వరద బాధితులకు మంచినీరు,ఆహారం పంపిణీ..

వరద బాధితులకు సిపిఎం అపన్నహస్తం అందించింది. నెల్లూరు నగరంలో బాధితులకు స్వయంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు నేతృత్వంలో సాయం అందజేశారు. నాయకులు నడుముల్లోతు నీళ్లలోనే వెళ్లి బాధితులను పరామర్శించారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఆహారపొట్లాలు, మంచీనీటి ప్యాకెట్లు, కొవ్వొత్తులు అందించారు.ఐదురోజులుగా నగరంలోని సుమారు 30 వేల ఇళ్లు నీటిలోనే ఉండడం పట్ల మధు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించేందుకు సిపిఎం ముందుంటుందన్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే వరద సంభవించిందన్నారు. ముందస్తు సమాచారం లేకుండా నెల్లూరు చెరువు గేటు ఎత్తేశారని అన్నారు. కాలువలు ఆక్రమణకు గురికావడం వల్లనే నీరు తియ్యలేదన్నారు. బాధితులను ఆదుకునేందుకు ముందుకొస్తున్న వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.