లబ్ధి పొందేదెవరు?

సింగపూర్‌ ప్రభుత్వమే రాజధానికి సహాయం చేస్తున్నదని మరో అబద్ధం విస్తృత ప్రచారంలో ఉంది. సింగపూర్‌ కన్సార్టియంలోని సంస్థలన్నీ ప్రయివేటువే. సింగపూర్‌ ప్రభుత్వం నయా పైసా ఇవ్వడంలేదు. వారుచేసేది సహాయంకాదు. పక్కా వ్యాపారం మాత్రమే. కన్సార్టియంలోని సింగపూర్‌ కంపెనీలకు మూల సంస్థ టెమ్‌శాక్‌లో వివిధ దేశాలవారి పెట్టుబడులున్నాయి. మన రాష్ట్రానికి చెందిన నేతలకు వాటాలున్నాయి. రాష్ట్రంలో ఈ కంపెనీ థర్మల్‌ ప్రాజెక్టులు నిర్మిస్తూ లాభాలు గడిస్తున్నది. భవిష్యత్‌లో వీటిలో ఎవరైనా వాటాలు కొనవచ్చు. ఇప్పటికే పాలకపార్టీ నేతలకు, వారి కుటుంబ సభ్యులకు ఈ కంపెనీల్లో బినామీగా వాటాలున్నట్లు వచ్చిన వార్తల్లోని గుట్టు రట్టుగాక తప్పదు. విదేశీ కంపెనీల భాగస్వామ్యంతో లాభం లేకపోగా అన్నీ నష్టాలే. స్టార్ట్‌ అప్‌ ఏరియాగా నిర్ధారించిన గ్రామాల్లో నివాసాలు మొదలు శ్మశాన వాటికల వరకు ఖాళీ చేయించి మొత్తం స్థలాన్ని సింగపూర్‌ కంపెనీలకు అప్పగించాలనే షరతు విధించారు. రాజధాని ప్రజలు ఇక నిర్వాసితులుగాక తప్పదు. రాజధానిలోని రెండు గ్రామాల అభివృద్ధికే 20 ఏళ్ళు పడితే మిగిలిన 27 గ్రామాలు బాగుపడేదెప్పుడు? సిఆర్‌డిఎ పరిధిలోని 56 మండలాల్లో సమగ్ర అభివృద్ధి ఎన్నేళ్ళకు? సింగపూర్‌ సంస్థలు ప్లాట్లు అమ్ముకునే వరకు సిఆర్‌డిఎ పరిధిలో గ్రీన్‌ బెల్టు పేరుతో ఆంక్షలు పెడుతూ కొత్త లేఅవుట్‌లు, నిర్మాణాలకు అనుమతులు నిరాకరించడం ఈ కుట్రలో భాగమే. రాష్ట్రంలోని ఇతర జిల్లాలను నిర్లక్ష్యంజేయడమేగాక కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఇతర మండలాల్లోనూ అభివృద్ధిని స్తంభింపజేయడం సింగపూర్‌ కంపెనీల ప్రయోజనానికేనని స్పష్టమవుతోంది.