
అతి కీలకమైన రవాణా శాఖను ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించాలని చూస్తోంది. అధికారం చేపట్టినప్పటినుంచీ ప్రైవేటు రాగం తీస్తున్న చంద్రబాబు ఒక్కొక్క ప్రజా సేవపై వేటు వేస్తూ వస్తున్నారు. తాజాగా రవాణా శాఖ సేవలను ప్రైవేటుపరం చేయడానికి రంగం సిద్ధం చేశారు. బిడ్డింగుల పేరిట బహుళ జాతి సంస్థలకు ఆ బాధ్యతను అప్పగించాలని చూస్తున్నారు. ముందుగా వాహన సేవలన్నింటినీ ఆన్‌లైన్ చేసి, వాటి బాధ్యతను ఐదు కార్పొరేట్ సంస్థలకు అప్పగించి కోట్ల రూపాయల భారాలను ప్రజలపై వేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఫిబ్రవరి నాటికి విధి విధానాలు విడుదల చేయనున్నట్లు తెలిసింది. ప్రభుత్వ నూతన విధానం వల్ల రాష్ట్ర రవాణా శాఖలోని వేలాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం నియంత్రణ కరువై అక్రమాలు పెరిగే ప్రమాదమూ ఉంది. రాష్ట్రంలో నాలుగు జోన్లలో 13 రవాణా శాఖ కార్యాలయాలున్నాయి. వీటి పరిధిలో 73 యూనిట్ కేంద్రాలు, పది చెక్‌పోస్టులు పని చేస్తున్నాయి. 2015 నాటికి ట్రాన్స్‌ఫోర్టు వాహనాలు 10,72,498, నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాలు 73,62, 776 ఉన్నాయి. రాష్ట్రంలో 84,35,266 వాహనాలకు, వాటి డ్రైవర్లకు వేర్వేరు రూపాల్లో రవాణా శాఖ సేవలం దిస్తోంది. ఒక్కో జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో 50 మంది, యూనిట్ కేంద్రాల్లో పది మంది వరకూ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తోంది. ఎల్‌ఎల్‌ఆర్, డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు (ట్రాన్స్‌పోర్ట్-నాన్ ట్రాన్స్‌ఫోర్ట్), ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, ఎన్‌ఒసి, రెన్యువల్, పర్మిట్‌లు వంటి సేవలందిస్తోంది. ప్రభుత్వ పర్యవేక్ష ణలో ఈ సేవలన్నీ ప్రజలకు అందుతున్నాయి. ఈ సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే జవాబుదా రీతనం పోయి లాభాల వేటలో నాణ్యతకు తిలోదకాలి చ్చే అవకాశాలున్నాయి. రహదారి భద్రత గాల్లో కలిసిపోయే ప్రమాదమూ ఉంది.
సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే రోడ్డు రవాణా శాఖను ప్రభుత్వం ప్రైవేటుకు అప్ప గిస్తే పారదర్శకత పూర్తిగా లోపిస్తుంది. దాదాపు అన్ని సేవలూ ప్రైవేటుపరం అవుతాయి. ఫిజికల్‌గా సర్టిఫైడ్ చేయాల్సిన ఎల్‌ఎల్‌ఆర్, లైసెన్సులు, ఫిట్‌నెస్ సర్టిఫికె ట్లు జారీ మాత్రమే రవాణా శాఖాధికారులకు మిగులు తాయి. ప్రధానంగా రిజిస్ట్రేషన్ సేవలు ప్రైవేటుకు వెళ్ల డంతో వాహనాల దొంగతనాలు పెరిగే అవకాశం ఉందని అంచనా. ప్రభుత్వ రాయితీలు పోయి ప్రజలకు ప్రైవేటు భారాలు పెరిగిపోతాయి. భారీగా ఫీజులు పెరిగే ప్రమాదమూ ఉంది. ప్రస్తుతం రవాణా శాఖలో పని చేస్తున్న ఉద్యోగులను పని లేదనే నెపంతో తొలగించే ప్రమాదమూ లేకపోలేదు. ప్రభుత్వ జోక్యం తగ్గితే రోడ్డు భద్రత కరువై ప్రమాదాలు కూడా భారీగా పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ రంగంలోనే భద్రత
ప్రజలకు రక్షణ, మెరుగైన సేవల కోసం ప్రభుత్వ రంగంలోనే రవాణా శాఖ ఉండాలి. ప్రైవేటీకరణ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. రవాణా శాఖ సేవలను ప్రైవేటుపరం చేస్తే ప్రభుత్వానికి ఆదాయం లేకుండా పోతుంది. రోడ్డు భద్రత కూడా ఉండదు. అక్రమాలపై నియంత్రణపోయి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ప్రైవేటీకరణ నిర్ణయంపై చంద్రబాబు పున్ణపరిశీలన చేయాలి.
- టి.రఘుబాబు
(ఆలిండియా నాన్ ట్రాన్స్‌పోర్టు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి)
రాష్ట్రంలో రావాణా శాఖ ద్వారా సేవలు పొందుతున్న వాహనాల వివరాలు
...........................................................................................
వాహనాల రకం 2013 2014 2015
...........................................................................................
టు వీలర్లు 48,71,760 54,31,832 65,94,355
ఫోర్ వీలర్లు(జీపులు, కార్లు) 3,88,304 4,34,516 5,19,539
ట్రాక్టర్లు (అన్ని రకాలు) 1,02,651 1,14,386 1,34,343
ట్రాలర్స్ (అన్ని రకాలు) 81,032 87,588 99,858
ఇతర వాహనాలు 8,377 11,228 14,681
ట్రాన్స్‌పోర్టు వాహనాలు 8,32,302 9,22,583 10,72,498
............................................................................................
మొత్తం వాహనాలు 62,84,376 70,02,143 84,35,266