రైవాడ నీటి కోసం సంఘటిత పోరాటం

 రైవాడ నీరు రైతులకు పునరంకితం అయ్యే వరకూ రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటం సాగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం పిలుపునిచ్చారు. రైవాడ నీరు రైతులకు ఇవ్వాలని కోరుతూ రైవాడ ఆయకట్టుదారుల నీటి సాధన కమిటీ ఆధ్వర్యాన ఈ నెల 14న ప్రారంభమైన పాదయాత్ర గురువారం విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం, ఆనందపురంలో ముగిసింది. ఈ సందర్భంగా సాధన కమిటీ అధ్యక్షులు వేచలపు చినరామునాయుడు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో లోకనాథం మాట్లాడారు. రైవాడ నీటిని సాధించేందుకు ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకొనే సమయం ఆసన్నమైందని, ఇందుకు ఆయకట్టుదారులు సిద్ధం కావాలన్నారు. రైవాడ జలాశయానికి జివిఎంసి బకాయి పడ్డ రూ.112 కోట్లు చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ బకాయిలను జివిఎంసి చెల్లిస్తే ఆ నిధులతో రైవాడ ప్రాజెక్ట్‌లో మట్టి తవ్వకాలు, శుద్ధి, మరమ్మతులు చేపట్టడం తదితర అభివృద్ధి పనులు చేపట్టవచ్చని చెప్పారు. విశాఖకు పోలవరం నీటిని సరఫరా చేసి రైవాడ నీటిని ఈ ప్రాంత ప్రజల సాగు, తాగునీటి అవసరాలకు అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు పక్కన పెట్టిందని విమర్శించారు. ఆ నిధులతో పట్టిసీమను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతుండటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైవాడ నీటిని ఆయకట్టుకు సరఫరా చేస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని, తద్వారా ఇక్కడి నుంచి వలసలు తగ్గుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధన కమిటీ సభ్యులు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.