
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశంలోని 400 రైల్వే స్టేషన్లను ప్రైవేట్ రంగం సాయంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. మోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మీడియాకు వెల్లడించారు. దేశంలోని వివిధ పట్టణాలు, నగరాల్లోవున్న ఎ వన్ క్యాటగిరీ, ఎ క్యాటగిరీ రైల్వే స్టేషన్లను ఎక్కడున్నది అక్కడే పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రైవేట్ పార్టీలను ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు. రైల్వే స్టేషన్ భూమిని వాణిజ్యపరంగా అభివృద్ది చేసేందుకు కూడా అనుమతివ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రైవేట్ సంస్థలు 400 రైల్వే స్టేషన్లను అభివృద్ది చేసేందుకు సంబంధించిన డిజైన్లు, వాణిజ్య సంబంధమైన ప్రతిపాదనలను పంపించాల్సి ఉంటుందని జైట్లీ వివరించారు. రైల్వే స్టేషన్ స్వాధీనంలోని భూమిని అభివృద్ధి చేయటం ద్వారా స్టేషన్ అభివృద్ధిని సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 400 స్టేషన్లు మెట్రో నగరాలు, పెద్ద నగరాలు, తీర్థయాత్రా ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాల్లో ఉన్నాయని రైల్వే శాఖ తెలిపింది. రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు రైల్వే శాఖ ఎలాంటి నిధులు ఖర్చు చేయకుండా, ప్రైవేట్ రంగం ద్వారా లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం పథకాలు సిద్ధం చేస్తోంది. రైల్వే శాఖ ప్రస్తుతం ఇండియన్ స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్ఎస్డిసి) ద్వారా రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అయితే దీనికోసం ప్రైవేట్ రంగాన్ని కలుపుకోకతప్పదని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులోభాగంగా ప్రైవేట్ రంగం నుంచి ఓపెన్ బిడ్లు ఆహ్వానించనున్నారు. స్విస్ చాలెంజ్ మెథడ్ అమలు చేస్తామని అరుణ్ జైట్లీ తెలిపారు.