లక్ష రుణమాఫీ చేయాలి:ఐద్వా

రాజధాని ప్రాంతంలో డ్వాక్రా మహిళలకు ఏకకాలంలో రూ. లక్ష రుణ మాఫీ చేయకపోతే గ్రామాల్లో ఉన్న క్రిడా కార్యాలయాలన్నింటినీ దిగ్బంధిస్తామని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి హెచ్చరించారు. రూ. లక్ష రుణమాఫీ తక్షణం అమలు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా తుళ్లూరులోని క్రిడా కార్యాలయం ఎదుట మంగళవారం డ్వాక్రా మహిళలు నిర్వహించిన ధర్నాలో ఆమె మాట్లాడారు. డ్వాక్రా మహిళలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు, ఇప్పుడు వాయిదాల పద్ధతిలో రుణమాఫీ చేస్తామనడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు తమ తడాఖా చూపిస్తారని హెచ్చరించారు. ఏడాదిన్నరగా రుణ బకాయిలు కట్టని మహిళలు ప్రస్తుతం చేసేందుకు పనుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో వ్యవసాయం ఉపసంహరణ నేపథ్యంలో రైతులకు ఒకేసారి రూ. లక్షన్నర రుణ మాఫీ చేసిన ప్రభుత్వం, డ్వాక్రా మహిళలకూ అదే పద్ధతి పాటించి రూ. లక్ష మాఫీ చేయాలని కోరారు.