగా డబ్బు సంపాదించేందుకు అవకాశాలుండటమే ఈ మేధో వలసలకు ప్రధాన కారణం. ఇలా వలసవెళ్ళిన మేధావులు అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్న సందర్భాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. శ్రమ వలసలు ఇలా శాశ్వస నివాసాల ఏర్పాటుకు అవకాశమివ్వవు. ఇలా వలసవెళ్ళేవారు ఎక్కడ పనిదొరికితే అక్కడికి సంవత్సరమంతా తిరుగుతూ ఉంటేనే వారికి జీవనోపాధి లభిస్తుంది. ఇంకా పాలకుల విధానాల మూలంగా వ్యవసాయం పూర్తిగా దెబ్బతినడం, లాభసాటిగా లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి పనుల కోసం పట్టణ ప్రాంతాలకు ఇటీవలి కాలంలో వలసలు బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మనకు మేధో వలసలు, శ్రమ వలసలు, పెట్టుబడి వలసలు అనే మాటలు విన్పిస్తున్నాయి. అభివృద్ధి చెందిన, ధనిక ప్రాంతాలకు చెందినవారు మేధో వలసలు వెళ్తుండగా, వెనుకబడిన, పేద ప్రాంతాల ప్రజలు శ్రమ వలసలకు వెళ్తున్నారు. మేధో వలసలకు వెళ్ళేవారు తమ మేధస్సును, తెలివితేటలను అమ్ముకుంటుండగా, శ్రమ వలస ప్రజలు తమ శ్రమ శక్తిని అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. 
నేడు ప్రపంచవ్యాప్తంగా వలసలు ప్రధాన సమస్యగా ఉంది. ఒకప్పుడు వలస వచ్చి దేశాలను ఆక్రమించినవారే ఇప్పుడు వలసలను సహించలేని స్థితిలో ఉన్నారు. ఆ వలసలకు కూడా వారే ప్రధాన కారకులు. వారు సృష్టించిన యుద్ధాల వల్ల అనేక దేశాల ప్రజలు ముఖ్యంగా ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌, తాజాగా సిరియా నుంచి వలసలు ఎక్కువగా సాగుతున్నాయి. తమ స్వస్థలాలను వదిలి అనేక వందలు, వేల కిలోమీటర్ల దూరంలోని ప్రదేశాలకు వలసలు వెళ్ళాల్సిన పరిస్థితిని సామ్రాజ్యవాదులు కల్పిస్తున్నారు. ఇలా వలసలు పోతూ వేలాది మంది సముద్రంలో పడవలు మునిగి చనిపోతున్నారు. ప్రాణాలతో బయటపడినవారు కూడా ఆయా దేశాల ప్రభుత్వాలు తమను అనుమతించకపోవడంతో దిక్కులేని పక్షులుగా మారుతున్నారు. తమ స్వదేశంలోనే ప్రశాంతంగా నివసించే అవకాశాలు ఏర్పడినప్పుడు మాత్రమే ఈ బలవంతపు వలసలు తగ్గి ప్రపంచంలో శాంతి నెలకొంటుంది.