
దళిత పరిశోధక విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్యకు కారకులైన విసి అప్పారావు, కేంద్రమంత్రులైన బండారు, స్మృతి ఇరానీలను కూడా కఠినంగా శిక్షించాలని కోరుతూ శుక్రవారం విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ బంద్ పూర్తిగా జయప్రదమయ్యింది. వేలాదిమంది విద్యార్ధులు తమ తరగతులను బహిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించారు. గత రెండురోజుల నుండి ఎస్.ఎఫ్.ఐ నాయకులు ప్రతి విద్యార్ధిని కలిసి కరపత్రాలు పంపిణీచేసి బంద్‌లో పాల్గొవాలని పెద్దఎత్తున ప్రచారం నిర్వహించింది. నేడు జరిగిన బంద్‌లో సిపియం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్.నరసింగరావు, నగర, జిల్లా కార్యదర్శులు బి.గంగారావు, కె.లోకనాధం గార్లు కూడా పాల్గొని తమ మద్దతు తెలియజేసారు. ఇతర వామపక్షపార్టీలు, ప్రజాసంఘాలు, దళిత సంఘాలు పాల్గొన్నాయి. ఈ ర్యాలీ ఎయు రిజిష్ట్రార్ కార్యాలయం నుండి జగదాంబ మీదుగా కలెక్టరేట్ వరకు జరిగింది.